Fashion

నేడు జాతీయ చేనేత దినోత్సవం

నేడు జాతీయ చేనేత దినోత్సవం

చేనేత
మానవాళికి వస్త్రాన్ని అందించిన నాగరికత
ఆరు గజాల చీర నేసి అగ్గిపెట్టెలో అమర్చిన ఘనత
వస్త్ర వైవిధ్యానికి, ఒడుపెరిగిన శ్రామికశక్తికి మమేకత
వస్త్ర వైభవానికి, నేతన్నల గౌరవానికి ప్రత్యేకత

చేతివృత్తులన్నింటికీ సంఘటితంగా నిలిచిన సంచిత
సృజనాత్మక హస్త కళానైపుణ్యానికి సమ్మోహన భరిత
నేతన్నల ప్రతిభని ప్రపంచానికి పరిచయం చేసిన చరిత
భారత సంస్కృతీ సంప్రదాయాలకి నిలువెత్తు సమసరిత

నరాల్ని నూలుపోగులుగా మార్చుకుని
రక్తాన్ని రంగులుగా అద్దకం అద్దుకుని
గుండెని పిండి కందెనగా పోసి
అంగాంగాన్ని ఆసు రథాన్ని తిప్పే ఆయుధాలుగా చేసి
మగ్గమనే అస్త్రంతో వస్త్రాన్ని నేసిన నేతన్న!
చేయూత కరువాయే నేడు నీకు చేనేతన్న!

రంగురంగుల చీరలు నేసే నేతన్న!
రంగెలిసిన జీవితం నీదాయే నేతన్న!
పట్టు వస్త్రాలుని పదిలంగా అల్లిన నేతన్న!
పట్టెడన్నం పూటకింత పుట్టదాయే నేతన్న!
రెక్కాడితేగాని డొక్కాడని బతుకు నీదన్నా
మక్కలు ముక్కలు చేసినా మెతుకు నీకు లేదన్నా!

కష్టాల కన్నీళ్ళ కలబోతతో
కడుపు నింపని మగ్గాన్ని చేతపట్టి
నిరంతర శ్రమతో
బతుకుదెరువు భ్రమై
చక్రబందంలో చిక్కుకున్న ఓ చేనేతన్నా!
రెడీమేడ్ దుస్తులతో
నీ కడుపు కొడుతుంటే అర్ధాకలితో అలమటిస్తున్నావా నేతన్నా!

కీళ్ల నొప్పులు
వెన్ను నొప్పులతో
వెన్నూ దన్నూ లేని జీవితం నీదన్నా!
కంటిచూపు సమస్యలతో
నీ ఇంటిని కాపు కాయలేని దైన్య జీవనం నీదన్నా!
నరాల బలహీనతలతో, గుండె జబ్బులతో
వైద్యం అందుకోలేక
కుటుంబాన్ని ఆదుకోలేక నరకయాతన అనుభవిస్తున్నావన్నా!

నేసిన వస్త్రాలకి ధర లేదాయే నేతన్న
చేసిన అప్పుల ధార ఆగదాయే నేతన్న
నూలు లేక పని ఆగిపోయాక
ఇంటి అద్దెకి సొమ్ములేక
తినడానికి తిండిలేక
పిల్లల్ని పోషించలేక
జరీ చీరల్ని నేసిన నీకే ఏ దారి లేక
తనువు చాలించడమే అనువుగా చేసుకుంటున్నావా నేతన్న!

నమ్ముకున్న చేనేత వృత్తికి ఆదరణ కరువై
ధనీల వద్ద చేనేత జీతగాడిగా మారావన్నా!
అమ్ముకున్న వస్త్రాలకి ధరలేక బతుకు భారమై
పవర్ లూముల్లో రోజుకూలీ అవతారమెత్తావన్నా!
కమ్ముకున్న మబ్బుల్లో నీ ప్రతిభ చీకటై
చేనేత మిల్లులో నిర్బంధ కార్మికుడిగా చేరావన్నా!

బలైపోతున్నాయి
మీ బతుకులు కబలిపోతున్నాయి
ఈ నేతల పాలనలో
‘ఛీ’నేతల పరిపాలనలో
‘చేనేత’ బతుకులు ఛిద్రమైపోతున్నాయి

నేతలు ఎందరు మారినా
మీ చేనేత రాతలు ఎందుకు మారడం లేదన్నా!
నేసే చేతులే నేతగా మారితే
మీ బతుకులు ఎందుకు మారవన్నా!

సిరిసిల్ల సింగార చీరలు
గొల్లభామ గోరంచు చీరలు
గద్వాల్ పట్టు పంచెలు
పోచంపల్లి పోగు చీరలు
కొత్తపల్లి టవళ్ళు
రాజోలీ రగ్గులు
వరంగల్ డర్రీలు
వెంకటగిరి చేనేత వెలుగులు
ధర్మవరం ధరల చీరలు
మీ చేతి నుండి జాలువారిన చేనేత కళాఖండాలే చేనేతన్న!
మీ వస్త్ర కళానైపుణ్యం దేశాలు ఖండాలు దాటాయన్నా!
మీ బతుకులు మాత్రం ఖండఖండాలు అయిపోయాయన్నా!

నేడు జాతీయచేనేతదినోత్సవం

NationalHandloomDay
SupportHandloom
SupportWeavers
చేనేత వస్త్రాలు మన సంస్కృతికి పట్టుకొమ్మలు…..
చేనేత వస్త్రాలు ధరించడంవల్ల…. చేనేత కారులకి ఉపాధిని కల్పించిన వాళ్ళమవుతాం.
?????