Food

నల్లగొండ చుడువా తిన్నావా?

నల్లగొండ చుడువా తిన్నావా?

నల్లగొండకు వెళ్లారా ఎప్పుడైనా? ఈసారి వెళ్లినప్పుడు చుడువా తినండి. పూజ అయిపోయాక ప్రసాదం తింటే ఎంత సంతృప్తిగా ఉంటుందో ఈ చుడువా తింటే అంత బాగుంటుంది. అదే కోటయ్య చుడువా. నల్లగొండ రోడ్డు.. రామగిరి డౌన్‌లో కోటయ్య చుడువా చాలా ఫేమస్‌. పేరుకు చిరుతిండే అయినా లొట్ట లేసుకొని తినాలనిపిస్తుంది. అక్కడి శివశంకర్‌ స్వీట్‌హౌజ్‌లో ఈ చుడువా దొరుకుతుంది. దీనిని కోటయ్య అనే వ్యక్తి తయారుచేస్తాడు కాబట్టి ‘కోటయ్య చుడువా’గా ఫేమస్‌ అయ్యింది. కోటయ్యది నల్లగొండ. ఏడవ తరగతి వరకు చదువుకున్న కోటయ్య అంతటితో గుడ్‌బై చెప్పి, బాబాయి దగ్గర పని నేర్చుకున్నాడు. సొంతంగా బండి పెట్టుకొని చుడువా తయారుచేయడం ప్రారంభించాడు. రుచికరంగా, నాణ్యతతో ఉండటంతో జనాలు ఆదరిస్తున్నారు. ఇక్కడ రకరకాల తినుబండారాలు దొరికినా చుడువా చాలా చాలా ఫేమస్‌. సాయంత్రం అయ్యిందంటే చాలు చిన్నా పెద్దా తేడా లేకుండా లైన్లు కడతారు. ఏదైనా పండుగ వస్తే కోటయ్య చుడువాకు భారీగా ఆర్డర్‌ ఇవ్వాల్సిందే. కోటయ్య చేసే మరో రుచికరమైన తినుబండారం జిలేబీ. బెల్లం జిలేబీ కోటయ్య మరో ప్రత్యేకత.