DailyDose

తొషిబా టాటా-వాణిజ్యం

తొషిబా టాటా-వాణిజ్యం

* జపాన్‌కు చెందిన టెక్‌దిగ్గజం తొషిబా ల్యాప్‌టాప్‌ల వ్యాపారం నుంచి వైదొలగాలని నిర్ణయించుకొంది. కంపెనీ తన డైనాబుక్‌ ల్యాప్‌టాప్‌ బ్రాండ్‌లో 19.9శాతం వాటాను షార్ప్‌కు విక్రయించింది. దీంతో ఈ వ్యాపారం నుంచి వైదొలగినట్లైంది. గతంలో 80.1శాతం వాటాను షార్ప్‌కు విక్రయించింది. దీనిపై కంపెనీ ప్రకటన చేసింది. ‘‘డైనాబుక్‌లోని మిగిలిన 19.9శాతం వాటాను కూడా షాపర్‌ కార్పొరేషన్‌కు బదలాయించాము. దీంతో అధికారికంగా డైనాబుక్‌ ఇప్పుడు షార్ప్‌నకు అనుంబంధ సంస్థగా మారింది’’ అని ఒక ప్రకటన విడుదల చేసింది. 1990 నుంచి 2000 వరకు తొషిబా ల్యాప్‌టాప్‌ల తయారీలో టాప్‌ కంపెనీల్లో ఉండేది. ఆ కంపెనీ తయారు చేసిన శాటిలైట్‌ ల్యాప్‌టాప్‌లు భారీ విజయం సాధించాయి. కానీ, తర్వాత లెనోవా, హెచ్‌పీ, డెల్‌ కంపెనీలు రంగప్రవేశం చేయడంతో తొషిబా పోటీని ఎదుర్కొంది.

* వచ్చే ఏడాది నాటికి దాదాపు అన్ని దేశాల్లో కరోనా వైరస్‌ ప్రభావం తగ్గుముఖం పడుతుందని మైక్రోసాఫ్ట్‌ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఆశాభావం వ్యక్తం చేశారు. కరోనా వైరస్‌కు వ్యాక్సిన్‌ త్వరలోనే అందరికీ అందుబాటులోకి వస్తుందని, 2022 కల్లా వైరస్‌ ప్రభావం పూర్తిగా తొలగిపోతుందని ఆయన వైర్డ్‌ అనే వార్తా సంస్థకు ఇచ్చిన ముఖాముఖిలో పేర్కొన్నారు. ‘‘కరోనా మహమ్మారి కారణంగా ఏర్పడిన ఆర్థిక నష్టం నుంచి ఇప్పట్లో తిరిగి కోలుకునే పరిస్థితులు లేవన్నది వాస్తవం. వైరస్‌పై పోరులో భాగంగా కొత్త ఉత్పత్తుల ఆవిష్కరణ, నూతన చికిత్సా విధానం, వ్యాక్సిన్‌ తయారీ, పరిశోధనలు వంటి అంశాల్లో కీలక అడుగులు పడుతున్నాయి. వీటి వల్లనే మనం ధనిక ప్రపంచంలో ఉన్నామనే భావన నాకు కలుగుతుంది. 2021 నాటికి మహమ్మారి ప్రభావం తగ్గించగలిగితే, 2022 చివరికి ప్రపంచం నుంచి పూర్తిస్థాయిలో వైరస్ తొలగిపోతుంది’’ అని అన్నారు.

* ప్రముఖ ఐటీ రంగ సంస్థ ‘పర్సిస్టెంట్‌ సిస్టమ్స్‌’ సీఈవో క్రిస్టఫర్‌ రాబర్ట్‌ ఓకానర్‌ తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా తక్షణమే అమల్లోకి వస్తుందని ఆయన వెల్లడించినట్లు కంపెనీ రెగ్యులేటరీలకు తెలిపింది. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. వాటిని రాజీనామా లేఖలో వెల్లడించలేదు. ‘రాజీనామా లేఖను బోర్డు పరిశీలించి ఆమోదించింది. క్రిస్‌ కంపెనీకి చేసిన సేవలకు కృతజ్ఞతలు. ఆయన భవిష్యత్తు మరింత బాగుండాలని కోరుకొంటున్నాం’ అని కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది. 2019లో ఓకానర్‌ ఐబీఎం నుంచి పర్సిస్టెంట్‌లో చేరారు. ఐబీఎంలో ఆయన ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ విభాగానికి నాయకత్వం వహించారు.

