Kids

నల్గొండలో న్యూ బంజారా హిల్స్

నల్గొండలో న్యూ బంజారా హిల్స్

దీపావళి అంటే పండగనే మనకు తెలుసు. కానీ ఆ పేరుతో అందమైన ఓ ఊరుంది తెలుసా? భోజనం, డబ్బా… అంటే ఏ లంచ్‌ బాక్సో అనుకునేరు. అవి కూడా పల్లెలే! ఇలాంటి వింత పేర్లతో మన తెలుగు రాష్ట్రాల్లో బోలెడు ఊర్లున్నాయి!
*పల్లెవెలుగు బస్సు దిగగానే… అది రేపుకుంటూ వెళ్లిన దుమ్ములోంచి ఎదురుగా పచ్చని రంగులో మన ఊరి పేరున్న బోర్డు కనిపిస్తుంది. పల్లె, పేట, పురం, పాలెం… చివర ఏదున్నా ఆ పేరూ మన ఊరూ దేనికదే ప్రత్యేకం! తెలుగు వాకిళ్లలో వింతైన పదబంధాలతో విరబూసిన ఊరి పేర్లెన్నో!! వాటి గురించి తెలుసుకుంటే ఆ మట్టి వాసన మన మనసునూ తాకుతుంది!
***జంతువుల పేర్ల మీదుగా..
రాజుగారికే కాదు… ఆయన కుక్క గారికీ ఎంతో గౌరవం ఆ ఊళ్లో! అందుకే దాని పేరుమీదనే ‘శునకరేడుపురం’ అని పెట్టేశారు. ముద్దుగా ‘కుక్కరాజులపల్లె’ అని కూడా పిలుచుకుంటున్నారు. చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె మండలంలో ఉన్న ఈ ఊళ్లో ఒక రాజు తను ఎంతో ఇష్టంగా పెంచుకున్న కుక్కను చిన్న పొరపాటు వల్ల చేతులారా చంపేశాడట. తర్వాత నిజం తెలుసుకుని దానికి ప్రాయశ్చిత్తంగా తనూ ప్రాణాలు విడిచాడట. దీనికి గుర్తుగానే ఊరి పేరు అలా స్థిరపడిందన్నమాట. ఇంతేకాదు… ఇతర జంతువుల పేర్ల మీద కూడా బోలెడు ఊళ్లున్నాయి. మీ ప్రాంతం నెమలిపింఛంలా అందంగా ఉంది అనే అర్థంలో ‘ఇట్స్‌ లైక్‌ పీకాక్‌’ అని విదేశీయులు అన్నారట. దాన్ని కొన్నాళ్లు పీకాకీ అనీ, ఆ తర్వాత ‘కాకి’ అనీ అనడం మొదలెట్టారు అనంతపురం జిల్లాలోని ఆ ఊరి జనం. ‘వానపాముల’ అనే ఇంటి పేరుతో కృష్ణాజిల్లాలో ఓ మునసబు పనిచేసేవారట. ఆయన మీద అభిమానంతో దాన్నే తమ ఊరి పేరు చేసుకున్నారా ప్రజలు. వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో ఒకచోట ఎటుచూసినా కోతులే ఉండేవట. తాము ‘కోతులనడుమ’ జీవిస్తున్నాం అని సింబాలిక్‌గా చెప్పడానికో ఏమోగానీ దాన్నే ఊరిపేరు చేసుకున్నారా గ్రామస్థులు! జనగామ జిల్లాలో అయితే… ప్రజలు ఇక తమకు కోతుల బెడద తీరదని డిసైడ్‌ అయిపోయారు. అందుకే ఊరి పేరు ‘కోతులబాధ’గా ఫిక్సయ్యారు! వేవేల గోవులతో అలరారినందుకు తమ ఊరినే ‘కామధేనువు’ చేశారు శ్రీకాకుళం జిల్లాలోని ఆ గ్రామ గోపన్నలు. చాలాకాలం క్రితం ఒకసారి తన సొంత, సవతి తల్లులిద్దరూ ఆ ప్రాంతానికి తమ పేరే పెట్టాలని కోస్గీ సంస్థానం రాజు సిరాజుద్దౌలాను కోరారట. అమ్మలిద్దరూ అతడికి ప్రాణం. అందుకే దో(ఇద్దరు) మా(అమ్మలు) అని హిందీలో అర్థం వచ్చేలా ‘దోమా’ అని పేరు పెట్టాడు. అది కాస్తా వాడుకలో ‘దోమ’గా మారిపోయింది! ప్రస్తుతం వికారాబాద్‌ జిల్లాలో ఉందీ ఊరు.
