Agriculture

జోడెడ్ల బండి మాయమైపోయింది

Dual Cattle Carts Missing In Agriculture

ఆదిమ కాలం నుంచి నాగరిక సమాజంలోకి మారిన మనిషి కాలక్రమేణా తన అవసరాలకు అనేక వసతులను సమకూర్చుకుంటున్నాడు. ఆకలిని తీర్చుకునేందుకు మొదట్లో జంతువులను వేటాడాడు. ఆ తర్వాత సేద్యంతో పంటలు ఉత్పత్తి చేసి పసందైన వంటకాలను ఆరగించే వరకు వచ్చేశాడు. జ్ఞాన సముపార్జన తర్వాత మనిషి విలాసవంతమైన సౌకర్యాలకు పెద్దపీట వేసుకున్నాడు. సాంకేతికత అంతగా వినియోగంలో లేని సమయంలో అడుగు తీసి అడుగు బయట పెట్టాలంటే పల్లెల్లో అందరికీ గుర్రాలు, ఎడ్ల బండ్లే దిక్కు. హోదా, దర్పానికి చిహ్నంగా కొంత మంది జంతువులను పెంచుకునేవారు. వ్యవసాయ అవసరాలకు, వ్యక్తిగత పనికి ఎడ్లబండ్లనే వినియోగించేవారు. పొద్దు పొడిచే సమయం నుంచి పొద్దు పోయే దాకా ప్రతి పనీ ఎడ్ల బండి లేనిదే పూర్తయ్యేది కాదు.
***శ్రమజీవుల నేస్తం
పల్లెల్లో ఎడ్ల బండ్లపై రైతులే కాకుండా కుల వృత్తుల వారు ఆధారపడి జీవనం సాగించేవారు. ఎడ్లబండిని తయారు చేసేందుకు వడ్రంగులు చెమటోడ్చేవారు. వివిధ రకాల కర్రలను సమీకరించి చక్రాలతోపాటు, ఎడ్లబండికి కావాల్సిన ఇరుసు, కాని, కనాలు, బల్ల తయారు చేసేవారు. బండి చక్రాలకు కావాల్సిన కమ్మలు, ఇనుప చక్రాలు సమీకరించేందుకు కమ్మరులు శ్రమించేవారు. కర్ర చక్రాలు రోడ్డుపై తిరుగుతుంటే త్వరగా అరగకుండా ఉండేందుకు కర్ర చక్రాల చుట్టూ ఇనుమును మలిచి కమ్మలు అతికించేవారు. వీటితోపాటు శీల, చక్రాలు ఊడిపోకుండా ఇరుసును బిగించేవారు. దీంతో కమ్మరి కులస్తులకు ఉపాధి దొరికేది. ప్రస్తుతం ఎడ్లబండ్ల తయారీ లేకపోవడంతో వడ్రంగి, కమ్మరి కులస్తులకు ఉపాధి కరువైంది. యాంత్రీకరణ వేగంలో ఎడ్లబండి గల్లంతవుతోంది. ట్రాలీ ఆటోలు, ట్రాక్టర్లు రావడంతో ఎడ్లబండి చరిత్రపుటల్లో జ్ఞాపకంగా మారుతోంది. ఊళ్లలో రెండు, మూడు ఎకరాలకు పైగా సాగు భూమి ఉన్న ప్రతి ఇంట్లో ఎడ్ల బండి ఉండేది. పంట పొలాలకు ఎరువులు తీసుకెళ్లాలన్నా, కూలీలను తరలించాలన్నా, పండించిన పంటలను ఇంటికి తీసుకు రావాలన్నా, ఎడ్లబండినే వాడేవారు. ధాన్యం, మిర్చి, మక్కజొన్న, పత్తి వంటి పంటలను తరలించేవారు. పంటలను ఇంటికి తీసుకెళ్లేందుకు, మార్కెట్‌లో విక్రయించేందుకు రైతులు ఎడ్లబండ్లపైనే ఆధారపడే వారు. పంట రవాణాకేకాకుండా ఎడ్లబండిని ఆధారం చేసుకుని రైతులు వ్యాపారం సైతం చేసుకునేవారు. ఎడ్లబండిని అద్దెకు ఇచ్చేవారు. ప్రత్యేక ఏర్పాటుతో మొరం, ఇసుక, పేడ, గృహ నిర్మాణానికి అవసరమయ్యే పునాది రాళ్లు, ఇటుకలు, సిమెంట్‌ బస్తాలను తీసుకెళ్లేది.
