DailyDose

జగన్ మాకు మంచి మిత్రుడు-తాజావార్తలు

జగన్ మాకు మంచి మిత్రుడు-తాజావార్తలు

* రాష్ట్రానికి భారీ పెట్టుబడులు రానున్నాయని, త్వరలోనే దీనిపై ప్రకటనలు ఉంటాయని తెలంగాణ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. ట్విటర్‌ వేదికగా ‘ASK KTR‌’ సెషన్‌లో మంత్రి కేటీఆర్‌ పాల్గొన్నారు. కృష్ణా జలాల్లో రాష్ట్ర హక్కుల కోసం పూర్తి స్థాయిలో పోరాడతామన్నారు. ఇప్పటికే సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశామని చెప్పారు. వైద్య రంగంలో మరిన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. కరోనా మహమ్మారి ఆ అవసరాన్ని స్పష్టంగా గుర్తు చేసిందని పేర్కొన్నారు. ఏపీ సీఎం జగన్‌తో తమకు మంచి సంబంధాలు ఉన్నాయని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు.

* దేశంలో ‘వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి’ కింది లక్ష కోట్లతో ప్రత్యేక నిధికి కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. దీన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించారు. ఈనిధి ద్వారా పంట ఉత్పత్తుల నిల్వ కోసం శీతల గిడ్డంగులు, పంట సేకరణ కేంద్రాలు ఏర్పాటు వంటి సదుపాయాలు ఏర్పాటు చేసేందుకు కేంద్రప్రభుత్వం నిధులను మంజూరు చేస్తుంది. దీనిలో భాగంగా ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్ల ఏర్పాటుకు కూడా ఆర్థిక సాయం అందించనుంది.

* విజయవాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రి కొవిడ్‌ కేర్‌ సెంటర్‌లో చోటుచేసుకున్న ఘోర అగ్ని ప్రమాద ఘటనలో 10 మంది మృతి చెందారని మంత్రి ఆళ్లనాని వెల్లడించారు. ‘ఈ ప్రమాదంపై కమిటీ వేశాం. ఆస్పత్రికి సంబంధించి అన్ని అనుమతులు ఉన్నాయా లేదో ఈ కమిటీ పరిశీలిస్తుంది. ప్రమాదానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. 48 గంటల్లో పూర్తిస్థాయి నివేదికలు ఇవ్వాలని ఆదేశించాం. నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తేలితే అత్యంత కఠిన చర్యలు ఉంటాయి. నివేదికలు రాగానే చర్యలు తీసుకుంటాం’ అని మంత్రి ఆళ్లనాని తెలిపారు.

* కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు తాజాగా నిర్వహించిన కరోనా పరీక్షల్లో నెగిటివ్‌ వచ్చిన వార్తను హోంశాఖ వర్గాలు తోసిపుచ్చాయి. ఆయనకు ఎలాంటి కరోనా పరీక్షలూ నిర్వహించలేదని ఆ శాఖకు చెందిన అధికారి తెలిపారు. ఒకవేళ పరీక్షలు నిర్వహించినట్లయితే తామే ఆ వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. ఆయన ఆరోగ్యానికి సంబంధించి ఎలాంటి అసత్యాలూ ప్రచారం చేయొద్దని సూచించారు.

* భారత్‌లో కరోనా వైరస్‌ ఉగ్రరూపం దాలుస్తోంది. దేశంలో కొద్దిరోజులుగా ప్రతిరోజు 50 వేలకు పైగానే కేసులు నమోదవుతున్నాయి. దేశవ్యాప్తంగా ఇప్పటికే 21.5 లక్షల మంది వైరస్‌ బారిన పడగా, కేవలం ఈ ఒక్క వారంలోనే 3.5 లక్షల మందికి మహమ్మారి సోకింది. 5,244 మంది మృతిచెందినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఆరోగ్య శాఖ డ్యాష్‌బోర్డు వివరాల ప్రకారం.. దేశంలో నేటివరకు 21,53,010 మందికి వ్యాధి సోకింది. శనివారం నుంచి ఆదివారం ఉదయం వరకు దేశవ్యాప్తంగా 64,399 మంది వైరస్‌ బారిన పడ్డారు.

