Kids

రాణాప్రతాప్ సేవకుడి వీర దేశభక్తి గాథ

రాణాప్రతాప్ సేవకుడి వీర దేశభక్తి గాథ

తోటి రాజపుత్ర వీరులందరూ అక్బరు పాదుషాకు దాసులుకాగా రాజ్యలక్ష్మిని నిలుపుకునేందుకు ఇరవయ్యేళ్లపాటు పోరాటం సాగించిన స్వాభిమాని రాణా ప్రతాపుడు. ఆ పోరాటంలో ఇక్కట్లలో ఉన్న రాణాకు నిస్వార్థంగా సేవలందించిన ఓ దేశాభిమాని స్ఫూర్తిదాయక గాథే ఇది..
నునులేత సూర్య కిరణాలు ఆరావళి పర్వత శిఖరాలను ఆప్యాయంగా నిమురుతున్నాయి. కుంభల్‌గఢ్‌లో కొలువుదీరిన ఏకలింగేశ్వరాలయం మంటపం మీద స్వాభిమాన ధనులైన సేనానులు తమ నాయకుడి ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నారు. ఎన్ని కష్టాలెదురైనా సరే మేవాడ్‌ను మొగలుల గుప్పిట్లోంచి తప్పించాలనే పట్టుదల నరనరాన జీర్ణించుకున్న రాణా ప్రతాపుడు శివుడికి పూజచేసి మంటపం దగ్గరికి అలసిపోయిన మదపుటేనుగులా వచ్చాడు.
రాజపుత్రుల అనైక్యత ఆసరాగా స్థిరపడిన మొగలు సామ్రాజ్యాధిపతి అక్బరు దేశమంతటినీ తన అధీనంలోకి తెచ్చుకోవాలనుకుంటున్నాడు. ఈ ఆధిపత్యపోరులో మొగలుల ధాటికి తాళలేక, స్వతంత్రంగా మనుగడ సాగించాలనుకున్న రాణా ప్రతాపుడు కూడా మేవాడ్‌ను కోల్పోయాడు. రాజస్తాన్‌ కోటలన్నీ పాదుషా పాదాలకు నమస్కరించాయి. వేలసంఖ్యలో ఉన్న సేనలు వందల్లోకొచ్చాయి. అయినా, మొక్కవోని పట్టుదలతో అక్బర్‌తో పోరాడుతున్నాడు రాణా. శౌర్యం పురుషాకృతి దాల్చిన రాణాకు రణరంగంలో రెండు దశాబ్దాల అనుభవం ఉంది.
విశ్వాసపాత్రులైన సహచరులు కృష్ణసింహుడు, అడవిబిడ్డలు భిల్లుల నాయకుడైన భీమ్‌చంద్‌లాంటి వారితో, కుటుంబ సమేతంగా అడవుల్లో తలదాచుకున్నాడు రాణా. భార్య పాటేశ్వరీదేవి, కుమారుడు గడ్డిరొట్టెలు తింటూ కష్టాల కడలిని ఈదుతున్నా ఆయన చలించలేదు. సూర్యమహల్లో తలదాచుకున్నా, భామ్‌గఢ్‌లో గడుపుతున్నా, కావాలో ఉన్నా, పర్వతాల మధ్య జావురా గనుల్లో అజ్ఞాతవాసం చేస్తున్నా, గుహల్లో సంచరిస్తున్నా, ఖాసింఖాన్, మహబత్‌ఖాన్, ఫరీద్‌ఖాన్, అబ్దుల్లా తదితర అక్బరు ప్రతినిధులు ఆచూకి కనిపెట్టి మీదికి వచ్చిపడుతున్నారు. అసంఖ్యాక మొగల్‌ సేనల్ని ఎదుర్కోవడం అసాధ్యమై పోయింది. ‘నావల్ల ఎన్నో కుటుంబాలు కష్టాలను అనుభవిస్తున్నాయి. ఎంత పోరాడినా మొగలుల కుట్రలే ఫలిస్తున్నాయి. సైన్యాన్ని సమకూర్చుకోవాలంటే చేతినిండా ధనం ఉండాలి. ఏంచేయాలి?’ అని ఆలోచిస్తున్న రాణా ప్రతాప్‌ స్ఫురద్రూపాన్ని నీలినీడలు కమ్ముకున్నట్టుంది.
