ScienceAndTech

గూగుల్ ప్లే మ్యూజిక్ నుండి మొత్తం పోతాయి

గూగుల్ ప్లే మ్యూజిక్ నుండి మొత్తం పోతాయి

ఇన్నాళ్లు ప్రతి ఒక్కరి స్మార్ట్‌ఫోన్‌లో భాగమైన ప్రముఖ మ్యూజిక్‌ యాప్‌ గూగుల్ ప్లే మ్యూజిక్‌ ఇక కనుమరుగు కానుంది. దీన్ని శాశ్వతంగా మూసివేయాలని గూగుల్‌ నిర్ణయించింది. తొలుత ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లో ఈ సెప్టెంబర్‌ నుంచి.. మిగిలిన దేశాల్లో అక్టోబర్‌ నుంచి ఈ యాప్‌ ఇక పనిచేయదు. డిసెంబర్‌ తర్వాత ఇందులో డేటా మొత్తం తుడిచిపెట్టుకుపోతుందని గూగుల్‌ ఓ ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం గూగుల్‌కు చెందిన గూగుల్‌ ప్లే మ్యూజిక్‌, యూట్యూబ్‌ మ్యూజిక్‌ రెండూ ఒకేరకమైన సేవలందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఒకే తరహా యాప్‌లు రెండు అవసరం లేదని భావించిన గూగుల్‌.. గూగుల్‌ ప్లే మ్యూజిక్‌కు స్వస్తి చెప్పాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా గూగుల్‌ ప్లే మ్యూజిక్‌లో ఉన్న కంటెంట్‌ను యూట్యూబ్‌ మ్యూజిక్‌కు మార్చుకునేందుకు యూజర్లకు వీలు కల్పించింది. ఇందుకోసం యూట్యూబ్‌ మ్యూజిక్‌లో ఓ కొత్త బటన్‌ ఏర్పాటు చేసింది. యూజర్లు తమ డేటా కోల్పోకుండా ఉండేందుకు ఈ సదుపాయం కల్పించినట్లు గూగుల్‌ తెలిపింది. యూజర్లు తమ పాటలు, ఆల్బమ్‌లు, ప్లే లిస్టులు, అప్‌లోడ్స్‌ అన్నీ ట్రాన్స్‌ఫర్‌ చేసుకోవచ్చు. అయితే, మీ మొబైల్‌లో ముందుగా యూట్యూబ్‌ మ్యూజిక్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. గూగుల్‌ ప్లే మ్యూజిక్‌ తరహాలోనే యూట్యూబ్‌ మ్యూజిక్‌ సేవలుంటాయని గూగుల్‌ పేర్కొంది.