Politics

భద్రాచలం ప్రజలే మా నాన్నను చంపేశారు

భద్రాచలం ప్రజలే మా నాన్నను చంపేశారు

‘కరోనా సోకిన తర్వాత జనాలు వివక్ష చూపించారు. ఆయన వస్తుంటే తలుపులు మూసుకునేవారు. ధైర్యం చెప్పి ఉంటే బతికి ఉండేవారు’… భద్రాచలం మాజీ శాసనసభ్యుడు సున్నం రాజయ్య కుమారుడు చెప్పిన మాటలివి. 

భద్రాచలం మాజీ ఎమ్మెల్యే, సీపీఎం సీనియర్ నాయకుడు సున్నం రాజయ్య కరోనా బారిన పడి మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన మృతిపట్ల పార్టీలకతీతంగా నేతలు సంతాపం ప్రకటించారు. కాగా… ఆయన కుమారుడు విడుదల చేసిన ఓ ఆడియో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

తన తండ్రి ఉద్యమాలే ఊపిరిగా బతికారని… అందుకే తనకు సీతారామరాజు అని పేరు పెట్టుకున్నారని తెలిపారు. కరోనా సోకిన తన తండ్రి పట్ల తమ గ్రామంలో వివక్ష చూపారని ఆవేదన వ్యక్తం చేశారు. తొలుత తన అక్కకు కరోనా సోకిందని, దీంతో… తన తండ్రిని గ్రామస్తులు అదోలా చూడటం, ఆయన వస్తున్నప్పుడు తలుపులు వసుకోవడం చేశారని తెలిపారు.

ఈ క్రమంలో… ఆయన మానసికంగా కృంగిపోయారని, ఆ తర్వాత ఆయనకు కూడా కరోనా పాజిటివ్ అని తేలిందని చెప్పారు. దీంతో, ఆయనలో విపరీతమైన ఆందోళన చోటుచేసుకుందని తెలిపారు.

ప్రజలు కోసం పాటుపడితే… ఆ ప్రజలే దూరం పెట్టడాన్ని తన తండ్రి తట్టుకోలేకపోయారని అన్నారు. ప్రజలు పలకరిస్తూ, ధైర్యం చెప్పి ఉంటే ఆయన బతికి ఉండేవారని ఆవేదన వ్యక్తం చేశారు.