Business

₹60కోట్లు దాటిన అమరరాజ లాభం-వాణిజ్యం

₹60కోట్లు దాటిన అమరరాజ లాభం-వాణిజ్యం

* తొమ్మిది రోజులుగా వరుసగా పెరుగుతున్న ఇంధన ధరలు సామాన్యుడిని ఆందోళనకు గురిచేస్తున్నాయి. అసలే కరోనావైరస్‌ కారణంగా ఉపాధి దెబ్బతిన్న వారికి ఇది మరింత భారంగా మారింది. ఇప్పుడు చాపకింద నీరులా ఇంధన ధరలు పెరగడం రవాణా రంగం సహా ఇతర రంగాలపై ప్రభావం చూపించనుంది. అసలు ఇంధన ధరలు ఎందుకు పెరుగుతున్నాయి.. అంతర్జాతీయ మార్కెట్లలో ధరలు తగ్గితే ఆ ప్రభావం ఎందుకు కనిపించడంలేదు…..భారత్‌లో చమురు ధరలను అంతర్జాతీయ మార్కెట్లకు అనుసంధానించారు. అంటే అక్కడ ధరలు తగ్గితే.. ఇక్కడ కూడా ఆ ప్రభావంతో ధరలు పతనం అవ్వాలి. కానీ, అలా జరగడంలేదు. గత ఫిబ్రవరిలో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు విపరీతంగా పతనం అయ్యాయి. కానీ, మన మార్కెట్లలో ఆ స్థాయి తగ్గింపు కనిపించలేదు. పైగా గత తొమ్మిది రోజుల నుంచి మాత్రం క్రమం తప్పకుండా ధరలు పెరుగుతూ వస్తున్నాయి. దాదాపు 82 రోజుల విరామం తర్వాత ఈ పరిణామాలు చోటు చేసుకొంటున్నాయి. పైగా బ్రెంట్‌ క్రూడ్‌ ధరలు జూన్‌ 1 తర్వాత నుంచి మళ్లీ తగ్గుతున్నాయి.

* కరోనావైరస్‌ రెండో తరంగం ప్రపంచాన్ని ముంచేందుకు వేగంగా దూసుకొస్తోంది. ఇటీవలే ఆసియాలోనే అతిపెద్ద షిన్‌ఫడి హోల్‌సేల్‌ మార్కెట్లో కరోనావైరస్‌ పడగవిప్పడంతో బీజింగ్‌లో ప్రధాన ప్రాంతాలు లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోయాయి.. మరోపక్క అమెరికాలో కూడా ‘స్టే ఎట్‌ హోమ్’‌ నిబంధనలు ఎత్తేయడంతో భారీ సంఖ్యలో కేసులు పెరుగుతున్నాయి. ఈ ప్రభావం స్టాక్‌మార్కెట్లు, ఆర్థిక వ్యవస్థపై తీవ్రంగా పడుతోంది. మూలిగే నక్కపై తాటిపండు పడిన చందాన మరిన్ని ఉద్యోగాలకు కోతలు పడే ప్రమాదం ఉంది. భారత్‌లో కూడా లాక్‌డౌన్‌ నిబంధనలు సడలించాక కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. చెన్నైలో మరోసారి లాక్‌డౌన్‌ విధించడం పరిస్థితికి అద్దం పడుతోంది. అమెరికాలోని వైద్య నిపుణులు కూడా రెండో తరంగం మొదలైందనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

* ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ఔషధ సంస్థ సిప్లా ఏకీకృత ప్రాతిపదికన రూ.566.04 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో కంపెనీ ఆర్జించిన రూ.447.15 కోట్ల నికర లాభంతో పోలిస్తే ఇది 26.58 శాతం ఎక్కువ. అధిక అమ్మకాలు కలిసొచ్చాయని కంపెనీ తెలిపింది. మొత్తం కార్యకలాపాల ఆదాయం రూ.3,989.02 కోట్ల నుంచి రూ.4,346.16 కోట్లకు పెరిగాయని కంపెనీ ఎక్స్ఛేంజీలకు సమాచారం ఇచ్చింది. గత త్రైమాసికంలో భారత్‌, దక్షిణాఫ్రికా, అమెరికా వంటి విపణుల్లో మంచి వృద్ధి సాధించామని, వ్యయ నియంత్రణతో ఎబిటా 24 శాతానికి పెరిగిందని సిప్లా ఎండీ, గ్లోబల్‌ సీఈఓ ఉమాంగ్‌ వోహ్రా అన్నారు. వ్యూహాత్మక భాగస్వామ్యాలు, పలు కొత్త ఉత్పత్తులతో కొవిడ్‌-19 పోరులో ముందంజలో ఉన్నామని వెల్లడించారు.