విశ్వాసపాత్రుల ముందు మంటపం మధ్యలో నిలబడగానే అంతరంగంలోని అలజడి ఛాయలు గొంతు గోడలను దాటుతున్నాయి. ‘‘దేశ స్వాతంత్య్ర సంగ్రామంలో ఆత్మవిశ్వాసంతో అజేయులుగా మిగిలిన మిత్రులారా!’’ రాణా కళ్లలో ముందటి గాంభీర్యం కరవైంది. ‘‘ఇరవై ఏళ్లుగా కష్టాలు అనుభవిస్తున్నాం. అక్బరు కొలువులోని పృథ్వీరాజు, అబ్దుల్‌ రహమాన్‌ లాంటివారు మన స్వతంత్ర వాంఛను పాదుషాకు చెప్పి ఒప్పించాలనుకున్నా, భీమ్‌చంద్, కృష్ణసింహ, భిల్లులు ఇన్ని కష్టాల్లోనూ ఆత్మవిశ్వాసం వీడకున్నా మనం మేవాడ్‌ రాజ్యాన్ని కోల్పోయి అడవుల పాలయ్యాం. మీ పట్టుదల, స్వాతంత్య్ర దీక్ష అనుపమానం. అయితే విధి బలీయమైంది. నాతోపాటు మిమ్మల్ని కూడా తిప్పుతూ, గడ్డిరొట్టెలు తినాల్సిన దుస్థితి కల్పించాను. ఇక కొత్తసేనలు సమీకరించుకునేందుకు మనదగ్గర ధనం లేదు. ఆత్మవిశ్వాసంతో బతుకుతున్నా పగబట్టిన నాగుల్లా మొగల్‌సేనలు మనల్ని తరుముతున్నాయి. ఈ పరిస్థితుల్లో మనం మన మాతృభూమిని వదిలి వెళ్లడం అనివార్యమైపోతోంది…’’ రాణా గొంతు బొంగురుపోయింది. సైనికులకు ఆ మాటలు కొత్తగా అనిపించాయి.
అందరూ విస్తుబోయి గుసగుసలాడసాగారు. కృష్ణసింహుడు ధైర్యంగా నుంచుని గొంతు సవరించుకున్నాడు. ‘‘మహారాజా! స్వతంత్రకాంక్షలో, ధర్మదీక్షలో, త్యాగంలో మీ పూర్వులకు మీరేమాత్రమూ తీసిపోరు. అలాంటిది మీనోట ఈ మాటలు అబ్బురపరిచినా, అవి అబద్ధం మాత్రం కాదు. మీరు ఎటువెళ్లినా మీ వెంట మేముంటాం. మన ఆత్మవిశ్వాసమే మనకు శ్రీరామరక్ష’’ అన్నాడు గంభీరంగా.
రాణా ప్రతాపుడి గుండె గట్టిపడింది. ‘‘నాతో రాదలచినవారు మూడురోజుల్లో కుటుంబ సమేతంగా నా దగ్గరికి రావాలి’’ అనగానే గాలి బాధపడుతూ పలచబడింది. మూడోరోజు ఉదయమే సహచరులంతా తమతమ వస్తువులతో రాణా దగ్గరికి చేరుకున్నారు. రాణాలో కృతజ్ఞతాపూర్వకమైన దుఃఖఛాయలు కదిలాయి. అక్కడ చేరిన వారందరినీ కలియజూసి… ‘‘మిత్రులారా! జీవిత కురుక్షేత్రంలో అడుగు వెనక్కుపడబోతోంది. మేవాడ్‌ రాజ్యలక్ష్మీ! మమ్మల్ని మన్నించు. నీకు దూరమైనా సరే స్వతంత్రంగా గడపాలని వెళ్తున్నాం’’ గద్గదస్వరంతో మాట్లాడి పిడికెడు మట్టిని కళ్లకద్దుకున్నాడు రాణా. దోసెడుమట్టిని రుమాలులో మూటగట్టుకున్నాడు. అందరి గుండెలు కరిగి నీరై కళ్లల్లోకొచ్చాయి. అంతా బయలుదేరారు. పొలిమేరలు చేరువవుతూంటే మనసుల్లో నెలకొంటున్న విచిత్రమైన ఆందోళనను అదిమిపెట్టడం కష్టమైపోయింది వాళ్లకు.
