Sports

భారత హాకీ జట్టులో కరోనా కలకలం

భారత పురుషుల హాకీ జట్టు కెప్టెన్‌ మన్‌ప్రీత్‌ సింగ్‌కు కరోనా సోకింది. అతని సహచర ఆటగాళ్లు సురేందర్‌ కుమార్‌, జస్కరన్‌ సింగ్‌, వరుణ్‌ కుమార్‌, కిషన్‌బహుదూర్‌లూ వైరస్‌ బారిన పడ్డారు. జాతీయ శిక్షణ శిబిరం కోసం నెల రోజుల విరామం తర్వాత బెంగళూరులోని సాయ్‌ దక్షిణ కేంద్రానికి వస్తున్న ఆటగాళ్లకు వైరస్‌ నిర్ధరణ పరీక్షలు నిర్వహించగా ఈ ఐదుగురు పాజిటివ్‌గా తేలారు. అంతకుముందు లాక్‌డౌన్‌ కారణంగా దాదాపు రెండున్నర నెలలు (జూన్‌ వరకు) సాయ్‌ కేంద్రంలోనే ఉన్న ఆటగాళ్లు ఆ తర్వాత ఇళ్లకు వెళ్లారు. తిరిగి కేంద్రానికి వచ్చే ఆటగాళ్లకు పరీక్షలు చేసి, వాళ్లను క్వారంటైన్‌లో పెడుతున్నారు. ‘‘సాయ్‌ క్యాంపస్‌లో స్వీయ క్వారంటైన్‌లో ఉన్నా. నేను బాగానే ఉన్నా. త్వరలోనే కోలుకుంటానని ఆశిస్తున్నా. ఆటగాళ్లందరికీ కచ్చితంగా పరీక్షలు నిర్వహిస్తుండడం పట్ల సంతోషంగా ఉంది’’ అని మన్‌ప్రీత్‌ తెలిపాడు. మొదట నిర్వహించిన ర్యాపిడ్‌ పరీక్షల్లో ఈ ఐదుగురికి నెగెటివ్‌గానే వచ్చింది. కానీ ఆ తర్వాత మన్‌ప్రీత్‌, సురేందర్‌లో వైరస్‌ లక్షణాలు కన్పించడంతో వాళ్లతో పాటు మరో 10మంది ఆటగాళ్లకు ఆర్టీ-పీసీఆర్‌ పరీక్షలు చేశారు. మిగతా ఆటగాళ్ల ఫలితాల కోసం ఎదురుచూస్తున్నట్లు సాయ్‌ పేర్కొంది.