ScienceAndTech

సివిల్స్ పరీక్షల్లో గుంటూరు-ఖమ్మం అభ్యర్థుల సత్తా

UPSC 2019 Exam Results Are Out - Telugu Candidates Rocked

దేశంలోనే అత్యున్నతంగా భావించే సివిల్‌ సర్వీసెస్‌-2019 ఫలితాల్లో ఈసారి తెలుగు అభ్యర్థులు సత్తా చాటారు. తెలంగాణ, ఏపీల నుంచి సుమారు 50 మంది ఎంపికయ్యారు. తెలంగాణకు చెందిన శిక్షణ ఐపీఎస్‌ పెద్దిటి ధాత్రిరెడ్డి 46వ ర్యాంకుతో తెలుగు రాష్ట్రాల్లో మొదటి స్థానంలో నిలవడం విశేషం. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మల్లవరపు సూర్యతేజ 76వ ర్యాంకుతో తెలుగు రాష్ట్రాల్లో రెండో స్థానాన్ని పొందారు. ఏటా మొదటి 10 లేదా 20 ర్యాంకుల్లోపు తెలుగు అభ్యర్థులు నిలుస్తుండగా ఈసారి వారికి చోటు దక్కలేదు. వంద ర్యాంకుల లోపు నలుగురు, 200 లోపు మొత్తం తొమ్మిది మంది మాత్రమే ర్యాంకులు సాధించారు. ఉమ్మడి ఏపీలో కీలకంగా వ్యవహరించిన మాజీ ఐఏఎస్‌ అధికారి బాలసుబ్రహ్మణ్యం కుమారుడు ప్రత్యూష్‌ ఈసారి 216వ ర్యాంకు సాధించారు. వైరా మాజీ ఎమ్మెల్యే మదన్‌లాల్‌ కుమారుడు మృగేందర్‌లాల్‌ 505, జనగామ జిల్లా నర్మెట్ట మండలం బొమ్మకూర్‌ సర్పంచి కుమారుడు రాకేష్‌నాయక్‌ 694వ ర్యాంకు సాధించారు.

తొలి ప్రయత్నంలో ఐపీఎస్‌కు ఎంపికైనా, ఐఏఎస్‌పై మక్కువతో పట్టుదలగా చదివి 46వ ర్యాంకు సాధించారు శిక్షణ ఐపీఎస్‌ పెద్దిటి ధాత్రిరెడ్డి. ఆమె స్వగ్రామం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలం గుండ్లబావి గ్రామం. ఎలాంటి శిక్షణ పొందకుండా 2018 నాటి సివిల్స్‌ పరీక్షలు రాసిన ధాత్రి 233వ ర్యాంకు సాధించి ఐపీఎస్‌కు ఎంపికయ్యారు. హైదరాబాద్‌లోని పోలీసు అకాడమీలో శిక్షణ పొందారు. ఇటీవలే ఖమ్మం జిల్లా శిక్షణ ఐపీఎస్‌ అధికారిగా నియమితులయ్యారు. గుంటూరు యువకుడు మల్లవరపు సూర్యతేజకు జాతీయ స్థాయిలో 76వ ర్యాంకు లభించింది. అయిదో ప్రయత్నంలో తన సివిల్స్‌ లక్ష్యాన్ని చేరుకున్నారు. సాంకేతిక పట్టభద్రుడైన సూర్యతేజ సాప్ట్‌వేర్‌ ఉద్యోగం చేశారు. 2018లో రాజీనామా చేసి సివిల్స్‌కు సన్నద్ధమయ్యారు. మొదటి నాలుగుసార్లు రాసినా ప్రిలిమ్స్‌ పూర్తికాలేదని, అయిదోసారి మరింత ప్రణాళికాబద్ధంగా చదవటం వల్ల టాప్‌ ర్యాంకు సాధించగలిగానని సూర్యతేజ చెబుతున్నారు.