DailyDose

టిక్‌టాక్ కొనుగోలు ప్రయత్నాల్లో మైక్రోసాఫ్ట్-వాణిజ్యం

టిక్‌టాక్ కొనుగోలు ప్రయత్నాల్లో మైక్రోసాఫ్ట్-వాణిజ్యం

* చైనాకు చెందిన టిక్‌టాక్‌ యాప్‌ అమెరికా కార్యకలాపాల్ని కొనుగోలు చేయడంపై దాని మాతృసంస్థ బైట్‌డ్యాన్స్‌తో చర్చలు జరుపుతున్నట్లు సాంకేతిక దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్‌ అధికారికంగా ప్రకటించింది. యాప్‌ భద్రతపై వ్యక్తమవుతున్న అనుమానాలపై సంస్థ సీఈవో సత్యనాదేళ్ల ఆదివారం అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో చర్చించారు. యాప్‌ పనితీరు విషయంలో ట్రంప్‌ లేవనెత్తిన ఆందోళనలపై విస్తృతంగా చర్చించినట్లు సంస్థ ఓ ప్రకటనలో వెల్లడించింది. అమెరికా సహా కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లోనూ యాప్‌ కార్యకలాపాల్ని సొంతం చేసుకునేందుకు యోచిస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు బైట్‌డ్యాన్స్‌తో జరుపుతున్న చర్చలు సెప్టెంబరు 15 నాటికి పూర్తయ్యే అవకాశం ఉందని పేర్కొంది.

* ప్రముఖ ఈ-కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ కూడా మరో సేల్‌కు సిద్ధమైంది. ఇప్పటికే ప్రైమ్‌ డే సేల్‌ పేరిట ఈ నెల ఆరు నుంచి అమెజాన్‌ సేల్‌కు సిద్ధమవ్వగా.. సరిగ్గా అదే రోజు నుంచి ఫ్లిప్‌కార్ట్‌ కూడా ‘బిగ్‌ సేవింగ్స్‌ డేస్’ పేరిట సేల్‌ ప్రారంభించనుంది. ఈ సేల్‌ 10వ తేదీ వరకు మొత్తం ఐదు రోజుల పాటు కొనసాగనుంది. ఈ సేల్‌లో ఐసీఐసీఐ బ్యాంక్‌, సిటీ బ్యాంక్‌ క్రెడిట్‌/డెబిట్‌ కార్డుపై కొనుగోళ్లపై 10 శాతం ఇన్‌స్టాంట్‌ డిస్కౌంట్‌ లభించనుంది.

* దేశీయ మార్కెట్లు నష్టాల్లో పయనిస్తున్నాయి. సోమవారం ఉదయం 9:45 గంటల సమయంలో సెన్సెక్స్‌ 300 పాయింట్లు నష్టపోయి 37,306 వద్ద కొనసాగుతుండగా.. నిఫ్టీ 78 పాయింట్లు కోల్పోయి 10,994 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.62 వద్ద కొనసాగుతోంది. బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌ రంగానికి చెందిన షేర్లు భారీ నష్టాలు చవిచూస్తుండడంతో సూచీలు నేలచూపులు చూస్తున్నాయి. ఆసియా మార్కెట్లు మిశ్రమంగా రాణిస్తున్నాయి.

* ప్రపంచాన్ని సంక్షోభంలోకి నెట్టిన కరోనా వైరస్‌కు కేంద్రబిందువైన చైనాలో మాత్రం పరిస్థితులపై ఇప్పటికీ స్పష్టమైన సమాచారం లేదు. అయితే చైనా కూడా కరోనా ఆర్థికంగా కుంగిపోయినట్లు అక్కడి ఆర్థికరంగ నిపుణులు వెల్లడిస్తున్నారు. ముఖ్యంగా చైనీయులు భారీ సంఖ్యలో ఉద్యోగాలు కోల్పోవడం వల్ల ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నట్లు తాజా నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.

* దలాల్‌ స్ట్రీట్‌లో నష్టాలు కొనసాగుతున్నాయి. గత వారాన్ని నష్టాలతో ముగించిన మార్కెట్లు.. సోమవారం నాటి ట్రేడింగ్‌లో భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. ముఖ్యంగా మరోసారి మారటోరియం ఉండొచ్చన్న వార్తలతో బ్యాంకింగ్‌ షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. దీనికి తోడు దేశంలోనూ కరోనా కేసులు 18 లక్షల మార్క్‌ దాటడం, ఫ్యాక్టరీ పీఎంఐ డేటా ఆశాజనకంగా లేకపోవడం వంటి కారణాలతో దేశీయ మార్కెట్లు వరుసగా నాలుగోరోజూ నష్టాలను నమోదు చేశాయి.

* ఆగస్టు 31 కల్లా పన్నుల మదింపును పూర్తి చేయాలని అధికారులను కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి (సీబీడీటీ) ఛైర్మన్‌ పీసీ మోదీ అదేశించారు. పెండింగ్‌లో ఉన్న అన్ని పన్ను అప్పీళ్లను పరిశీలించడానికి నెలవారీ లక్ష్యాలను సైతం విధించారు. ఇ-ఫిల్లింగ్‌ పోర్టల్‌ లేదా ఇ-మెయిళ్ల ద్వారా చెల్లింపుదార్లకు సమాచారం ఇవ్వాలని సూచించారు. పన్ను ఆదాయ లక్ష్యాలను చేరుకోవడం కష్టతరంగా మారిన తరుణంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. వివాద్‌ సే విశ్వాస్‌ పథకం కింద దరఖాస్తు చేసుకోవడానికి పలువురు పన్ను చెల్లింపుదార్లు ఎదురుచూస్తున్నారని, అంతకంటే ముందు సరైన పన్ను డిమాండ్‌ కోసం చూస్తున్నారని ఆదాయపు పన్ను ప్రిన్సిపల్‌ చీఫ్‌ కమిషనర్లకు రాసిన లేఖలో మోదీ పేర్కొన్నారు. వివాద్‌ సే విశ్వాస్‌ పథకం కింద దరఖాస్తులను వెంటనే పరిష్కరించి, సమాచారం ఇవ్వాలని.. ఈ ప్రక్రియను 31లోగా పూర్తిచేయాలని మదింపు అధికారులు (ఏఓలు)ను ఆదేశించారు.