Editorials

కాశ్మీర్ దెబ్బకు సౌదీ-పాక్‌ల బంధానికి ముప్పు

కాశ్మీర్ దెబ్బకు సౌదీ-పాక్‌ల బంధానికి ముప్పు

సౌదీఅరేబియా, పాకిస్థాన్‌ నిన్న మొన్నటి వరకు మిత్రదేశాలు. ఇప్పుడు ఒక్కొక్కటిగా ఆ బంధాలన్నీ తెగదెంపులు అవుతున్నాయి. ఇందుకు కారణం కశ్మీర్‌ అంశమే అని విశ్లేషకులు భావిస్తున్నారు. రెండు దేశాల మధ్య సంబంధాలు బెడిసికొట్టడానికి ఇతర అంశాలు ఉన్నప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో కనిపిస్తున్న ప్రధాన కారణం కశ్మీర్‌. ఈ విషయంలో తనకంటూ సొంత వైఖరి కలిగిన సౌదీని తనకు మద్దతుగా మాట్లాడాలని పాక్‌ పదేపదే కోరడం నచ్చలేదు. అది చాలదన్నట్లు సౌదీపైనే నేరుగా విమర్శలకు దిగింది దాయాది పాకిస్థాన్‌. ఆ దెబ్బతో అసలే అంతంత మాత్రంగా మారిన రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత క్షీణించాయి. ఇంకా తెగే వరకు లాగుతురా? లేదా ఇక్కడితో ఆపేస్తారా? అనేది తెలియాలంటే వేచి చూడాలి. భారత్‌, పాక్‌ మధ్య ఎప్పటి నుంచో నలుగుతున్న అంశం కశ్మీర్‌. కానీ ఆ అంశం రెండు ఇస్లామిక్‌ దేశాల మధ్య సంబంధాలు బెడిసి కొట్టే స్థాయికి తీసుకువెళ్తుందని ఎవరూ ఊహించి ఉండరు. కశ్మీర్‌ అంతర్గత విషయం అని భారత్ చెబుతున్నా దాన్ని అంతర్జాతీయ అంశంగా మార్చేందుకు ఎప్పటి నుంచో పాకిస్థాన్‌ కుట్రలు, కుతంత్రాలు పన్నుతోంది. ఎప్పుడైతే 370 అధికరణ రద్దు చేసి దిల్లీ నాయకత్వం జమ్ము, కశ్మీర్‌ను రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించిందో అప్పటి నుంచి పాక్‌ వెర్రి రంకెలు వేస్తోంది. దీనిపై నానాయాగి చేసి ప్రపంచ దేశాల దృష్టి తన వైపు మళ్లించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించింది. కానీ చైనా, టర్కీ, మలేషియా లాంటి కొన్ని దేశాలు మినహా పాక్‌ అరుపుల్ని ఎవరూ పట్టించుకోలేదు. అంతర్జాతీయ వేదికలపై తన పాచిక పారకపోవడంతో ఇస్లామిక్‌ దేశాలను ఈ వివాదంలోకి లాగాలని పాక్‌ ప్రయత్నిస్తోంది. అందుకోసం 57 ముస్లిం దేశాలు సభ్యులుగా ఉన్న ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ ఇస్లామిక్ కార్పొరేషన్‌ (ఓఐసీ) మద్దతు పొందాలని భావించింది. ఓఐసీలో సభ్యత్వం కలిగి ఉన్న సౌదీని కశ్మీర్‌ అంశంపై చర్చించేందుకు సభ్యదేశాల్ని సమావేశపరచాలని ఫిబ్రవరిలో కోరింది. కానీ దీన్ని సౌదీ పట్టించుకోలేదు. ఆ తిరస్కారంతో మరింత భంగపడిన పాక్‌ సౌదీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించింది. పాక్‌ విదేశాంగ శాఖ మంత్రి షా మహ్మద్‌ ఖురేషి బహిరంగంగానే సౌదీని విమర్శించారు. వారు ముందుకు రాకపోతే కశ్మీర్‌ అంశంపై తమతో కలిసివచ్చే ముస్లిం దేశాలతో తామే సమావేశాన్ని నిర్వహిస్తామని ఓ విధంగా హెచ్చరిక స్వరంలో చెప్పారు.