DailyDose

టాటా మోటార్స్ నూతన ఉత్పత్తులు-వాణిజ్యం

టాటా మోటార్స్ నూతన ఉత్పత్తులు-వాణిజ్యం

* డిజిటల్‌ పద్ధతిలో అందిస్తున్న సేవలపై వినియోగదార్లలో అవగాహన కల్పించేందుకు ప్రభుత్వ రంగ సంస్థ అయిన భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (బీపీసీఎల్‌) ‘గో డిజిటల్‌’ పేరుతో పెద్దఎత్తున ప్రచార కార్యక్రమాన్ని చేపట్టింది. వాట్సాప్‌, భారత్‌ గ్యాస్‌ యాప్‌, వెబ్‌సైట్‌ ద్వారా వంటగ్యాస్‌ బుక్‌ చేసి నగదు చెల్లించే సదుపాయంతో పాటు ‘మిస్స్‌డ్‌ కాల్‌’ బుకింగ్‌ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు ఈ సందర్భంగా బీపీసీఎల్‌ పేర్కొంది. మిస్స్‌డ్‌ కాల్‌ బుకింగ్‌ సదుపాయం గ్రామీణ ప్రాంత ప్రజలకు ఎంతో ఉపయోగంగా ఉంటుందని వివరించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో భారత్‌ గ్యాస్‌ ఎల్‌పీజీ వినియోగదార్లు 52 లక్షల మంది కంటే అధికంగా ఉన్నారు. ఈ సంస్థ ప్రతి రోజూ 40,000 కు పైగా గ్యాస్‌ సిలిండర్లు పంపిణీ చేస్తోంది. ప్రస్తుతం ‘కరోనా’ మహమ్మారి వల్ల ఎదురైన సవాళ్లతో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు ఎదురుకాకుండా డిజిటల్‌ పద్ధతుల్లో బుకింగ్‌ సదుపాయం కల్పించటంతో పాటు, ఇళ్లకే సిలిండర్‌ పంపిణీ చేస్తున్నట్లు బీపీసీఎల్‌ పేర్కొంది.

* టాటా మోటార్స్‌ తన వినియోగదారుల కోసం ఆరోగ్య సంరక్షణ, పరిశుభ్రతకు సంబంధించి పలు రకాల ఉత్పత్తులను విడుదల చేసింది. అన్ని వేళలా వినియోగదారుల భద్రతకు భరోసా కల్పించడమే ప్రస్తుతం తమ తక్షణ ప్రాధాన్యమని టాటా మోటార్స్‌ తెలిపింది. కారు యజమానులకు అదనపు భద్రతను అందించే ఉద్దేశంతో ఈ ఉత్పత్తులను రూపొందించామని పేర్కొంది. అత్యంత నాణ్యతతో కూడిన ఈ ఉత్పత్తులు దేశవ్యాప్తంగా ఉన్న తమ విక్రయ కేంద్రాలన్నింటిలో లభ్యమవుతాయని పేర్కొంది. ఎయిర్‌ ఫ్యూరిఫైయర్‌, ఎయిర్‌ ఫిల్టర్‌, శానిటైజేషన్‌ కిట్స్‌ లాంటివి ఈ ఉత్పత్తుల్లో ఉన్నాయి. టాటా కార్లన్నింటికీ కప్‌ హోల్డర్‌ ప్రాంతాల్లో ఈ వాయు శుద్ధి ఉత్పత్తులను అమర్చుకోవచ్చు. ఎయిర్‌ ఫ్లిల్టర్‌ను ప్రస్తుతానికి నెక్సాన్‌, హారియర్‌ మోడళ్ల కార్లకు మాత్రమే అమర్చుకునే వీలుంది. ఇక శానిటైజేషన్‌ కిట్‌ ఉత్పత్తుల్లో చేతిని శుభ్రం చేసుకునే శానిటైజర్‌, ఎన్‌95 మాస్క్‌లు, చేతికి తొడుక్కునే గ్లోవ్స్‌, సేఫ్టీ టచ్‌ కీ, టిష్యూ బాక్స్‌, మిస్ట్‌ డిఫ్యూజర్‌ లాంటివి ఉన్నాయి.

