DailyDose

మళ్లీ సుప్రీంకు వెళ్లిన ఏపీ ప్రభుత్వం-తాజావార్తలు

మళ్లీ సుప్రీంకు వెళ్లిన ఏపీ ప్రభుత్వం-తాజావార్తలు

* సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం స్పెషల్ లీవ్ పిటిషన్3 రాజధానులు, సీఆర్డిఏ బిల్లులువిషయంలో  హైకోర్టు ఉత్తర్వులపై స్టే ఇవ్వాలని పిటీషన్. మధ్యంతర ఉత్తర్వులు నిలిపివేయాలని ఏపీ సర్కార్ పిటిషన్. సోమవారానికి విచారణకు వచ్చే అవకాశం.

* కేరళలోని కొలికోడ్‌ విమానాశ్రయం రన్‌వేపై శుక్రవారం చోటు చేసుకున్న విమాన ప్రమాద ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. విమానం నుంచి బ్లాక్బాక్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు డీజీసీఏ వెల్లడించింది. ఇందులో ఉండే డిజిటల్‌ ఫ్లైట్‌ డేటా‌ రికార్డర్‌ (డీఎఫ్‌డీఆర్‌), కాక్‌పిట్‌ వాయిస్‌ రికార్డర్‌ (సీవీఆర్‌)లలో నిక్షిప్తమైన సమాచారాన్ని విశ్లేషించనున్నారు. దీని ద్వారా.. విమానం ఎత్తు, స్థితి, వేగానికి సంబంధించిన వివరాలతోపాటు.. ప్రమాద సమయంలో పైలట్ల మధ్య జరిగిన సంభాషణ వివరాలు కూడా లభించనున్నాయి. దీంతో ప్రమాదానికి గురైన ఎయిరిండియా ఐఎక్స్‌-1344 విమానంలో ఏం జరిగి ఉంటుందో తెలుసుకునే వీలవుతుందని అధికారులు తెలిపారు.

* కాంగ్రెస్‌ నేత, మాజీ ఎంపీ నంది ఎల్లయ్య(85) కరోనాతో కన్నుమూశారు. హైదరాబాద్‌లోని నిమ్స్‌లో చికిత్స పొందుతూ ఆయన ఈ ఉదయం తుది శ్వాస విడిచారు. జులై 29న అనారోగ్యంతో ఆయన ఆస్పత్రిలో చేరారు. ఆ తర్వాత కరోనా పరీక్షలు చేయగా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.

* తన ప్రతిష్టకు భంగం కలిగే విధంగా సామాజిక మాధ్యమాల్లో ప్రచారం సాగిస్తున్నారంటూ ఝార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ రూ.100 కోట్ల పరుపునష్టం దావాను రాంచీ సివిల్‌ కోర్టులో దాఖలు చేశారు. భాజపా ఎంపీ డాక్టర్‌ నిషికాంత్‌ దూబె తనపై అసత్య ప్రచారం సాగిస్తున్నారంటూ ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆగస్టు 4న నమోదయిన ఈ కేసులో ఎంపీతో పాటు, సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌ (ఇండియా)ను కూడా ప్రతివాదిగా చేర్చారు. వీరిద్దరూ తనకు నష్టపరిహారంగా రూ.100 కోట్లు ఇవ్వాలని ముఖ్యమంత్రి న్యాయస్థానాన్ని అభ్యర్ధించారు.

* కేరళలోని కొలికోడ్‌ విమాన ప్రమాద స్థలాన్ని కేంద్ర విమానయాన శాఖ మంత్రి హర్‌దీప్‌సింగ్ పూరి పరిశీలించారు. ఈ ఘటనలో మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారాన్ని ప్రకటించారు. తీవ్రంగా గాయపడిన బాధితులకు రూ.2 లక్షలు.. స్వల్పంగా గాయపడిన వారికి రూ.50 వేల పరిహారం ఇస్తామని చెప్పారు. మరోవైపు విమాన ప్రమాదంపై దర్యాప్తు కొనసాగుతోంది. బ్లాక్‌బాక్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.

