Health

తెలంగాణాలో 70వేలకు పైగా కరోనా కేసులు-TNI బులెటిన్

తెలంగాణాలో 70వేలకు పైగా కరోనా కేసులు-TNI బులెటిన్

* తెలంగాణలో గడిచిన 24 గంటల్లో.. కొత్తగా 2012 కరోనా కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ బుధవారం విడుదల చేసిన హెల్త్‌ బులెటిన్‌లో పేర్కొంది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 70,958కు చేరింది. కాగా కరోనా నుంచి కొత్తగా 1139 మంది కోలుకోగా.. ఇప్పటివరకు కరోనా నుంచి 50,814 మంది పూర్తిగా కోలుకొని డిశ్చార్జి అయ్యారు. కాగా గత 24 గంటల్లో కరోనాతో కొత్తగా 13 మంది మృతి చెందగా.. రాష్ట్రంలో మరణాల సంఖ్య 576కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 19,568 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. కాగా కేసుల విషయానికి వస్తే జీహెచ్‌ఎంసీ పరిధిలో 532,మేడ్చల్‌లో 198, రంగారెడ్డిలో 188, వరంగల్‌ అర్బన్‌లో 127 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ పేర్కొంది. తెలంగాణలో ఇప్పటివరకు 5,22,143 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.

* దేశంలో కరోనా వైరస్‌ ఉధృతి కొనసాగుతోంది. వరుసగా ఏడో రోజు 50 వేలకు పైగా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 52,509 వేల కేసులు వెలుగు చూడగా ఒక్క రోజే 857 మంది మృత్యువాత ప​డ్డారు. దీంతో ఇప్పటి వరకు మొత్తం 19,08,255 మంది కరోనా బారిన పడగా, మంగళవారం నాటికి 39,795 మరణాలు సంభవించాయి. ఈ మేరకు కేంద్ర వైద్యారోగ్యశాఖ బుధవారం హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది.

* క‌రోనాకి భ‌య‌ప‌డి టాలీవుడ్ సినీ పరిశ్ర‌మ‌కి సంబంధించిన ప్ర‌ముఖులు షూటింగ్‌లు మానేసి ఇంటికే ప‌రిమిత‌మైన సంగ‌తి తెలిసిందే. అయిన‌ప్ప‌టికీ క‌రోనా మ‌హ‌మ్మారి వారిని వ‌ణికిస్తుంది. ఇప్ప‌టికే తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌కి సంబంధించిన ప‌లువురు న‌టులు, సింగ‌ర్స్, ద‌ర్శ‌కులు క‌రోనా బారిన ప‌డ‌గా తాజాగా గాన గంధ‌ర్వుడు ఎస్పీ బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం క‌రోనా బారిన ప‌డ్డారు. తాజాగా ఆయ‌న ఈ విష‌యాన్ని సోష‌ల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేస్తూ పేర్కొన్నారు.

* సహజ సంక్రమణ, వ్యాక్సిన్‌కు మధ్య హెర్డ్‌ ఇమ్యూనిటీ వచ్చినప్పుడు కరోనా వైరస్‌కు నిజమైన అంతమని మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ అన్నారు. 2021 చివరిలోపు కొవిడ్‌-19 గుర్తింపు, చికిత్సలో వినూత్న పద్ధతులు, వ్యాక్సిన్లు వస్తాయని ఆయన అంచనా వేశారు. దాంతో మరణాల సంఖ్య మరింత తగ్గుతుందని ధీమా వ్యక్తం చేశారు. టీకాలు అందరికీ అందుబాటులోకి రావాలని కేవలం ధనిక దేశాలకు మాత్రమే సొంతం కాకూడదని ఆయన పేర్కొన్నారు. వ్యాక్సిన్‌ రూపొందించేందుకు ఆయన భారీగా నిధులు వెచ్చిస్తున్న సంగతి తెలిసిందే.

* కీళ్లవాతానికి వాడే టొసిలిజుమాబ్‌ డ్రగ్‌ కొవిడ్‌-19 నుంచి త్వరగా కోలుకొనేందుకు ఉపయోగపడుతోందని స్వీడన్‌లోని కరోలిన్‌స్కా విశ్వవిద్యాలయం ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ఫలితంగా ప్రాణవాయువుపై ఆధారపడే, ఆస్పత్రిలో చికిత్సా కాలం గణనీయంగా తగ్గుతోందని పేర్కొన్నారు. 87 మందిపై చేసిన అధ్యయనం ఫలితాలను ఇంటర్నల్‌ మెడిసిన్‌ జర్నల్‌లో ప్రచురించారు.