* కొవిడ్‌-19 విజృంభిస్తున్న సమయంలోనూ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) రూపంలో దేశంలోకి 22 బిలియన్‌ డాలర్లు వచ్చాయని నీతి ఆయోగ్‌ సీఈఓ అమితాబ్‌ కాంత్‌ తెలిపారు. మనదేశ ఎఫ్‌డీఐ విధానం ఎంత సరళంగా ఉందనడానికి ఇదే నిదర్శనమని అన్నారు. 22 బిలియన్‌ డాలర్ల ఎఫ్‌డీఐలో దాదాపు 90 శాతం వరకు ఆటోమేటిక్‌ మార్గంలో వచ్చినవేనని చెప్పారు. ‘ప్రపంచంలోని అత్యంత సరళవంతమైన ఎఫ్‌డీఐ విధానం భారత్‌దే. విదేశీ పెట్టుబడులను ఆకర్షించడాన్ని మేం కొనసాగించాం. కరోనా మహమ్మారి వ్యాప్తి సమయంలోనూ 22 బిలియన్‌ డాలర్లకు పైగా ప్రత్యక్ష పెట్టుబడులు భారత్‌లోకి తరలివచ్చాయ’ని వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సీఐఐ నిర్వహించిన ఓ సమావేశంలో అన్నారు.

* ఏప్రిల్‌- జూన్‌ త్రైమాసికానికి డీసీబీ నికర లాభం 2.5 శాతం తగ్గి రూ.79 కోట్లుగా నమోదైంది. ఏడాదిక్రితం ఇదే సమయంలో రూ.81 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. మొత్తం ఆదాయం కూడా 2 శాతం తగ్గి రూ.392 కోట్ల నుంచి రూ.384 కోట్లకు పరిమితమైంది. అయితే వడ్డీ ఆదాయం 1 శాతం పెరిగి రూ.307 కోట్లకు చేరింది. సమీక్షా త్రైమాసికంలో డీసీబీ బ్యాంక్‌ మొత్తంగా రూ.85 కోట్లు కేటాయింపులు చేసింది. ఇందులో రూ.32 కోట్లు కొవిడ్‌-19 సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొనేందుకు కాగా.. రూ.13 కోట్లు మొండి బకాయిల కోసం కేటాయించింది. స్థూల నిరర్థక ఆస్తులు 1.96 శాతం నుంచి 2.44 శాతానికి పెరిగాయి. నికర నిరర్థక ఆస్తులు కూడా 0.81 శాతం నుంచి పెరిగి 0.99 శాతానికి చేరాయి. 2020 ఆగస్టు 31తో మారటోరియం కాలపరిమితి ముగిశాక నికర నిరర్థక ఆస్తులు పెరిగే అవకాశం ఉందని డీసీబీ బ్యాంక్‌ వెల్లడించింది.

* ప్రముఖ సోషల్‌ మీడియా దిగ్గజం ట్విటర్‌ ఒక భారీ విలీనానికి తెరలేపింది. చైనాలోని బైట్‌డ్యాన్స్‌కు చెందిన ‘టిక్‌టాక్‌’ను ట్విటర్‌లో విలీనం చేసుకొనే అంశంపై చర్చలు జరుగుతున్నట్లు ప్రముఖ ఆంగ్లవార్తా సంస్థ బ్లూమ్‌బెర్గ్‌ తన కథనంలో పేర్కొంది. ఇది కేవలం టిక్‌టాక్‌ అమెరికా కార్యకలపాలకు సంబంధించే ఉంటుందా మరేదైనా అనే విషయం మాత్రం బయటకు రాలేదు.

* హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న ఔషధాల కంపెనీ దివీస్‌ లేబొరేటరీస్‌ లిమిటెడ్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి అత్యంత ఆకర్షణీయమైన ఫలితాలు నమోదు చేసింది. కన్సాలిడేటెడ్‌ ఖాతాల ప్రకారం త్రైమాసిక ఆదాయం రూ.1,748 కోట్లు కాగా, దీనిపై రూ.492 కోట్ల నికరలాభం నమోదైంది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదేకాలంలో ఆదాయం రూ.1,193 కోట్లు, నికరలాభం రూ.272 కోట్లుగా నమోదైంది. దీంతో పోల్చితే ఈ మొదటి త్రైమాసికంలో ఆదాయం 47 శాతం పెరిగింది. నికరలాభం రెట్టింపునకు దగ్గరగా ఉండటం ప్రత్యేకత.