* రాష్ట్రంలో కరోనా కట్టడి చర్యలకు ప్రభుత్వం తాజాగా రూ.100 కోట్లు కేటాయించిందని తెలంగాణ ప్రజారోగ్య శాఖ సంచాలకుడు శ్రీనివాసరావు తెలిపారు. హైదరాబాద్‌లో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.. విలువైన ఇంజెక్షన్లను జిల్లా స్థాయి వరకు అందుబాటులో ఉంచామన్నారు. ఆసుపత్రుల్లో ఆక్సిజన్‌, పడకలు కూడా అందుబాటులోకి తెచ్చినట్లు పేర్కొన్నారు. కరోనా రోగులు కోలుకునే విధంగా ప్రభుత్వం ధైర్యం కల్పిస్తోందని చెప్పారు. రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకునే రికవరీ రేటు పెరిగి, కరోనా మరణాల శాతం తగ్గిందని వివరించారు.

* ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి, తెలంగాణ సీఎం కేసీఆర్‌కు కేంద్ర జల్ శక్తి మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్ లేఖ రాశారు. అపెక్స్‌ కౌన్సిల్‌ అనుమతి లేకుండా కొత్త ప్రాజెక్టులు చేపట్టవద్దని కేంద్రమంత్రి సూచించారు. పెండింగ్‌ అంశాల పరిష్కారానికి అపెక్స్‌ కౌన్సిల్‌ రెండో భేటీ త్వరలో జరగాలని చెప్పారు. నీటి వివాదాల గురించే లేఖలో ప్రధానంగా ప్రస్తావించారు. రెండు రాష్ట్రాల మధ్య సమన్వయం లోపించిందని కేంద్రమంత్రి లేఖలో వెల్లడించారు.

* హీరా గోల్డ్‌ కుంభకోణంలో ప్రధాన నిందితురాలు, హీరా గోల్డ్‌ సంస్థల ఎండీ నౌహీరా షేక్‌కు చెందిన భూములును ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) స్వాధీనం చేసుకుంది. టోలీ చౌకి ఎస్‌ఏ కాలనీలో రూ. 70 కోట్ల విలువైన 81 ప్లాట్లను రెవెన్యూ, పోలీసుల సహకారంతో ఈడీ తమ అధీనంలోకి తీసుకుంది. దీంతో ఇప్పటి వరకు ఈ కేసులో సుమారు రూ. 300 కోట్ల ఆస్తులను ఈడీ జప్తు చేసింది. హీరో గోల్డ్‌ రూ. 5వేల కోట్ల కుంభకోణంపై మానీలాండరింగ్‌ కేసులో ఈడీ దర్యాప్తు చేస్తోంది.

* కరోనా వైరస్‌ను కట్టడి చేసే కొవిడ్‌-19 నిరోధక వ్యాక్సిన్‌ కోసం ప్రపంచమంతా ఆతృతగా వేచిచూస్తోంది. కాగా, కరోనా వ్యాక్సిన్‌ను అందిపుచ్చుకునేందుకు వివిధ దేశాలు తయారీదారులతో ముందస్తు చర్చలు జరుపుతున్నాయి. మరోవైపు కరోనా వ్యాక్సిన్‌ తయారీ మాత్రమే కాకుండా దాని పంపిణీ కూడా ప్రభుత్వాలకు సవాలు కానుందని స్పష్టమవుతోంది. దీనితో కేంద్ర ప్రభుత్వం కూడా కరోనా వ్యాక్సిన్‌ కొనుగోలు, పంపిణీ తదితర వ్యవహారాలను పర్యవేక్షించేందుకు ఓ ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటుచేయనున్నట్టు తెలిసింది.

* కోలికోడ్‌ విమాన ప్రమాదం దేశవ్యాప్తంగా ఆందోళన రేకెత్తించింది. టేబుల్‌ టాప్‌ రన్‌వే పై నుంచి విమానం జారి రెండు ముక్కలవ్వడం దిగ్భ్రాంతి కలిగించింది. ఈ ఘటనలో అనేకమంది ప్రయాణికులు మరణించారు. విమానాన్ని సురక్షితంగా దించేందుకు పైలట్‌, కెప్టెన్‌ దీపక్‌ వీ సాథె రెండుసార్లు ప్రయత్నించినా ప్రమాదం జరగడం దురదృష్టకరమని వైమానిక వర్గాలు అంటున్నాయి. దీపక్‌ వీ సాథెకు హైదరాబాద్‌ నగరంతో మంచి అనుబంధం ఉంది.

