DailyDose

జనసేన ఓ గాలివాటం పార్టీ-తాజావార్తలు

జనసేన ఓ గాలివాటం పార్టీ-తాజావార్తలు

* మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీకి సోమవారం బ్రెయిన్‌ సర్జరీ జరిగింది. మెదడులో ఒకచోట రక్తం గడ్డకట్టడంతో ఆపరేషన్‌ చేసి దాన్ని తొలగించారు. అనారోగ్యానికి గురైన 84 ఏళ్ల ప్రణబ్‌ డాక్టర్ల సూచన మేరకు సోమవారం న్యూఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్‌ అండ్‌ రిఫరల్‌ ఆస్పత్రిలో చేరారు. శస్త్ర చికిత్స నిర్వహించే ముందు చేసిన పరీక్షల్లో ఆయనకు కరోనా సోకినట్లు తేలింది. ‘ప్రణబ్‌కు బ్రెయిన్‌ క్లాట్‌ను తొలగించేందుకు శస్త్రచికిత్స జరిగింది. ఆయన పరిస్థితి కాస్త ఆందోళనకరంగా ఉంది. వెంటిలేటర్‌పై ఉన్నారు’అని విశ్వసనీయవర్గాలు వెల్లడించాయి. కీలక అవయవాల పనితీరు నిలకడగా ఉందని, నిపుణులైన వైద్య బృందం ఆయన్ను నిరంతరం పర్యవేక్షిస్తోందని తెలిపాయి.  

* జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌ సొంత పార్టీపైనే తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాను గెలిచిన జనసేన పార్టీ బలపడేది కాదన్నారు. ఏదో గాలివాటంగా తాను ఒక్కడినే గెలిచానని వ్యాఖ్యానించారు. గత కొన్నాళ్లుగా రాపాక వరప్రసాద్‌ వైకాపా ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను స్వాగతిస్తూ.. వారికి మద్దతుగా నిలుస్తున్నారు. దీంతో జనసేన అధిష్ఠానం రాపాకపై అసంతృప్తితో ఉంది. ఈ నేపథ్యంలో రాపాక వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. ‘‘గత ఎన్నికల్లో వైకాపా నుంచి టిక్కెట్‌ కోసం ప్రయత్నించా. ఈ మేరకు జగన్‌, సుబ్బారెడ్డితోనూ మాట్లాడా. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో వేరేవాళ్లకు టిక్కెట్‌ ఇచ్చారు. జనసేన నుంచి నేను సొంత బలంతో ఎమ్మెల్యేగా గెలిచా. అసెంబ్లీకి వెళ్లగానే సీఎం జగన్‌ను కలిశా. సీఎంతో కలిసి వైకాపాలోనే పనిచేస్తున్నా. ప్రస్తుతం రాజోలు నియోజకవర్గ వైకాపాలో మూడు వర్గాలు ఉన్నాయి. వర్గాలు పార్టీకి మంచివి కావు. వర్గాలు పోవాలంటే సీఎం ఒక నిర్ణయం తీసుకోవాలి’’అని రాపాక తెలిపారు.

* హిందూ అవిభక్త కుటుంబానికి చెందిన ఆస్తిపై ఆడపిల్లలకు ఉన్న హక్కును గురించి భారతదేశ సర్వోన్నత న్యాయస్థానం నేడు చారిత్రక తీర్పు వెలువరించింది. తండ్రి (లేదా తల్లి) 2005 కంటే ముందే మరణించినా కుమార్తెలకు వారసత్వంగా ఆస్తిని పొందే హక్కు ఉంటుందని.. జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం నేటి తీర్పులో స్పష్టం చేసింది.