***టాంగా నుంచి ఎడ్ల బండి దాకా..
గ్రామాల్లో సంపన్నులకు గుర్రాలు, ఎడ్లు ఎక్కువగా ఉండేవి. రవాణా సౌకర్యం అంతగా లేని కాలంలో గుర్రాలతో కూడిన కలపతో తయారు చేసిన బండ్లనే వాడేవారు. వాటిని టాంగా అని పిలిచేవారు. టాంగా వంటివి కేవలం మనుషులను మాత్రమే మోయగలిగేవి. లగేజీ గట్రా ఎక్కువగా మోసేంత సామర్థ్యం వీటికి ఉండేది కాదు. ఎడ్ల బండ్లు అందుకు భిన్నం. పొలంలో గొర్రు కొట్టాలన్నా, దుక్కి దున్నాలన్నా, ఒక ఊరి నుంచి మరో ఊరి వెళ్లాలన్నా, పంట ఉత్పత్తులను ఇంటికి తీసుకెళ్లాలన్నా ఎడ్ల బండే శరణ్యం. ఇవీ అన్ని రకాలుగా ఉపయోగపడేవి. ఎడ్ల బండి లేని ఇల్లు ఉండేది కాదు. వాహనాలే అంతంత మాత్రంగా ఉన్నటువంటి కాలంలో ఎడ్లబండ్లే మనిషి అవసరాలు తీర్చేవి. ఓ మాటకైతే మంచికైనా, చెడుకైనా కట్టరా… బండి అన్నట్లుగానే ఉండేది. ఇప్పుడు కాలం మారింది. ఎడ్లబండ్లు కనుమరుగవుతుండగా ట్రాక్టర్లు వాటి స్థానాన్ని ఆక్రమించేస్తున్నాయి. యాంత్రీకరణలో భాగంగా ప్రతి పనికీ యంత్రాలే ముందుండడంతో ఎడ్లబండ్ల వినియోగానికి డిమాండ్‌ తగ్గింది. అదో రిస్క్‌తో కూడుకున్న పనిగా భావించి రైతన్నలూ ఏండ్ల నాటి సంప్రదాయాన్ని పక్కనబెడుతున్నారు. ఎవరో ఒకరు, ఎక్కడో ఒక చోట ఎడ్ల బండ్లను చిన్న పాటి అవసరాలకు వాడుకుంటున్నారు.
****ట్రాక్టర్లతో ఏరువాక
ఏరువాక పండుగ రోజు ఎడ్ల బండ్లను ముస్తాబు చేసి ఊరంతా ఊరేగిస్తుంటే గ్రామాల్లో ప్రజలు వీధుల్లోకి వచ్చి వాటిని చూసి మురిసిపోయే వారు. దసరా, ఉగాది, పొలాల అమావాస్య వంటి పండుగల సందర్భంలో ఎడ్ల బండ్ల ప్రదర్శనలు నిర్వహిస్తారు. సంప్రదాయం కొనసాగుతున్నప్పటికీ గతంలో వందలాది బండ్లు తిరిగేవి. కాడెద్దులను కూడా ముస్తాబు చేసి తమదే ముందు వెళ్లాలంటూ పోటీకి సిద్ధపడేవారు. ఇప్పుడంతా ట్రాక్టర్లు వచ్చి చేరడంతో పండుగలకు కళ తప్పింది. ఇప్పటికీ ఈ ఆచారం కొనసాగుతూనే ఉన్నప్పటికీ ఎడ్ల బండ్లు మాత్రం అంతగా కనిపించడం లేదు. వాటి స్థానంలో ట్రాక్టర్లు రావడంతో ఎడ్ల బండ్లకు ఆదరణ పూర్తిగా తగ్గిపోయింది. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఉగాది రోజున నిర్వహించే ఎడ్లబండ్ల ప్రదర్శన ఏటా కళ తప్పుతూ వస్తోంది. నందిపేటలో పొలాల అమవాస్య రోజు గతంలో ఎడ్లబండ్లతో ప్రదర్శన చేసే వారు. ఇప్పుడు ట్రాక్టర్లతో చేస్తున్నారు. ఇలా పల్లెల్లో పరిస్థితులన్నీ పూర్తిగా మారిపోయాయి. ఎడ్లబండ్ల గొప్పతనం, వాటితో ఉపయోగాలు ఇప్పటి తరం వారికి తెలియకుండా పోతోంది. గ్రామాల్లో పిల్లలు ఎడ్లబండిపై ఎంతో సంతోషంగా ప్రయాణించేవారు. పట్టణాల నుంచి గ్రామాలకు వచ్చే వారు. ఇప్పుడు గ్రామాల్లోని పిల్లలకు సైతం ఎడ్ల బండి అంటే ఏంటో తెలియని దుస్థితి ఏర్పడింది. ఇక పట్టణాలు, నగరాల్లో ఉండే వారికి అదో వింత.