DailyDose

రఘురామకు Yకేటగిరి భద్రత-తాజావార్తలు

Breaking News - Raghurama Gets Y Category Security

* నరసాపురం వైసిపి ఎంపీ రఘురామకృష్ణంరాజుకు “వై” కేటగిరి భద్రత. 11మందితో కూడిన భద్రత ఏర్పాటు. తనకు ఏపీలో వైసిపి ఎమ్మెల్యేలతో ముప్పు ఉందని కేంద్రానికి ఫిర్యాదు చేసిన ఎంపీ రఘురామకృష్ణంరాజు. రఘురామకృష్ణంరాజు విజ్ఞప్తి మేరకు భద్రత కల్పించిన కేంద్రం.

* 48గంటల సవాల్‌ విసిరి తెదేపా అధినేత చంద్రబాబు ఏం చేశారో చెప్పాలని ఏపీ పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. విశాఖలోని వైకాపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… వ్యక్తిగత స్వార్థం కోసం చంద్రబాబు నిర్ణయాలు తీసుకుంటే.. చట్టాలకు లోబడే తాము నిర్ణయాలు తీసుకున్నామని చెప్పారు. అమరావతి రాజధాని కాదని మీకు ఎవరు చెప్పారని ప్రశ్నించారు. అమరావతిలోనూ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తాం.. త్వరలో విశాఖలో సీఎం శంకుస్థాపన చేస్తారని వెల్లడించారు. వెనుక, ముందు కట్‌ చేసిన వీడియోలను చంద్రబాబు జనాల్లోకి వదులుతున్నారని విమర్శించారు. చంద్రబాబుకు ఎందులో పేటెంట్‌ ఉందో అందరికీ తెలుసని ఎద్దేవా చేశారు.

* మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వైకాపాలో చేరనున్నారనే ప్రచారం నేపథ్యంలో అధికార పార్టీ శ్రేణులు ఆయనకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టాయి. గంటాను పార్టీలో చేర్చుకోవద్దంటూ నిరసనకు దిగారు. చిన్నాపురం, తగరపు వలస, వీఎం పాలెం వద్ద గంటాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వైకాపా అధిష్ఠానం కార్యకర్తల మనోభావాలు గుర్తించాలని కోరుతూ ప్లకార్డులు ప్రదర్శించారు. భీమిలి నియోజకవర్గంలోని కార్యకర్తలు ఈ ఆందోళనలో పాల్గొన్నారు.

* ఆంధ్రప్రదేశ్‌లో అక్టోబర్‌ 15 నుంచి కళాశాలలు ప్రారంభించాలని సీఎం జగన్ నిర్ణయించారు. ఉన్నత విద్యపై సీఎం జగన్‌ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సెప్టెంబర్‌లో ఉమ్మడి ప్రవేశ పరీక్షలు నిర్వహించాలని సీఎం ఆదేశించారు. విజయనగరం, ప్రకాశం జిల్లాల్లో విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అక్రమాలకు పాల్పడే కళాశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం జగన్‌ ఆదేశించారు.

* రాజధాని అమరావతికి సంబంధించిన పిటిషన్లపై గురువారం ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. రాజధాని నిధుల వ్యయం పిటిషన్‌ త్రిసభ్య ధర్మాసనం ముందుకు విచారణకు వచ్చిన సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇప్పటికే రూ.52వేల కోట్లు ఖర్చు చేశారని సీఆర్డీఏ రికార్డును న్యాయవాది మురళీధర్‌ చూపించగా..మొత్తం వివరాలు సమర్పించాలని ధర్మాసనం ఆదేశించింది.

* 48గంటల సవాల్‌ విసిరి తెదేపా అధినేత చంద్రబాబు ఏం చేశారో చెప్పాలని ఏపీ పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. విశాఖలోని వైకాపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… వ్యక్తిగత స్వార్థం కోసం చంద్రబాబు నిర్ణయాలు తీసుకుంటే.. చట్టాలకు లోబడే తాము నిర్ణయాలు తీసుకున్నామని చెప్పారు. అమరావతి రాజధాని కాదని మీకు ఎవరు చెప్పారని ప్రశ్నించారు.