****వైజాగ్‌లో ‘కొలంబో’
శ్రీలంక రాజధాని ‘కొలంబో’ పేరుతో విశాఖ జిల్లా మన్యంలో ఓ గిరిజన పల్లె ఉంది! అప్పట్లో ఇక్కడ కొలిమికాయలు అనే పంట బాగా పండేదట. దాంతో ఈ ప్రాంతాన్ని స్థానికులు కొలిమి అని పిలిచేవారు. దాని నుంచే ఆ తర్వాత కొలంబో అనడం అలవాటైందంటారు ఊరి పెద్దలు. నల్గొండ జిల్లాలో ‘న్యూ బంజారాహిల్స్‌’ది మరో కథ. జల్మాల్‌కుంట తండాకు చెందిన కొందరు రైతులు తమ భూములకు సమీపంలో గుట్టల మధ్య ఇళ్లు కట్టుకున్నారట. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌ కూడా గుట్టల మధ్యే ఉంటుంది కదా! అందుకే తమ తండాకు దాని పేరే పెట్టేశారు! ఇక ఈ ఊరి పేరు చదివితే మాత్రం ఇదేమి చోద్యం అనకుండా ఉండలేరు. ఎందుకంటే ఆ ఊరిపేరే ‘చోద్యం!’ విశాఖ జిల్లాలో ఉందిది. విజయనగరం జిల్లాలోని ‘పాంచాలి’ వెనుకైతే పెద్ద కథే ఉంది. దీని అసలు పేరు పంచాది. పంచ అనే పదాన్ని గుడిసె, ఆది అనే పదాన్ని సమూహం అనే అర్థంలో వాడుతుంటారు. ఒకేచోట పాకలన్నీ ఉండటంతో దీనికీ పేరొచ్చిందని చెబుతారు. ఇదే క్రమేణా పాంచాలిగా చలామణీ అవుతోంది. ఇంచుమించు ఇదే కారణంతో జగిత్యాల జిల్లాలో ‘డబ్బా’ అనే ఊరుకు ఆ పేరొచ్చింది. చాలాకాలం క్రితం అక్కడ ప్రజలంతా చిన్నచిన్న డబ్బారేకుల్లాంటి నివాసాలు ఏర్పాటు చేసుకున్నారట. అందుకే దాన్ని డబ్బా అనడం మొదలెట్టారట! తెలుగువారంటేనే భోజన ప్రియులు. మరి దానికీ ఊరి పేర్లలో స్థానముండాలిగా! అందుకే ‘భోజనం’ అనే పేరు పెట్టేశారు. కర్నూలు జిల్లాలోని ఈ గ్రామంలో అప్పటి రాజులు అన్నార్తులకు నిత్యం స్వయంగా భోజనం వడ్డించేవారట. అందుకే దీనికా పేరొచ్చిందని చెబుతారు.అమ్మాయి చేతిగాజులు చేసే గలగల చప్పుళ్లు ఎంత బావుంటాయో… ‘గలగల’ ఊరు కూడా అంతే బావుంటుంది! అనంతపురం జిల్లాలో ఉన్న ఈ గ్రామంలో ఒకప్పుడు గాజులు తయారు చేసేవారట. ఊరంతా అదే పని చేస్తుండటంతో దీనికి ఆ పేరు పెట్టుకున్నారు. శ్రీకాకుళం జిల్లాలోని ఊరి పేర్ల తీరే వేరు! అప్పట్లో ఒక రాజు నరక చతుర్దశి రోజు గుడికివెళుతూ అస్వస్థతకు గురై కింద పడిపోయాడట. అప్పుడు స్థానికులు ఆయనకు సపర్యలు చేసి కాపాడారు. దీపావళి రోజున తన ప్రాణాలు నిలిపినందుకు గుర్తుగా ఆ ఊరికి ఆయన ‘దీపావళి’ అనే పేరు పెట్టాడని ప్రతీతి. ‘వసుంధర’ అనే గ్రామానికి తమ ఊరి జనమంతా సహనంతో ఉంటూ ఖ్యాతి గడించేలా ఎదగాలన్న ఉద్దేశంతో పెద్దలు ఆ పేరు నిర్ణయించారు. ఇవే కాదండోయ్‌… పందెం, 150వ మైలు, మల్లి, ముష్టూరు, మెచ్చిరి… ఇలాంటి ఎన్నో ఊళ్లున్నాయ్‌! తెలుసుకునే మనసుండాలే కానీ… మనం పలికే ప్రతి పల్లె పేరు వెనుకా ఎన్నెన్నో కథలున్నాయ్‌!