అప్పుడే.. అక్కడికి వృద్ధ సింహంలాంటి ఓ వ్యక్తి గుర్రంమీద ఎదురువచ్చాడు. నుదుట భస్మరేఖలమధ్య సిందూర తిలకం… కైలాసం నుంచి సాక్షాత్తూ ఈశ్వరుడే దిగివచ్చినట్లుంది. అందరికీ నమస్కరించి ‘‘అయ్యలారా! మీరెవరు? ఎక్కడికి వెళ్తున్నారు? మీరు మేవాడ్‌ సైనికులైతే రాణా ప్రతాపుల వారెక్కడున్నారో చెప్పి పుణ్యం కట్టుకోండి’’ అని అడిగాడు. వీరులంతా మొహాలు చూసుకుని చూపులు రాణా మీద నిలిపారు. రాణా ఆయనకు నమస్కారం చేసి, ‘‘మహానుభావా! తమరెవరు? రాజ్యాన్ని పోగొట్టుకుని, నమ్ముకున్న వారిని కష్టాలకడలిలో ముంచుతూ మాతృభూమిని వదిలి మరోదేశానికి వెళ్తున్న దురదృష్టవంతుడు రాణా ప్రతాపసింహుణ్ని నేనే..’’ అంటూ గుర్రం దిగాడు. గంభీర వదనంలో దీనత్వ ఛాయలు గోచరించాయి.
అవతలి వ్యక్తి గుర్రం దిగి ఆత్రంగా రాణా దగ్గరికి వచ్చాడు. ‘‘హరిహరీ! ప్రతాపసింహులు తమరేనా? ఎందుకీ దీనస్థితి?’’ అంటూ రాణాను గుండెలకు హత్తుకున్నాడు.
‘‘మహానుభావా! నామీద ఇంత వాత్సల్యం కురిపిస్తున్నారు. తమరెవరు?’’ చీకట్లో వెలుగురేఖలా వచ్చిన కొత్తవ్యక్తిని ప్రశ్నించాడు రాణా. ‘‘నాపేరు భామాసాహి, వ్యాపారిని. మేవాడ్‌ నా పురిటిగడ్డ. మా తండ్రితాతలు మీ వంశీయుల దగ్గర మంత్రులుగా పనిచేశారు. నేను నలభయ్యేళ్ల కిందట పర్షియా వెళ్లాను. వ్యాపారంలో బాగా సంపాదించాను. మేవాడ్‌ దుస్థితి గురించి విని, నా జన్మభూమికి ఏదైనా చేయాలనుకున్నాను. ఆడబోయిన తీర్థంలా సాక్షాత్తూ మీరే ఎదురయ్యారు. ఇది నా భాగ్యం. కానీ మాతృభూమి చరణారవిందాలనే నమ్ముకున్న మీరు ఎక్కడికి వెళ్తున్నారు?’’ అంటూ అక్కడే ఉన్న ఓ రాయిమీద కూర్చున్నాడు భామాసాహి. రాణా అనుచరులందరినీ పరిచయం చేసుకున్నాడు. రాణా కూడా భామాసాహికి ఎదురుగా మరో రాయిమీద కూర్చున్నాడు.
రాణా ప్రతాపుడు తన పోరాటం, స్వాతంత్య్రేచ్ఛ, నిస్సహాయత గురించి భామాసాహికి పొల్లుపోకుండా చెప్పాడు. చివరికి ‘‘మహాశయా! మీ గురించి చాలాసార్లు విన్నాను. రాజపుత్రులే పదవులకు ఆశపడి స్వాభిమానాన్ని వదులుకుని మరీ అక్బరు దర్బారులో మంత్రి పదవులు అలంకరించారు. మొగలులు నన్నూ ప్రలోభపెట్టారు. అయితే నేను స్వాతంత్య్రాన్ని వదులుకోనన్నాను. చివరికి ఇలా విధి వంచితుడనయ్యాను. మేవాడ్‌ విడిచి అడవులపాలైనా మొగల్‌ సైన్యం వేట తప్పడం లేదు. అక్బర్‌ మీద పోరాటం మొదలై ఇప్పటికి ఇరవయ్యేళ్లయి పోయింది. ఇప్పటికీ నా ప్రయత్నాలు ఫలించకపోవడం నా దౌర్భాగ్యం. అందుకే పర్షియాకు వచ్చి మిమ్మల్ని దర్శించుకోవాలనుకున్నాను. భగవంతుడి సన్నిధిలో ఆలస్యం ఉంటుంది, కానీ అంధకారం ఉండదంటారు. మీరే ఎదురుపడ్డారు. మున్ముందు ఏం కానుందో?’’ నిర్వేదంతో రాణా ఒళ్లంతా వణికింది. చూపులు నేలమీదున్నాయి.