* నవ్యాంధ్ర రాజధానిపై జగన్‌ ఉత్తరకుమార ప్రగల్భాలు పలికారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేశ్‌ విమర్శించారు. రాజధాని అంశంపై ఆయన ట్విటర్‌ వేదికగా స్పందించారు. ప్రపంచానికే తలమానిక రాజధాని నిర్మిస్తానని చెప్పి.. గొప్ప లక్ష్యంతో కట్టిన రాజధానిని ఎందుకు ధ్వంసం చేస్తున్నారని నిలదీశారు. ‘‘అమరావతి నిర్మాతగా చంద్రబాబు పేరు చరిత్రలో ఉండకూడదనే మూడు ముక్కలాటతో విధ్వంసం సృష్టిస్తున్నారా?ఐదు కోట్ల ఆంధ్రులకు మీరు సమాధానం చెప్పి తీరాలి’’ అని లోకేశ్‌ డిమాండ్‌ చేశారు.

* లెబనాన్‌.. ఈ పేరు వినగానే గుర్తుకొచ్చేది ఉత్సాహంగా గడిచే నైట్‌లైఫ్‌.. ఇప్పుడీ బుల్లి రాజ్యంలో ఎక్కడ చూసినా కూలిపోయిన భవనాలు.. విరిగిపోయిన తలుపులు.. పగిలిపోయిన అద్దాలే కనిపిస్తున్నాయి. మంగళవారం దేశ రాజధాని నగరం బీరుట్‌ నౌకాశ్రయంలో జరిగిన భారీ పేలుడుతో దాదాపు 3,00,000 మంది నిరాశ్రయులయ్యారు. ఈ సంఖ్య బీరుట్‌ జనాభాలో 10 వంతుకు సమానం. వేలాది మంది ఆసుపత్రుల వద్ద చికిత్స కోసం బారులు తీరారు.

* ఐరాస భద్రతామండలిలో కశ్మీర్‌ అంశాన్ని లేవనెత్తాలన్న చైనా కుయుక్తులను భారత్‌ ఎండగట్టింది. అలాంటి వృథా ప్రయత్నాలను మానుకోవాలని సూచించింది. భారత్ అంతర్గత వ్యవహారాల్లోకి తలదూర్చే యత్నాన్ని విదేశాంగ మంత్రిత్వశాఖ తీవ్రంగా ఖండించింది. జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే రాజ్యాంగంలోని అధికరణ 370ను రద్దు చేసి సంవత్సరం పూర్తైన తరుణంలో.. బుధవారం ఐరాస భద్రతామండలిలో కశ్మీర్ అంశాన్ని చర్చించడం కోసం పాకిస్థాన్‌ చేసిన ప్రయత్నానికి చైనా మద్దతు పలికింది. అయితే ఆ ప్రయత్నాలేవీ ఫలించలేదు.

* సిద్దిపేట జిల్లా చిట్టాపూర్‌లో దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి పార్థివదేహానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. సీఎంతోపాటు మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు, పువ్వాడ అజయ్‌ కుమార్‌, సత్యవతి రాఠోడ్‌లు రామలింగారెడ్డి పార్థివదేహానికి నివాళులర్పించారు.

* వచ్చే ఏడాది ప్రారంభానికి ఔషధ తయారీ సంస్థల వద్ద కరోనావైరస్‌ వ్యాక్సిన్‌ డోసులు కోట్ల సంఖ్యలో అందుబాటులో ఉండే అవకాశం ఉందని యూఎస్‌ వైద్య నిపుణుడు ఆంటోని ఫౌచీ ఆశాభావం వ్యక్తం చేశారు. బుధవారం రాయిటర్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.

* ఒక్క కరోనా కేసు వచ్చినా ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ మొత్తం నాశనం అవుతుందని కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ సహ యజమాని నెస్‌వాడియా హెచ్చరించారు. అందుకే లీగ్‌ను అత్యంత కఠినంగా నిర్వహించాలని బీసీసీఐకి సూచించారు. ఇంతకు ముందుతో పోలిస్తే ఐపీఎల్‌-2020 సూపర్‌హిట్‌ అవుతుందన్నారు. టీవీల్లో అత్యధికంగా వీక్షించిన టోర్నీగా చరిత్ర సృష్టిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బీసీసీఐ, ఫ్రాంచైజీల సమావేశం ముగిశాక ఆయన మీడియాతో మాట్లాడారు.