NRI-NRT

వందేభారత్ Phase5పై కేంద్రమంత్రి ప్రకటన-తాజావార్తలు

వందేభారత్ Phase5పై కేంద్రమంత్రి ప్రకటన-తాజావార్తలు

* కరోనా విజృంభణతో ప్రపంచవ్యాప్తంగా విమానయానంపై ఆంక్షలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ సమయంలో వివిధ దేశాల్లో ఉన్న భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చే వందేభారత్‌ మిషన్‌ ముమ్మరంగా కొనసాగుతోంది. ప్రస్తుతం ఐదో దశలో భాగంగా భారతీయులను వెనక్కి తీసుకొస్తున్నారు. ఇప్పటివరకు మొత్తం 10లక్షల మంది భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చినట్లు పౌరవిమానయాన శాఖ మంత్రి హర్దీప్‌ సింగ్‌ పూరి వెల్లడించారు. మరో లక్షా 33వేల మంది వివిధ దేశాలకు తరలివెళ్లినట్లు కేంద్రమంత్రి తెలిపారు. మే 7న ప్రారంభమైన ఈ మిషన్ ప్రస్తుతం ఐదో ఫేజ్‌ కొనసాగుతోంది. ఆగస్టు ఒకటో తేదీన ప్రారంభమైన వందేభారత్‌ ఫేజ్‌-5 ఈనెల 31వరకు కొనసాగుతుందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ దశలో దాదాపు 53దేశాల నుంచి 700 విమానాల ద్వారా మరో లక్షా 20 వేల మందిని స్వదేశానికి తీసుకురానున్నారు.

* ప్రముఖ పారిశ్రామికవేత్త పాలెం శ్రీకాంత్‌రెడ్డి కరోనాతో మృతి చెందారు. ఇటీవల ఆయనకు కరోనా సోకగా హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో చేరి చికిత్స పొందారు. ఆయన ఆరోగ్యం మరింతగా విషమించడంతో బుధవారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి చెన్నకేశవరెడ్డి కుమారుడే పాలెం శ్రీకాంత్‌రెడ్డి. గతంలో శ్రీకాంత్‌రెడ్డి కడప ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు. రాయలసీమ అభివృద్ధికి రాజకీయాలకు అతీతంగా కృషి చేశారు. మోడరన్‌ రాయలసీమ వ్యవస్థాపక అధ్యక్షుడిగా కూడా ఉన్నారు.

* ఓ బెయిల్‌ పిటిషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీం కోర్టులో మంగళవారం ఆసక్తికర సన్నివేశం చోటుచేటుచేసుకుంది. శ్రీకృష్ణుడి జన్మస్థలం కావాలా? బెయిల్‌ కావాలా? అంటూ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ఏ బోబ్డే సరదాగా వ్యాఖ్యానించారు. మరో పిటిషన్‌పై విచారణ సందర్భంగా మహాభారతాన్ని ఉదహరించారు.

* ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి కరోనా నుంచి కోలుకున్నారు. ఆయనతోపాటు కుటుంబసభ్యులు కూడా కరోనాను జయించారు. ఇటీవల కొవిడ్‌-19 సోకడంతో క్వారంటైన్‌లోకి వెళ్లిన రాజమౌళి కుటుంబం.. రెండు వారాల క్వారంటైన్‌ పూర్తవ్వడంతో మరోసారి టెస్టు చేయించుకున్నారు. అందులో అందరికీ నెగిటివ్‌ వచ్చింది. ఈ విషయాన్ని రాజమౌళి ట్విటర్‌ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. తనతోపాటు తన కుటుంబసభ్యులు కూడా కరోనా నుంచి కోలుకున్నామని ట్వీట్‌లో పేర్కొన్నారు. ప్లాస్మా దానం గురించి చెబుతూ… తమను వైద్యులు మూడు వారాలు వేచి చూడమన్నారని, ఆ లోగా శరీరంలో అవసరమైన యాంటీ బాడీస్‌ వృద్ధి చెందితే ప్లాస్మా దానం చేయడానికి ముందుకొస్తామని తెలిపారు.

* ప్రధాని నరేంద్రమోదీ లక్ష్యంగా కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ మరోసారి విమర్శలు గుప్పించారు. ఈ సారి ఆర్థిక వ్యవస్థనపై ఇన్ఫోసిస్‌ వ్యవస్థాపకులు నారాయణమూర్తి చేసిన వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ విరుచుకుపడ్డారు. మోదీ ఉన్నారుగా ఏదైనా సాధ్యమే అంటూ సెటైర్‌ వేశారు.

* ఆంధ్రప్రదేశ్‌లో దళిత యువకుడికి పోలీసులు శిరోముండనం చేసిన కేసుపై భారత రాష్ట్రపతి కార్యాలయం స్పందించింది. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ బాధితుడికి అండగా నిలబడేందుకు ప్రత్యేక అధికారిని నియమించారు. దీంతో ఏపీకి చెందిన సాధారణ పరిపాలన విభాగానికి ఈ కేసుకు సంబంధించిన దస్త్రం బదిలీ అయింది. అసిస్టెంట్‌ సెక్రటరీ జనార్ధన్‌బాబును కలవాలని, కేసు విషయంలో ఆయనకు సహకరించాలని బాధితుడు వరప్రసాద్‌కు రాష్ట్రపతి కార్యాలయం సూచించింది. దీంతో త్వరలో పూర్తి ఆధారాలతో బాధితుడు జనార్ధన్‌బాబును కలవనున్నారు.

* ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్‌ మహమ్మారిని ఎదుర్కొనేందుకు వ్యాక్సిన్‌ తయారు చేసినట్లు రష్యా ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై అంతర్జాతీయ నిపుణులు మాత్రం అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రయోగ పరీక్షలు ఫలితాల సమాచారాన్ని ఎక్కడా వెల్లడించకపోవడంపై విమర్శలు గుప్పిస్తున్నారు. కేవలం రెండు నెలల ప్రయోగాల అనంతరం వ్యాక్సిన్‌ ఆమోదాన్ని ప్రకటించడంపై పెదవివిరుస్తున్నారు. ఇలాంటి సమయంలో వ్యాక్సిన్‌ను నమ్మడం కష్టమని బ్రిటన్‌, జర్మనీ పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు.

* ఆకాశమే హద్దుగా చెలరేగిన బంగారం ధరలకు కొవిడ్‌ వ్యాక్సిన్‌ అడ్డుగా నిలిచింది. రష్యాలో తొలి వ్యాక్సిన్‌ను మంగళవారం విడుదల చేయడంతో పాటు అధ్యక్షుడి కుమార్తెకే చేశారన్న వార్తలతో అంతర్జాతీయంగా భారీ ఊరట లభించింది. ఫలితంగా హైదరాబాద్‌ బులియన్‌ విపణిలో 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.54,600కు దిగి వచ్చింది. ఇటీవల కాలంతో ఇది గరిష్ఠంగా రూ.58250కు చేరడం గమనార్హం. ఇదేవిధంగా కిలో వెండి ధర కూడా ఇటీవలి గరిష్ఠమైన రూ.76000 నుంచి రూ.67,000 కిందకు పరిమితమవుతోంది. ఆక్స్‌ఫర్డ్‌, భారత్‌ బయోటెక్‌ వ్యాక్సిన్లు కూడా విజయవంతమైతే, బంగారం-వెండి ధరల్లో మరింత భారీ దిద్దుబాటు ఉండొచ్చనే అంచనాను ట్రేడర్లు వ్యక్తం చేస్తున్నారు.