* తాజాగా శ్రుతి హాసన్‌ ఓ పాట రాసి.. స్వరాలు సమకూర్చి.. ఓ వీడియో సాంగ్‌ను రూపొందించింది. ఆ పాటను ‘ఎడ్జ్‌’ పేరుతో శ్రుతి తన యూట్యూబ్‌ ఛానెల్‌లో విడుదల చేసింది. ఆంగ్లంలో ఉండే ఈ పాటను శ్రుతి హాసన్‌ హాలీవుడ్‌ సింగర్స్‌కు ఏ మాత్రం తీసిపోకుండా పాడింది. ప్రస్తుతం ఈ సాంగ్‌ ఆమె అభిమానులను, నెటిజన్లు తెగ ఆకట్టుకుంటోంది.

* కోలికోడ్‌ ఘటన మరువకముందే మరో విమాన ప్రమాదం జరిగింది. అయితే ఎలాంటి ప్రాణనష్టం లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ సారి పక్షి తగలడంతో విమానాన్ని ఆపేసిన సంఘటన ఝార్ఖండ్‌లోని రాంచీ విమానాశ్రయంలో చోటు చేసుకుంది. ఎయిర్‌ ఏషియా విమానం టేకాఫ్‌ సమయంలో పక్షి తగలడంతో అధికారులు అప్పటికప్పుడు నిలిపివేశారు. ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నట్లు పేర్కొన్నారు. విమానం రాంచీ నుంచి ముంబయి బయలుదేరే సమయంలో ఈ ఘటన జరిగింది.

* కేరళలోని కొలికోడ్‌లో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకున్న నేపథ్యంలో.. సహాయ చర్యలను సమన్వయం చేయడానికి, బాధితులు, వారి కుటుంబాలకు కౌన్సిలింగ్ ఇవ్వడానికి ఎయిరిండియాకు చెందిన ప్రత్యేక బృందం ఘటనాస్థలికి చేరుకుంది. సిబ్బంది, చిన్నారులు, ప్రయాణికులతో కలిపి 190 మందితో కొలికోడ్‌కు చేరుకున్న విమానం ల్యాండ్ అయ్యే క్రమంలో ఘోర ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఇప్పటికే 19 మంది మరణించారు.

* కరోనా వైరస్‌పై పోరాటంలో బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్‌ ఎట్టకేలకు విజయం సాధించారు. కరోనా నిర్ధారణ పరీక్షల్లో నెగెటివ్ అని తేలినట్లు శనివారం ఆయన ట్విటర్ వేదికగా వెల్లడించారు. బచ్చన్‌ కుటుంబంలో జయా బచ్చన్ మినహా, అమితాబ్ బచ్చన్‌, అభిషేక్‌, ఐశ్వర్య, ఆరాధ్య అందరూ వైరస్‌ బారిన పడ్డారు. అయితే కొన్నిరోజుల చికిత్స అనంతరం వారు వైరస్‌ను జయించి ఇంటికి చేరుకున్నారు. కానీ అభిషేక్ రిపోర్టుల్లో పాజిటివ్ రావడంతో ఇంకా కొన్ని రోజులు ఆయన ఆసుపత్రిలోనే ఉండిపోవాల్సి వచ్చింది.

* అయోధ్యలో రామ మందిర భూమిపూజ కార్యక్రమాన్ని దేశమంతా ఆసక్తిగా తిలకించింది. ప్రధాని మోదీ పాల్గొన్న ఈ కార్యక్రమాన్ని చూసేందుకు ప్రజలు టీవీలకు అతుక్కపోయారు. ఈ నెల 5న జరిగిన ఈ కార్యక్రమాన్ని సుమారు 16 కోట్ల మందికి పైగా టీవీల ద్వారా వీక్షించినట్లు ప్రసార భారతి సీఈవో శశి ఎస్‌ వెంపటి తెలిపారు. ఈ మొత్తం కార్యక్రమం ద్వారా 700 కోట్ల నిమిషాల వ్యూయర్‌షిప్‌ లభించినట్లు పేర్కొన్నారు.

* తెలంగాణ మంత్రి మల్లారెడ్డి దంపతులకు కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వీడియో ద్వారా తెలిపారు. ప్రస్తుతం మంత్రి హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. వీడియోలో మల్లారెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుతం కరోనా నుంచి కోలుకున్నానని అన్నారు. ధైర్యంగా, జాగ్రత్తగా ఉంటే కరోనాను జయించవచ్చని చెప్పారు.