Business

₹60వేలకు పరుగెడుతున్న బంగారం-వాణిజ్యం

₹60వేలకు పరుగెడుతున్న బంగారం-వాణిజ్యం

* చుక్కలు చూపిస్తున్న బంగారం ధరలు.. ఇవాళ ఏకంగా ఆల్‌టైం హైకి..! బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు రోజురోజుకూ పైపైకి ఎగబాకుతున్నాయి. శుక్రవారం నాడు మునుపెన్నడూ లేనంత స్థాయిలో పసిడి ధర పెరిగింది. 10 గ్రాముల మేలిమి బంగారం (24 క్యారెట్ల) ధర శుక్రవారం 58,330 రూపాయలకు చేరింది. కిలో వెండి ధర 78,300 రూపాయలకు చేరుకుంది.

* టెక్‌ దిగ్గజాలు వర్క్‌ఫ్రం హోం బాటపట్టాయి. కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతుండటంతో ఉద్యోగులను కార్యాలయాలకు రప్పించడాన్ని వాయిదా వేస్తున్నాయి. ఇప్పటికే అమల్లో ఉన్న వర్క్‌ఫ్రంహోంను కొనసాగిస్తున్నాయి. తొలుత ట్విటర్‌ ఉద్యోగులను ఇంటివద్ద నుంచే పనిచేయాలని సూచించగా.. గత నెలలో గూగుల్‌ కూడా వచ్చే ఏడాది వరకూ ఉద్యోగులకు వర్క్‌ ఫ్రం హోం అవకాశం ఇచ్చింది. తాజాగా సోషల్‌ మీడియా దిగ్గజం పేస్‌బుక్‌ కూడా ఉద్యోగులను వచ్చే జులై వరకు ఇంటి వద్ద నుంచే పనిచేయాలని కోరినట్లు ప్రముఖ ఆంగ్ల వార్తా సంస్థ రాయిటార్స్‌ పేర్కొంది. ఉద్యోగులు ఇంటి వద్ద ఆఫీస్‌ ఏర్పాటు చేసుకొనేందుకు 1,000 డాలర్లు ఇవ్వనున్నట్లు కూడా తెలిపింది.

* ఫేక్‌న్యూస్‌ కట్టడికి ట్విటర్‌ ఇప్పటికే ఫ్యాక్ట్‌ చెక్‌ విధానం ప్రవేశపెట్టింది. ఇప్పుడు దీనిని మరికొంచెం ముందుకు తీసుకెళ్లి మరో కొత్త చర్యను చేపట్టింది. ప్రభుత్వ అధికారులు, కీలక సంస్థలు, మీడియా ప్రతినిధుల ట్విటర్‌ ఖాతాలకు లేబుల్స్‌ ఇస్తోంది. ఈ విధానం వల్ల ప్రజలు వారు చెప్పేదానిని అంచనావేసుకోవడానికి అవకాశం ఉంటుందని పేర్కొంది. అధికారులు, ఉద్యోగులు సమాచారం పంచుకోవడాన్ని కొనసాగించవచ్చని వెల్లడించింది. ముఖ్యంగా అమెరికా ఎన్నికలు సమీపిస్తుండటంతో తప్పుడు సమాచారం వ్యాప్తిని అడ్డుకొనేందుకు ఈ నిర్ణయం తీసుకొన్నట్లు వెల్లడించింది.

* దేశీయ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగిశాయి. ఆద్యంతం ఒడుదొడుకులు ఎదుర్కొన్న మార్కెట్లు స్పల్ప లాభాలతో వారాంతాన్ని ముగించాయి. ఉదయం స్వల్ప నష్టాలతో ప్రారంభమైన సెన్సెక్స్‌ ఆద్యంతం ఎత్తుపల్లాలను చవిచూసింది. చివరికి 15.12 పాయింట్ల లాభంతో 38,040.57 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 13.80 పాయింట్లు లాభపడి 11,214.25 పాయింట్ల వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ 74.92గా ఉంది.

* ప్రముఖ షార్ట్‌ వీడియో యాప్‌ టిక్‌టాక్‌ అమెరికా కార్యకలాపాల కొనుగోలుకు చర్చలు జరుపుతున్న టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌.. మరిన్ని దేశాల ఆపరేషన్స్‌ను కూడా సొంతం చేసుకోవాలని భావిస్తోంది. చైనా మినహా మిగిలిన దేశాల్లోని టిక్‌టాక్‌ కార్యకలాపాలను కొనుగోలు చేసేందుకు చర్చలు జరుపుతున్నట్లు ఫైనాన్షియల్‌ టైమ్స్‌ తన కథనంలో పేర్కొంది. ఆ దేశాల్లో భారత్‌ కూడా ఉన్నట్లు సమాచారం.