* అమరరాజా బ్యాటరీస్‌ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రూ.1,151 కోట్ల ఆదాయాన్ని, రూ.62.68 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదేకాలంలో ఆదాయం రూ.1,814 కోట్లు, నికరలాభం రూ.140.91 కోట్లుగా ఉన్నాయి. దీంతో పోల్చితే ఈసారి ఆదాయం, నికరలాభం తగ్గినట్లు స్పష్టమవుతోంది. కొవిడ్‌- 19 లాక్‌డౌన్‌ వల్ల తయారీ, విక్రయ కార్యకలాపాలకు ఇబ్బందులు ఎదురైనప్పటికీ మెరుగైన అమ్మకాలు నమోదు చేయగలిగినట్లు కంపెనీ పేర్కొంది. ఆటోమోటివ్‌ బ్యాటరీల విభాగంలో ఓఈఎం (వాహన తయారీ సంస్థలకు) విక్రయాలు బాగా తగ్గినట్లు, ఆటోమొబైల్‌ కంపెనీల్లో ఉత్పత్తి తగ్గిపోవటం దీనికి కారణమని వివరించింది. అయితే ‘ఆఫ్టర్‌ మార్కెట్‌’ అమ్మకాలు కోలుకున్నట్లు వెల్లడించింది. యూపీఎస్‌, టెలీకామ్‌ విభాగాల నుంచి అమ్మకాలు పెరుగుతున్నట్లు తెలిపింది.

* దేశీయ వాహన దిగ్గజం మహీంద్రా అండ్‌ మహీంద్రా నిరాశపరిచింది. జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ ఏకీకృత నికర లాభం 94 శాతం క్షీణించి రూ.54.64 కోట్లకు పడిపోయింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో కంపెనీ నికర లాభం రూ.894.11 కోట్లు కావడం గమనార్హం. మొత్తం కార్యకలాపాల ఆదాయం రూ.26,041.02 కోట్ల నుంచి 37 శాతం తగ్గి రూ.16,321.34 కోట్లకు చేరింది. ఆటోమోటివ్‌ విభాగ ఆదాయం రూ.13,587.84 కోట్ల నుంచి రూ.6,508.6 కోట్లకు తగ్గింది. వ్యవసాయ పరికరాల విభాగ ఆదాయం రూ.6077.9 కోట్ల నుంచి రూ.4906.92 కోట్లకు పరిమితమైంది. ఆర్థిక సేవల ఆదాయం మాత్రం రూ.2,822.03 కోట్ల నుంచి రూ.3,031.69 కోట్లకు పెరిగింది. ఆతిథ్య సేవల విభాగ ఆదాయం రూ.612.49 కోట్ల నుంచి రూ.294.26 కోట్లకు క్షీణించింది. కొవిడ్‌-19 మహమ్మారి, అనంతరం విధించిన లాక్‌డౌన్‌తో త్రైమాసికంలో కార్యకలాపాలు నిలిచిపోయాయని, అనంతరం కోలుకున్నాయని.. ఇవి త్రైమాసిక ఫలితాలపై ప్రభావం చూపాయని కంపెనీ తెలిపింది.

* దక్షిణ కొరియా వాహన దిగ్గజం కియా మోటార్స్‌ కార్పొరేషన్‌ కాంపాక్ట్‌ ఎస్‌యూవీ సొనెట్‌ను శుక్రవారం అంతర్జాతీయంగా ఆవిష్కరించింది. వచ్చే నెలలో భారత్‌ విపణిలోకి ఈ వాహనాన్ని విడుదల చేసేందుకు కియా సన్నాహాలు చేస్తోంది. కియా ఆంధ్రప్రదేశ్‌ ప్లాంట్‌లో ఈ వాహనాన్ని ఉత్పత్తి చేయనున్నారు. ఇతర దేశాలకు సైతం ఇక్కడ నుంచే ఎగుమతి చేస్తారు. భారత్‌లో సెల్టోస్‌, కార్నివాల్‌ తర్వాత కియా సొనెట్‌ మూడో మోడల్‌ కావడం గమనార్హం. దేశీయ విపణిలో హ్యుందాయ్‌ వెన్యూ, మారుతీ విటారా బ్రెజా, టాటా నెక్సాన్‌, మహీంద్రా ఎక్స్‌యూవీ 300 మోడళ్లతో ఇది పోటీపడే అవకాశం ఉంది. కియా సొనెట్‌లో మల్టీపుల్‌ పవర్‌ట్రైన్‌ సదుపాయాలు ఉన్నాయి. 1.2 లీటర్‌, 1 లీటర్‌ టర్బో పెట్రోల్‌ వేరియంట్లు, 1.5 లీటర్‌ డీజిల్‌ ఇంజిన్‌ కలిగిన 5 మాన్యువల్‌, ఆటోమేటిక్‌ ట్రాన్స్‌మిషన్‌లలో ఇది లభించనుంది. డీజిల్‌ 6-స్పీడ్‌ ఆటోమేటిక్‌ ట్రాన్స్‌మిషన్‌తో వస్తున్న మొదటి కాంపాక్ట్‌ ఎస్‌యూవీ కూడా ఇదే కావడం విశేషం.