అంతా వింటున్న భామాసాహి నుదుటి రేఖలు కదుల్తూంటే చందన తిలకం ఉదాత్త భావాలను రేకెత్తిస్తోంది. ‘‘అరివీర భయంకరులైన మీ పరిస్థితే ఇలాగైతే నాలాంటివాళ్లు ఏమైపోవాలి మహారాజా? నేను పర్షియాలో ఉన్నప్పటికీ నా మనసంతా మేవాడ్‌ మీదే. మీకు చేతనైన సాయం చేయాలనుకుని ఇక్కడికి వచ్చాను. మహారాజా! కష్టసుఖాలు రాత్రింబవళ్లలా వచ్చిపోతుంటాయి. మీ నిస్సహాయత నాకు అర్థమైంది. స్వతంత్రంగానే జీవించాలి. పరమధార్మికులైన మేవాడ్‌ రాజపుత్రులను నడిపించిన మా పూర్వీకులను స్మరించుకోని రోజు లేదు. మేవాడ్‌ వదిలి మరెక్కడికి వెళ్లినా మీ ధైర్యం సడలదు. మీరిక్కడే ఉండండి…’’ అన్నాడు భామాసాహి.
ఆ మాటలు పూర్తవకముందే కృష్ణసింహుడి గుండెల్లో గూడుకట్టుకున్న దీనావస్థలో ఓ ఆశాకిరణం తళుక్కుమంది. ‘‘అయ్యా! మీ మాటలు మాకెంతో బలాన్నిచ్చాయి. కానీ, మరింత సైన్యం సమకూర్చుకోవాలంటే ధనం పెద్దమొత్తంలో కావాలి. అదిలేకనే ప్రభువులు ఈ నిర్ణయం తీసుకున్నారు’’ గుండెల్లోని ఆవేదన కరిగి కళ్లల్లో కొచ్చి గొంతుకు అడ్డుపడింది.
భామాసాహి చలించిపోయాడు. ఊపిరి పీల్చుకుని… ‘‘కృష్ణసింహా! మా పూర్వులు మేవాడ్‌ మంత్రులుగా సేవలందించి కూడబెట్టిన ధనంతోనే నేను పర్షియాకు వెళ్లి వ్యాపారం చేశాను. కాలం కలిసొచ్చి, అపారమైన ధనం సంపాదించాను. మాతృభూమి సేవకు అక్కరకురాని ధనమెందుకు? మీ పరిస్థితి నా మనసును కలచివేస్తోంది. నా ధనమంతా ఇక్కడికి దగ్గర్లో ఉన్న బోయపల్లెకు తరలిస్తాను. మాతృభూమి విముక్తికోసం దాన్ని ఉపయోగించండి. భీమ్‌చంద్‌గారూ ఆ ధనంతో సైన్యం సమకూర్చుకోండి. పోరాటం సాగించండి. మీ ఆత్మవిశ్వాసం, ధైర్య సాహసాల మీద నాకు నమ్మకం ఉంది’’ అంటూ భామాసాహి అక్కడ పోగైనవాళ్లలో దేశభక్తిని రంగరించి వెనుదిరిగాడు. రాజపుత్రులు, భిల్లులు రెట్టించిన ఉత్సాహంతో పున్నమివెన్నెల్లో సముద్ర కెరటాల్లా అంతాకలిసి బోయపల్లెకు తరలివెళ్లారు.
భీమ్‌చంద్‌ ముందుండి ఏర్పాట్లు చేశాడు. స్వాతంత్య్ర సంగ్రామం మలిదశకు చేరుకుందని, త్యాగాలకోర్చి ముందుకు రావాలని స్వేచ్ఛా ప్రియులైన రాజపుత్రులకు సందేశాలు వెళ్లాయి. భామాసాహి గుర్రాలు, ఏనుగుల మీద బస్తాలలో నింపి ధనరాశులను బోయపల్లెకు పంపించాడు. చివరికి తానూ వచ్చాడు. రాణాప్రతాప్‌లో ఆనంద తరంగాలు ఎగసిపడ్డాయి. మంత్రాంగంలోనూ, యంత్రాంగంలోనూ భామాసాహి పాలుపంచుకున్నాడు.