* ప్రతి 6 నెలలకో కొత్త మోడల్‌ ఆవిష్కరిస్తామని ప్రకటించిన కియా మోటార్స్‌కు, కొవిడ్‌ సంక్షోభం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. భవిష్యత్తులో కొత్త మోడళ్ల ఆవిష్కరణ కొద్దిగా ఆలస్యం అయ్యే అవకాశముందని కియా మోటార్స్‌ ఇండియా వైస్‌ ప్రెసిడెంట్‌ మనోహర్‌ భట్‌ తెలిపారు. ముందుగా ప్రకటించినట్లే మూడో మోడల్‌ సొనెట్‌ను త్వరలో ఆవిష్కరించబోతున్నామని, తదుపరి మోడళ్లను మాత్రం పరిస్థితులను అనుసరించి, అందుబాటులోకి తెస్తామని పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితులు తాత్కాలికమేనని భారత్‌లో మధ్య, దీర్ఘకాలానికి కార్ల అమ్మకాలకు భారీ అవకాశాలుంటాయని వివరించారు. పరిశ్రమ సగటు కంటే తాము మరింతగా రాణిస్తామనే విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు

* కొవిడ్‌-19 సంక్షోభం వల్ల ఆర్థిక రికవరీపై దాదాపు 45 శాతం భారతీయులు అనిశ్చితితో ఉన్నారని స్క్రిప్‌బాక్స్‌ సర్వే పేర్కొంది. కనీసం ఏడాది పాటు తక్కువ వృద్ధి ఉంటుందని, ఇది వ్యక్తిగత ఆర్థిక అంశాలను పూర్తిగా మార్చేసిందని తెలిపింది. డిజిటల్‌ వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ సేవలు అందించే స్క్రిప్‌బాక్స్‌ జులైలో ఈ సర్వే చేసింది. ఆర్థిక ఇబ్బందులను బయటపడేందుకు ఎంత సన్నద్ధంగా ఉన్నారో తెలుసుకునేందుకు సంస్థ ఈ సర్వే చేయగా, 1400 మంది భారతీయులు ఇందులో పాల్గొన్నారు. ఇందులో 83 శాతం పురుషులు, 17 శాతం మంది మహిళలు ఉన్నారు. స్క్రిప్‌బాక్స్‌ ఫైనాన్షియల్‌ ఫ్రీడం సర్వే ప్రకారం..వృథా వ్యయాలను తగ్గించుకున్నామని, అత్యవసర ఖర్చులకు పొదుపు చేస్తున్నట్లు 50 శాతం మంది వెల్లడించారు. 28 శాతం మంది అత్యవసరం కాని వస్తువులపై కోత వేయగా, అత్యవసర నిధి ఏర్పాటు చేసుకుంటున్నామని 22 శాతం మంది, ఈఎంఐ భారాన్ని తగ్గించుకుంటామని 10 శాతం మంది పేర్కొన్నారు.

* మౌలిక రంగ సంస్థలకు అవసరమైన రుణాల కోసం క్రెడిట్‌ గ్యారెంటీ ఎన్‌హ్యాన్స్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. త్వరలోనే ఈ ప్రతిపాదన కేంద్ర మంత్రిమండలి పరిశీలనకు రానుంది. వచ్చే అయిదేళ్లలో మౌలిక రంగంలో వసతుల అభివృద్ధికి దాదాపు రూ.111 లక్షల కోట్ల పెట్టుబడులు అవసరమని ప్రభుత్వం అంచనా వేస్తోంది. దీనికి అవసరమైన నిధుల సమీకరణకు ఈ సంస్థను ఏర్పాటు చేయనున్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. క్రెడిట్‌ గ్యారెంటీ ఎన్‌హ్యాన్స్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు చేయనున్నట్లు 2019-20 బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. ఐఐఎఫ్‌సీఎల్‌, ఎల్‌ఐసీ, పీఎఫ్‌సీ, ఆర్‌ఈసీ, ఇటువంటి తరహా కంపెనీలతో భాగస్వామ్యంలో క్రెడిట్‌ గ్యారెంటీ ఎన్‌హ్యాన్స్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఒక బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్‌బీఎఫ్‌సీ)గా ఏర్పాటు కానుంది.

* దేశీయ స్టాక్‌ మార్కెట్లు సోమవారం లాభాల్లో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఉదయం 9.34 సమయంలో సెన్సెక్స్‌ 330 పాయింట్లు లాభపడి 38,371 వద్ద, నిఫ్టీ 100 పాయింట్లు లాభపడి 11,314 వద్ద ట్రేడవుతున్నాయి. ఇమామీ, దివీస్‌ ల్యాబ్‌, రిలయన్స్‌ పవర్‌, భారత్‌ ఎలక్ట్రానిక్స్‌, హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ భారీ లాభాల్లో ఉండగా.. కంటైనర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా, బిర్లా కార్పొరేషన్‌, హాత్‌వే కేబుల్స్‌, సుదర్శన్‌ కెమ్, హింద్‌ జింక్‌ షేర్లు నష్టాల్లో ఉన్నాయి. అన్ని రంగాలకు చెందిన ప్రధాన సూచీలు కూడా సానుకూలంగానే ట్రేడవుతున్నాయి.