* రాష్ట్రంలోని యువతకు సెల్‌ఫోన్లు అందించనున్నట్లు పంజాబ్‌ ప్రభుత్వం ప్రకటించింది. ఓ పథకాన్ని ప్రవేశపెట్టి దాని ద్వారా యువతకు మొబైల్‌ ఫోన్లు అందిచనున్నట్లు మంగళవారం పేర్కొంది. ‘కరోనా గడ్డు కాలంలో ఆన్‌లైన్‌ క్లాసులకు హాజరు కాలేక అనేక మంది విద్యార్థులు బాధలు పడుతున్నారు. ప్రభుత్వం అందించబోతున్న సెల్‌ఫోన్లు వారికి ఎంతగానో ఉపయోగపడనున్నాయి’ అని ముఖ్యమంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ ఫోన్ల ద్వారా వారి విద్యకు ఉపయోగపడే సమాచారాన్ని ఆన్‌లైన్‌లో సులువుగా పొందవచ్చని తెలిపింది. పాఠశాల విద్యాశాఖ పోస్టు చేసిన సమాచారాన్ని సైతం సెల్‌ఫోన్ల ద్వారా సులువుగా పొందవచ్చు అని పేర్కొంది. మొదటి విడతలో 1.75 లక్షల మొబైల్‌ ఫోన్లను అమరిందర్‌సింగ్‌ ప్రభుత్వం పంపిణీ చేయనుంది. 2017లో అధికారంలోకి వచ్చేముందు రాష్ట్రంలోని యువతకు సెల్‌ఫోన్లు అందిస్తామని కాంగ్రెస్‌ హామీఇచ్చింది.

* జమ్ముకశ్మీర్‌లోని రెండు జిల్లాల్లో ఆగస్టు 15 తరవాత నుంచి 4జీ సేవలకు అనుమతిస్తామని కేంద్రం మంగళవారం సుప్రీంకోర్టుకు వెల్లడించింది. అంతర్జాతీయ సరిహద్దు, నియంత్రణ రేఖకు దగ్గర్లో ఉన్న ప్రాంతాల్లో ఈ సడలింపునకు అనుమతి ఉండదని, ఉగ్రవాద కార్యకలాపాల తీవ్రత తక్కువగా ఉన్న ప్రాంతాలకు మాత్రమే ఈ వెసులుబాటు ఉంటుందని తెలిపింది. రెండు నెలల తరవాత ప్రభుత్వం పరిస్థితిని సమీక్షిస్తుందని పేర్కొంది. జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక హోదాను కట్టబెట్టే రాజ్యాంగ అధికరణ 370ని రద్దు చేయడంతో పాటు, జమ్ముకశ్మీర్ రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విడదీస్తూ చేసిన చట్టం కారణంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు తావివ్వకూడదని 4జీ ఇంటర్నెట్ సేవలను నిలివేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికి ఈ నిషేధం విధించి సంవత్సరం దాటిపోయింది.

* జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రకుట్రకు యత్నిస్తున్న ఐదుగురు హిజ్బుల్‌ ముజాహిదీన్‌ ఉగ్రవాదులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి భారీ పేలుడు సామగ్రి, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. వీరిని పర్వేజ్‌ అహ్మద్‌ భట్ (22), అల్తాఫ్‌ అహ్మద్‌ మీర్‌ (35), జీహెచ్‌ మహమ్మద్‌ (35), నజీముద్దీన్‌ గుజ్జర్‌ (44), అబ్దుల్‌ ఖయ్యుమ్‌‌ (29)గా గుర్తించారు. కుప్వారా జిల్లా లోలాబ్‌లోని లాల్‌పోరాలో ఉగ్రవాదులు ఉన్నట్లు అందిన సమాచారం మేరకు సోమవారం సాయంత్రం సెర్చ్‌ ఆపరేషన్‌ నిర్వహించినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ దాడిలో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఈమధ్యే జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రదాడికి యత్నిస్తున్న ఆరుగురు లష్కరే తొయిబా ఉగ్రవాదులను పోలీసులు అరెస్టు చేశారు.

