Food

బీట్‌రూట్‌తో దోమలు పరార్

బీట్‌రూట్‌తో దోమలు పరార్

సాయంత్రం ఆరయితే చాలు… తలుపులూ, కిటికీలూ ఎంత బిగించుకున్నా దోమల దాడి మాత్రం ఆగదు! నెలనెలా ఇంటి బడ్జెట్‌లో దోమల మందులకు కొంత కేటాయించాల్సిందే. అయితే తక్కువ ఖర్చుతో వీటిని తరిమికొట్టేలా స్వీడన్‌లోని లాండ్‌ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలో ఓ ఆసక్తికరమైన విషయం తేలింది. మనుషులను కుట్టేది ఆడ దోమలేనని తెలుసు కదా! గుడ్లు పెట్టేందుకు సిద్ధమయ్యే సమయంలో ఈ దోమలు జియోస్మిన్‌ అనే ఒక రకమైన వాసనకు ఆకర్షితమవుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు. ఆ వాసన ఉండేచోట వాతావరణాన్ని మైక్రోఆర్గానిజమ్స్‌ సాయంతో లార్వాలు పెరిగేందుకు అనుకూలంగా ఉండేలా దోమలు మలుచుకుంటాయట. అందుకే జియోస్మిన్‌ను ఉపయోగించి దోమలకు ట్రాప్‌ తయారుచేయవచ్చని చెబుతున్నారీ శాస్త్రవేత్తలు. ఈ పదార్థం బీట్‌రూట్‌ తొక్కల్లో అధికంగా అధికంగా ఉండటంతో ఆ జ్యూస్‌ వాడి దోమలన్నీ ఒకేచోట చిక్కుకునేలా చేయొచ్చని గుర్తించారు. దీన్ని పూర్తిస్థాయిలో వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చేలా మరిన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ విధానం చవకైనదే కాక, పర్యావరణ హితం కూడానట.