Movies

భారతీయుల అసహ్యానికి ప్రతీక…సడక్-2

భారతీయుల అసహ్యానికి ప్రతీక…సడక్-2

సినిమాను నిషేధించాలని విశ్వహిందూ పరిషత్‌ ఇచ్చిన పిలుపు ఓవైపు… సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మరణానికి కారణమైన మహేశ్‌ భట్‌ చేసిన సినిమా కనుక చూడవద్దని కొందరు నెటిజన్లు చేస్తున్న ఉద్యమం మరోవైపు… వెరసి ‘సడక్‌ 2’ ప్రయాణం సాఫీగా సాగడం లేదు. నిరసనల రహదారి(సడక్‌)లో పయనిస్తోంది. ‘సడక్‌’ అంటే ‘రహదారి’ అని అర్థం. సంజయ్‌ దత్‌, పూజా భట్‌ జంటగా 1991లో మహేశ్‌భట్‌ దర్శకత్వం వహించిన ‘సడక్‌’ మంచి విజయం సాధించింది. దానికి సీక్వెల్‌గా సంజయ్‌ దత్‌, ఆదిత్యా రాయ్‌ కపూర్‌, పూజా భట్‌, ఆలియా భట్‌ ప్రధాన తారలుగా ‘సడక్‌ 2’ తెరకెక్కింది. 20 ఏళ్ల తర్వాత మహేశ్‌భట్‌ మెగాఫోన్‌ పట్టిన చిత్రమిది. ఈ నెల 28న డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌ ఓటీటీలో సినిమా విడుదల కానుంది. బుధవారం ఉదయం ట్రైలర్‌ విడుదల చేశారు.సాయంత్రానికి 25లక్షలమందికి (2.5 మిలియన్‌) పైగా దీనిని డిస్‌ లైక్‌ చేశారు. లైకులు మాత్రం లక్షన్నర కంటే కాస్త ఎక్కువ. దీనికి ప్రధాన కారణం మహేశ్‌భట్‌, ప్రధాన తారలు. సంజయ్‌దత్‌, ఆలియా భట్‌, అదిత్యా రాయ్‌ కపూర్‌… ముగ్గురూ సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చినవాళ్లే కావడం. సుశాంత్‌ మరణం తర్వాత అతని ప్రేయసి రియా చక్రవర్తితో మహేశ్‌ భట్‌ సన్నిహితంగా ఉన్న ఫొటోలు నెట్టింట చక్కర్లు కొట్టాయి. ఆశ్రిత పక్షపాతం, బంధుప్రీతి వల్లే సుశాంత్‌ బలవన్మరణానికి పాల్పడ్డాడనే కొందరి నమ్మకానికి తోడు మహేశ్‌ భట్‌ కూడా కారకుడనే ఆరోపణలు ‘సడక్‌ 2’ ట్రైలర్‌పై ప్రభావం చూపాయి. దాంతో విపరీతంగా డిస్‌ లైక్స్‌ వచ్చాయి. ట్విట్టర్‌లో పలువురు సినిమా చూడవద్దని, హాట్‌స్టార్‌ యాప్‌ను మొబైల్స్‌ నుంచి తొలగించమని పిలుపు ఇస్తున్నారు. మరోవైపు ట్రైలర్‌లో హిందువుల మనోభావాలను కించపరిచారని విశ్వ హిందూ పరిషత్‌ ఆందోళన చేస్తోంది. సునీల్‌దత్‌ కుమారుడు సంజయ్‌దత్‌, మహేశ్‌ భట్‌ కుమార్తెలు పూజా, ఆలియా, నిర్మాత సిద్ధార్థ్‌ రాయ్‌ కపూర్‌ సోదరుడు ఆదిత్యా రాయ్‌ కపూర్‌ను నెపోటిజమ్‌ ప్రొడక్ట్స్‌గా విశ్వహిందూ పరిషత్‌ అభివర్ణించింది.