అడవి బిడ్డలైన భిల్లుల్ని ఏకం చేయడంలో భీమ్‌చంద్‌ ప్రముఖపాత్ర వహించాడు. నెలకు పదిహేను రూపాయల చొప్పున అయిదువేల మంది సేనకు పన్నెండేళ్లకు సరిపోయే ధనం సమకూరింది. కొత్త సైనికులకు రాత్రింబవళ్లూ శిక్షణ కొనసాగింది. మెరికల్లాంటి యువసైనికులు ఉత్సాహంతో ముందుకొచ్చారు. ఆకాశంలో స్వతంత్ర భానుడు ఉదయించాడు. యుద్ధానికి బయల్దేరేందుకు అదే శుభ ముహూర్తం అన్నారు భీమ్‌చంద్, కృష్ణసింహులు. పాటేశ్వరీదేవి భర్తకు హారతి ఇచ్చింది. వీరతిలకం దిద్ది ఉత్సాహపరిచింది. ‘‘విజయలక్ష్మి తమరిని వరించి తీరుతుంది ప్రభూ!’’ అని ప్రకటించింది. అది పరమేశ్వరి వాక్కులా అనిపించింది రాణా ప్రతాపుడికి.
అదేరోజు రాత్రి రాణా సేనలు సమరోత్సాహంతో దేవేరి దుర్గాన్ని చుట్టుముట్టాయి. నిరంతర రణయానంలో రాణా కాళ్లూ చేతులూ చప్పబడిపోయాయని యవనులు ఆ దుర్గంలో నిశ్చింతగా నిద్రిస్తున్నారు. రాజపుత్ర సేనలు వెంటనే దుర్గంలో చొరబడదాం అన్నాయి. మనం ధర్మపథంలోనే నడుద్దాం అన్న రాణా ప్రతాపుడు శంఖధ్వనులతో శత్రుసేనలను మేల్కొలిపాడు. అప్పుడు జరిగిన భీకర యుద్ధంలో రాణా కుమారుడు అమరసింహుడు అపర అభిమన్యుడై పోయాడు. ఆ ధాటికి తట్టుకోలేక యవనసేనలు తోకముడిచాయి. దుర్గం రాణా వశమైంది.
ఆ తర్వాత వంతు కుంభల్‌గఢ్‌ కోటది. వస్తు సరఫరా పరంగా దిల్లీకి కీలకమైందీ కోట. రెట్టించిన ఉత్సాహంతో కదిలిన రాణాసేనలు దాన్నీ చేజిక్కించుకున్నాయి. ఈ విజయం అందించిన స్ఫూర్తితో ప్రతాపుడి సైన్యం కదంతొక్కింది. ఫలితంగా ఆరావళి పర్వత ప్రాంతంలోని ముప్ఫైరెండు దుర్గాలు రాణా అధీనంలోకి వచ్చాయి. ఆగ్రాలో ఉన్న అక్బర్‌కు ఈ వార్తలన్నీ శరాఘాతాలవుతున్నాయి. తన సార్వభౌమత్వాన్ని రాణాతో కూడా అంగీకరింపజేయాలన్న ఆయన ఆశ క్రమంగా అంతరించిపోతోంది. ఇప్పటికే రాణాతో ఎన్నో యుద్ధాలు జరిగాయి. ఫలితం ఎటూ తేలలేదు. అక్బరు కూడా అలసిపోయాడు. ఇంతలోనే చక్రవర్తికి నమ్మకస్థుడైన విజయసూరి వచ్చాడు. వెంటనే ‘‘జహాపనా! ఎవరో భామాసాహి అనే వ్యాపారి పర్షియాలో తాను సంపాదించిన ధనరాశులను రాణా ప్రతాపుడికి అందజేసి, యుద్ధవ్యూహ రచనల్లో కీలకపాత్ర వహించాడని తెలిసింది’’ అన్నాడు.