* లెబనాన్‌కు భారత్‌ మరోసారి చేయుతనందించనుంది. ఆగస్టు 4న లెబనాన్‌ రాజధాని బీరుట్‌లో పేలుడు కారణంగా 150 మందికిపైగా మృతిచెందారు. అనేక నిర్మాణాలు కూలిపోయాయి. ప్రస్తుతం పరిస్థితులు అధ్వాన్నంగా ఉన్నాయి. మొదట కొవిడ్‌ను ఎదుర్కొనేందుకు భారత ప్రభుత్వం అక్కడికి వైద్య పరికరాలు పంపించింది. కాగా స్థానిక అధికారులకు సహకరించేందుకు దేశం నుంచి మానవ వనరులను పంపనున్నట్లు అమెరికాలోని భారత శాశ్వత ప్రతినిధి టీఎస్‌ త్రిపాఠి తాజాగా వెల్లడించారు. ‘భారత ప్రభుత్వం తరఫున లెబనాన్‌ ప్రజలకు, ప్రభుత్వానికి మా సానుభూతి వ్యక్తం చేస్తున్నాం. దుర్ఘటన సమాచారం విన్న తర్వాత నిర్ఘాంతపోయాం. ఘటన అనంతరం అధికారులు, స్థానికుల పనితీరు ప్రసంశనీయం. ఎంతో అంకితభావం ప్రదర్శించారు. వారికి తోడ్పాటునందించేందుకు భారత్‌ నుంచి మానవ వనరులను పంపించనున్నాం’ అని త్రిపాఠి పేర్కొన్నారు. సహాయ సహకారాలు అందించేందుకు భారత ప్రభుత్వం లెబనాన్‌ ప్రభుత్వంతో మంతనాలు సాగిస్తోందని తెలిపారు.

* నోటితో మాట్లాడుతూ నొసటితో వెక్కిరిస్తున్నట్లుంటుంది చైనా తీరు.. ఓ పక్క సరిహద్దుల్లో శాంతి కోరుకుంటున్నామని చెబుతూనే మరోపక్క భారీగా ఆయుధాలను తరలిస్తోంది. ఇప్పటికే పాంగాంగ్‌ సరస్సు వద్ద తిష్ఠవేసిన చైనా సేనలు ఆ ప్రదేశం తమదే అంటూ వాస్తవాధీన రేఖనే మార్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. సైనికుల ఉపసంహరణ.. ఉద్రిక్తతలు చల్లార్చడం కోసం ప్రయత్నాలు చేస్తున్నామని చెబుతున్నా.. సరిహద్దుల్లో మాత్రం అవేవీ కనిపించడంలేదు. నిన్నే చైనా విదేశాంగశాఖ ప్రతినిధి ఝావో లిజియాన్‌ మాట్లాడుతూ భారత్‌తో సంబంధాలను మెరుగుపర్చుకోవడానికి కృషి చేస్తున్నామని చెప్పారు. మరోపక్క ఫోర్బ్స్‌ పత్రిక మాత్రం దీనికి భిన్నమైన కథనాన్ని ప్రచురించింది. భారత సరిహద్దుల్లోకి చైనా దళాలు మరిన్ని ఆయుధాలను చేరవేస్తున్నట్లు పేర్కొంది.

* కరోనా వణికిస్తున్న వేళ కొనసాగుతున్న టీకా రేసును ఎంతో ఆసక్తిగా గమనిస్తున్న ప్రపంచానికి తొలి ఆశాకిరణం కనిపించింది. కరోనా వైరస్‌పై రష్యా తొలి వ్యాక్సిన్‌ను విడుదల చేసింది. ఈ మేరకు రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ప్రకటన చేశారు. తన కుమార్తె టీకా వేయించుకున్నట్టు వెల్లడించారు. దీంతో కరోనా వ్యాక్సిన్‌ను రిజిస్టర్‌ చేసిన తొలిదేశంగా రష్యా అవతరించింది. టీకా ద్వారా రోగనిరోధక శక్తి పెరిగి వైరస్‌ నియంత్రణలోకి వస్తుందని తెలిపిన పుతిన్‌.. తొలుత వైద్య సిబ్బంది, ఉపాధ్యాయయులకు ఈ టీకా ఇవ్వనున్నట్టు చెప్పారు.

* ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కొత్తగా నిర్మించతలపెట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకంపై ఎన్జీటీలో వాదనలు ముగిశాయి. తెలంగాణకు చెందిన గవినోళ్ల శ్రీనివాస్‌ వేసిన పిటిషన్‌పై ఎన్జీటీ చెన్నై ధర్మాసనం ఇవాళ విచారణ చేపట్టింది. రాయలసీమ ఎత్తిపోతల పథకంలో కొత్త భాగాలను చేర్చారని ఈ సందర్భంగా పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. రాయలసీమ ఎత్తిపోతల పథకంపై వైఖరేంటో వారం రోజల్లో తెలపాలని కేంద్ర పర్యావరణ శాఖను ఎన్జీటీ ఆదేశించింది. తీర్పును రిజర్వు చేస్తున్నట్టు ఎన్జీటీ చెన్నై ధర్మాసనం తెలిపింది.

* దేశంలో కరోనా తీవ్రత అధికంగా ఉన్న పదిరాష్ట్రాలు వైరస్‌ను కట్టడి చేయగలిగితే కరోనాపై భారత్‌ విజయం సాధించినట్లేనని ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్పష్టం చేశారు. దేశంలో కరోనా పరిస్థితులు, అన్‌లాక్‌ అమలుపై నేడు ముఖ్యమంత్రులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మోదీ ఈ విధంగా స్పందించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 6లక్షల క్రియాశీల కేసులు ఉన్నాయన్నారు. దేశవ్యాప్తంగా నమోదవుతున్న కొవిడ్‌ కేసుల్లో దాదాపు 80శాతం పది రాష్ట్రాల్లోనే ఉన్నాయని ప్రధాని తెలిపారు.

* ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కొవిడ్‌ టెస్టులు నిర్వహిస్తోన్న దేశాల్లో అమెరికా, భారత్‌లు ముందున్నాయని డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి స్పష్టంచేశారు. ఇప్పటికే అమెరికాలో 6కోట్ల 50లక్షల మందికి కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేసినట్లు ట్రంప్‌ వెల్లడించారు. ఈ విషయంలో అమెరికాకు దగ్గరలో ఏ దేశం కూడా లేదని ట్రంప్‌ పేర్కొన్నారు. ఈ సంవత్సరం చివరినాటికి వ్యాక్సిన్‌ వచ్చే అవకాశాలు ఉన్నట్లు అభిప్రాయపడిన ట్రంప్‌, వ్యాక్సిన్‌ వచ్చిన వెంటనే ప్రజలకు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

* రాజకీయాల్లో అసూయ, వ్యక్తిగత శత్రుత్వానికి స్థానం లేదని రాజస్థాన్‌ కాంగ్రెస్‌ తిరుగుబాటు నేత సచిన్‌ పైలట్ అన్నారు. తన మాజీ బాస్‌, రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్‌ తనను పనికిరానివాడని దూషించినా, భాజపాతో కలిసి ప్రభుత్వాన్ని కూలదోసేందుకు కుట్ర పన్నానని ఆరోపించినా ఆయనను గౌరవిస్తానని సచిన్‌ తెలిపారు. ‘‘పని, పాలనాపరమైన వ్యవహారాలలో నా అభిప్రాయాలను వ్యక్తపరచే హక్కు నాకు ఉంది. కానీ అశోక్‌ గహ్లోత్ గారి వ్యాఖ్యలు నన్నెంతో బాధించాయి’’అని పైలట్‌ అన్నారు.