Devotional

తెలంగాణాలో మగాళ్ల బతుకమ్మ

తెలంగాణాలో మగాళ్ల బతుకమ్మ

ఎక్కడైనా బతుకమ్మ ఆడవాళ్లే ఆడతారు. పువ్వు తీసుకురావడం వరకూ మగవాళ్లు ఓకే కానీ.. బతుకమ్మను పేర్చడం.. నిమజ్జనం చేయడం.. వాయినాలు ఇవ్వడం అంతా ఆడవాళ్ల పనే. కానీ.. సీతంపేటలో మగవాళ్లు బతుకమ్మ ఆడతారు.మగవాళ్లు బతుకమ్మ ఆడటం ఆశ్చర్యం కలిగించే విషయమే. కానీ తాతల నాటి నుంచీ వారసత్వంగా వస్తున్నదని చెప్తున్నారు వరంగల్‌ అర్బన్‌ జిల్లా హసన్‌పర్తి మండలం సీతంపేట గ్రామస్తులు. మామూలుగా తెలంగాణ అంతటా దసరాకు ముందు రోజున బతుకమ్మ పండుగ చేసుకోవడం ఆనవాయితీ. సీతంపేటలో కూడా పండుగ అదే రోజు జరుగుతుంది. అదికాకుండా దీపావళి రోజున కూడా బతుకమ్మ ఉంటుంది. ఈ పండుగను మాత్రం మగవాళ్లు చేస్తారు. వాళ్లే బతుకమ్మ ఆడిపాడతారు. గ్రామంలో నాలుగు వందల నేతకార కుటుంబాలు చేసుకునే వేడుక ఇది. దీపావళి నుంచి నాలుగు రోజుల పాటు కులదైవం కేదారీశ్వరుడిని స్మరిస్తూ నిర్వహిస్తారు. మూడ్రోజుల పాటు సాగే ఈ పండుగలో మొదటిరోజు ఆదివారం పురుషులు చెరువు వద్దకు వెళ్లి రేగడి మట్టిని తీసుకొచ్చి ఎడ్ల బొమ్మలు తయారుచేస్తారు. రెండోరోజు సోమవారం ఎడ్ల బొమ్మలను నిమజ్జనం చేస్తారు. సంబురాల్లో మూడోరోజు చెరువుకట్టవద్ద పురుషులు బతుకమ్మ ఆడతారు. వాయినాలు ఇచ్చిపుచ్చుకుంటారు. పంటలు బాగా పండాలనీ, పాడి పశువులు బాగుండాలనీ, కుటుంబమంతా క్షేమంగా ఉండాలనీ పూర్వీకులు ఈ కేదారీశ్వర వ్రతకల్పానికి శ్రీకారం చుట్టారని సీతంపేట గ్రామస్తులు అంటున్నారు.