పాదుషా నిట్టూర్చి, ‘‘మనకు ధనం, సేనలు అపారం. కానీ, ఏం లాభం! రాణా బలాన్ని, బలగాలను తక్కువ అంచనా వేశాం’’ అంటూ పెదాలు చప్పరించాడు. అక్బరు తలలో నాలుకలాంటి అబ్దుల్‌ రహమాన్‌ రాణా ఔన్నత్యాన్ని, భామాసాహి దేశభక్తిని, సహకారాన్ని వివరించాడు. విజయసూరి, సూరదాసు, పృథ్వీరాజు మొదలైన వీరులు దాన్ని బలపరిచారు. మాన్‌సింహుడు అది సహించలేకపోయాడు. రాణాను ఎలాగైనా సరే గెలిచి తీరతామన్నాడు. అది అసాధ్యం అన్నారు మిగిలినవాళ్లు. మాన్‌సింహుడు అసహనంతో ఖడ్గం నేలకు విసిరేశాడు. మొగలు సామ్రాజ్య కీర్తి కిరీట కాంతుల్ని తేజోవంతం చేసిన అక్బరు పాదుషా ‘‘వేలమంది అక్బరులున్నా, లక్షల సేనలున్నా రాణాను లొంగదీయడం అసాధ్యం. అతణ్ని కష్టాలపాలు చేశామనే అపకీర్తి నాకొద్దు. అతణ్ని నిరోధించడం మానుకుందాం’’ అన్నాడు అక్కడున్నవారితో ఆదేశిస్తున్నట్లు.

* * *

మొగల్‌సేనలు మేవాడ్‌ను వదిలివెళ్లాయి. చిత్తోడ్‌ మినహా, మిగిలిన ఎనభైమూడు రాజపుత్ర దుర్గాలు రాణా అధీనంలోకి వచ్చాయి. సరిహద్దు ఆవలున్న సుసంపన్నమైన మాల్పురాన్ని కూడా వశపరచుకున్నాడు. ఇసుకతిన్నెల మీద వెన్నెలలా మెరిసిపోతున్న కుంభల్‌గఢ్‌ పూర్వవైభవాన్ని సంతరించుకుంది. దాన్నే పాలనాకేంద్రంగా ఎంచుకున్నాడు రాణా. కృష్ణసింహుడు నిర్ణయించిన ముహూర్తంలో భామాసాహి, భీమ్‌చంద్‌ ఇతర సేనా నాయకుల సమక్షంలో సామంతుల సాక్షిగా రాణా ప్రతాప్‌ పట్టాభిషిక్తుడయ్యాడు. మేవాడ్‌ ప్రజలంతా సంబరాల్లో మునిగిపోయారు. దీనంతటికీ కారకుడైన భామాసాహిని, మరికొంతమందిని ఘనంగా సన్మానించనున్నట్లు ప్రకటించాడు రాణా.

* * *

సత్కారం నిర్ణయించిన రోజు రానే వచ్చింది. రాణా ప్రతాప్‌ సతీ సమేతంగా సింహాసనాన్ని అలంకరించాడు. ముందుగా భీమ్‌చంద్, కృష్ణసింహులను సత్కరించాడు. ‘‘నా స్వాతంత్య్రకాంక్ష కోసం తన సర్వస్వాన్ని సమర్పించిన గౌరవనీయులు భామాసాహిగారు సన్మానం అందుకోవాలి! రండి’’ అని ప్రకటిస్తూ సభను కలియజూశాడు రాణా. భామాసాహి కనిపించలేదు. ఇంతలో ఓ భటుడు వచ్చి రాణాకు నమస్కరించి ‘‘మహారాజా! ఉదయాత్పూర్వమే మీకందజేయమని భామాసాహిగారీ లేఖను నా చేతుల్లో ఉంచి వెళ్లిపోయారు’’ అంటూ ఓ లేఖను అందించాడు. అందులో ఏం రాసి ఉంటాడోనని అందరిలో ఆతృత, ఆసక్తి…
కృష్ణసింహుడు లేఖను చదవసాగాడు-
‘‘రాజాధిరాజ, మహారాజ మేవాడ్‌ రాజ్యలక్ష్మి దాస్యశృంఖలాలు తెంచిన మహారాణా ప్రతాపసింహులకు నమస్కారం. నేను దేశభక్తుణ్ని. మాతృభూమి స్వాతంత్య్రమే నాకు ముఖ్యం. పర్షియాలో ఉంటున్నా ఈ మహత్కార్యంలో పాలుపంచుకోవాలనే ఆరాటంతో మీకు నా చేతనైన సహాయం అందించాను. నా ఆశయం నెరవేరింది. అంతకు మించిన తృప్తి నాకింకేదీ లేదు. మీ పాలనలో మేవాడ్‌ కీర్తిప్రతిష్ఠలు విశ్వవ్యాప్తం కావాలి. అదే నాకు గొప్ప సన్మానం’’.

ఇట్లు
సదా మీ శ్రేయోభిలాషి
మేవాడ్‌ వాసి, పర్షియా వ్యాపారి
భామాసాహి.