Politics

వంతెన ప్రారంభించిన కేటీఆర్

వంతెన ప్రారంభించిన కేటీఆర్

మహానగరంలో ట్రాఫిక్‌ కష్టాలు తీర్చేందుకు మరో పైవంతెన అందుబాటులోకి వచ్చింది. బైరామల్‌గూడ చౌరస్తా వద్ద పైవంతెనను రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. బైరామల్‌గూడ చౌరస్తా వద్ద కుడివైపు పైవంతెనను ఎస్‌ఆర్‌డీపీ ప్యాకేజీ-2లో భాగంగా రూ.26.45 కోట్లతో నిర్మించారు. దీంతో బైరామల్‌గూడ జంక్షన్‌, సాగర్‌ రింగ్‌రోడ్‌ జంక్షన్‌లో ట్రాఫిక్‌ ఇబ్బందులు తీరనున్నాయి. ఈ కార్యక్రమంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌, పలువురు అధికారులు పాల్గొన్నారు. ఈ వంతెనకు సంబంధించి ఓ ప్రత్యేకత ఉంది. దేశంలోనే మొదటిసారి స్లాబ్స్‌, క్రాష్‌ బారియర్స్‌, ఫిక్షన్‌ స్లాబుల నిర్మాణంలో ఆర్‌సీసీ ఫ్రీకాస్ట్‌ టెక్నాలజీ వాడినట్లు మేయర్‌ రామ్మోహన్‌ తెలిపారు. రూ.448 కోట్లతో ప్యాకేజీ-2లో భాగంగా ఎల్‌బీనగర్‌, బైరామల్‌గూడ, నాగోల్‌ కామినేని చౌరస్తా, చింతల్‌కుంటలో వంతెనలు, అండర్‌పాస్‌ల నిర్మాణం మొదలైంది. ఇప్పటికే కామినేని చౌరస్తా వద్ద కుడి, ఎడమ వంతెనలు అందుబాటులోకి వచ్చాయి. దిల్‌సుఖ్‌నగర్‌ నుంచి హయతనగర్‌ వైపు వెళ్లేందుకు ఎల్‌బీనగర్‌ చౌరస్తాలో వంతెనతోపాటు చింతల్‌కుంటలో అండర్‌పాస్‌లలోనూ రాకపోకలు సాగుతున్నాయి. ఇప్పుడు బైరామల్‌గూడ చౌరస్తాలో ఎల్‌బీనగర్‌ నుంచి ఒవైసీ ఆసుపత్రి వైపు వెళ్లే మార్గంలో వంతెన అందుబాటులోకి వచ్చింది.

వంతెన పొడవు : 780 మీటర్లు
కుడివంతెన నిర్మాణ వ్యయం : రూ.26.45 కోట్లు
వంతెన వెడల్పు : 12 మీటర్లు (ఆరు వరసలు)