* దేశంలో 101 రక్షణ వస్తువుల దిగుమతులపై నిషేధం విధిస్తున్నట్లు కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ప్రకటించారు. ‘ఆత్మనిర్భర్‌ భారత్’‌కు ఊతమివ్వడంలో భాగంగా భారత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఇక నుంచి ఆయుధ సంపత్తి సహా రక్షణశాఖ ఉత్పత్తులను దేశీయంగానే తయారు చేసేందుకు కృషి చేస్తామన్నారు. రానున్న నాలుగు సంవత్సరాల(2020- 2024)కాలంలో ఈ రక్షణ రంగ వస్తువుల దిగుమతులపై ఆంక్షలు ఉండనున్నట్లు ఆయన తెలిపారు.

* విజయవాడలోని ప్రైవేటు ఆస్పత్రి కొవిడ్‌ సెంటర్లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో మృతదేహాలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పది మృతదేహాల వివరాలను బంధువులు, అధికారులు గుర్తించారు. విజయవాడ అగ్ని ప్రమాద ఘటనపై గవర్నర్‌పేట పోలీసులు కేసు నమోదు చేశారు. ఆసుపత్రి, హోటల్‌ యాజమాన్యాలపై విజయవాడ సెంట్రల్‌ తహసీల్దార్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.

* రాజస్థాన్‌ అసెంబ్లీ సమావేశాలకు సమయం దగ్గర పడుతున్న వేళ ఉత్కంఠ నెలకొంది. ఏ పార్టీకి ఆ పార్టీ తమ తమ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు రిసార్టు రాజకీయాలు మొదలు పెట్టాయి. ఈ నేపథ్యంలో ‘సత్యంవైపు నిలవండి.. ప్రజాస్వామ్యాన్ని కాపాడండి’ అంటూ సీఎం అశోక్ గహ్లోత్‌ లేఖాస్త్రం సంధించారు. కాంగ్రెస్‌ సహా రాష్ట్రంలో అందరు ఎమ్మెల్యేలకు లేఖలు రాశారు.

* టాలీవుడ్‌ ప్రిన్స్‌ మహేశ్‌ ‌బాబు నేడు 45వ వసంతంలోకి అడుగుపెట్టాడు. ఆయన జన్మదినం సందర్భంగా సామాజిక మాధ్యమాల్లో పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. అటు అభిమానులే కాకుండా ఇటు సెలబ్రిటీలు సైతం ‘బిజినెస్‌మేన్‌’కు శుభాకాంక్షలు చెప్పారు. దాంతో ట్విటర్‌లో #HBDMaheshBabu హ్యాష్‌ట్యాగ్‌ ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. ఆస్ట్రేలియా క్రికెట్‌ జట్టు ప్రముఖ బ్యాట్స్‌మన్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఆటగాడు డేవిడ్‌ వార్నర్‌ కూడా మహేశ్‌కు తనదైన శైలిలో శుభాకాంక్షలు చెప్పాడు.

* ఒకే కుటుంబంలోని 11మంది సామూహిక ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన రాజస్థాన్‌లో చోటుచేసుకుంది. జోధ్‌పూర్‌లో నివాసం ఉంటున్న ఓ కుటుంబంలోని 12మంది విషం తాగి ఆత్మహత్య చేసుకున్నారు. వీరిలో 11మంది మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు జోధ్‌పుర్‌ పోలీసులు వెల్లడించారు. రాజస్థాన్‌లోని దేచు పోలీస్‌స్టేషన్ పరిధిలోని తోహ్‌దాత గ్రామంలో విషాద ఘటన వెలుగులోకి వచ్చింది.