Editorials

భారత రక్షణశాఖలో చైనా గూఢచారి

భారత రక్షణశాఖలో చైనా గూఢచారి

లఢక్ సమీపంలోని వాస్తవాధీన రేఖ వద్ద చోటు చేసుకున్న పరిణామాలను కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా సొమ్ము చేసుకునే ప్రయత్నాలకు తెర తీసింది. కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే దిశగా తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది. వాస్తవాధీన రేఖ వద్ద సంభవించిన పరిణామాలపై కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజల కళ్లకు గంతలు కడుతోందని మండిపడుతోంది. వాస్తవాధీన రేఖ వద్ద వాస్తవాలను సమాధి చేయడానికి మోడీ ప్రభుత్వం కుట్ర పన్నిందంటూ ఆరోపిస్తోంది. రక్షణ మంత్రిత్వ శాఖలో చైనా ఏజెంట్ ఎవరో పని చేస్తున్నట్టు కనిపిస్తోందని కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీమంత్రి పీ చిదంబరం అనుమానాలను వ్యక్తం చేశారు. రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ లేదా ఇంకో అధికారిని గానీ తప్పించేలా పరిస్థితులు క్రమంగా నెలకొంటున్నాయని చెప్పారు. రాజ్‌నాథ్ సింగ్‌పై వేటు వేసినా ఆశ్చర్యపోనక్కర్లేదనే అర్థం వచ్చేలా చిదంబరం కామెంట్స్ చేశారు. దీనిపై కొద్దిసేపటి కిందట ఆయన వరుసగా ట్వీట్లను సంధించారు. తన అనుమానాలను వ్యక్తీకరించారు. భారత భూభాగాన్ని ఎవరూ ఆక్రమించలేదంటూ ఇదివరకు ప్రధానమంత్రి చేసిన ప్రకటనను కూడా తప్పు పట్టేలా ఉందని చిదంబరం చెప్పారు.