Kids

అబాకస్…ఆవిరి యంత్రం…అన్నీ జేమ్స్ వాట్ అద్భుతాలే!

అబాకస్…ఆవిరి యంత్రం…అన్నీ జేమ్స్ వాట్ అద్భుతాలే!

తపన ఉంటే ఏదైనా సాధించొచ్చు. ఇది చాలామంది..చాలా సందర్భాల్లో చెప్పే మాటే. కానీ..ఇది నిజం. జేమ్స్‌ వాట్‌ తెలుసు కదా? అతడి కాలంలోనే ఇది నిరూపితమైంది. జేమ్స్‌కు ఆర్థిక సమస్యల్లేవు. పైగా అమ్మానాన్న చదువుకున్నవాళ్లు. ఎంతంటే అంత..ఏదంటే అది చదవొచ్చు. అయినా బడికి వెళ్లలేదు..చదువుకోలేదు. కానీ..ఏదైనా సాధించాలని అనుకున్నాడు. ఛేదించి..శోధించి..సాధించాడు. తపన ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించాడు.
**రైళ్లు.. ఓడలు ఎలా నడుస్తాయి?
ఇంధన శక్తి సాయంతోనే కదా? అది పెట్రోలు కావచ్చు.. డీజిల్‌ కావచ్చు.. కరంటు కావచ్చు.. బొగ్గు కావచ్చు. ఇంతేనా.. ఇంకేం లేవా? ఎందుకు లేవు. ఆవిరి శక్తి కూడా ఉంది కదా. ఆవిరి సాయంతో రైళ్లు.. ఓడలు.. ఇతర ఫ్యాక్టరీలు పనిచేసే విధానం గురించి మొదటగా ప్రతిపాదించింది జేమ్స్‌ వాట్‌. పారిశ్రామిక విప్లవంలో ప్రధాన భూమిక పోషించిన మేధావి. ఆర్థికంగా ఇబ్బందులేమీ లేకపోయినా గ్రౌండ్‌ లెవల్‌ నుంచి ఎదిగిన శాస్త్రవేత్త. పైగా అతడు ఏనాడూ స్కూలు మెట్లు ఎక్కినవాడు కాదు. స్కూల్‌కి వెళ్లకుండా.. కేవలం ట్యూషన్లు మాత్రమే చదివి విజ్ఞానం పొందిన జేమ్స్‌వాట్‌ తీసుకొచ్చిన మార్పు అంతా ఇంతా కాదు. పారిశ్రామిక విప్లవం తీసుకొచ్చిన ఘనుడు అతను. అతని పరిశోధనలకు మెచ్చిన లండన్‌ ప్రభుత్వం 1785లో ఫెలో ఆఫ్‌ రాయల్‌ సొసైటీకి ఎంపిక చేసింది. అది 1736వ సంవత్సరం. ఇంగ్లండ్‌కు చెందిన ఒక ఓడలు తయారుచేసే వ్యక్తి. మంచి విజ్ఞానవంతుడు. అతని భార్య కూడా విద్యావంతురాలే. ఒకవైపు ఓడలు తయారుచేస్తూనే మరోవైపు భవన నిర్మాణ పనులు కూడా చేస్తుండేవాడు అతను. వాళ్ల కొడుకే జేమ్స్‌ వాట్‌. వాట్‌ చాలా సున్నితమైన పిలగాడు. స్కూల్‌కి వెళ్లేవాడు కాదు. ఏదైనా గట్టిగా చెప్తే నొచ్చుకునేవాడు. ఎవరూ పట్టించుకోని విషయాల పట్ల శ్రద్ధ కనబర్చేవాడు. తల్లిదండ్రులకు ఇది బాధ కలిగించే విషయమే. ఎవరైనా అనుకుంటారు కదా? తమ పిలగాడు అందరిలా చురుకుగా ఉండాలి. చక్కగా చదువుకోవాలి అని. అందరూ అనుకున్నట్లే వాట్‌ తల్లిదండ్రులూ అనుకున్నారు. ఇప్పటికే రెండు వ్యాపారాలు ఉన్నాయి కాబట్టి ఏ లోటూ లేకుండా చూసుకొని పిల్లల్ని మంచి ప్రయోజకుల్ని చేయాలని కలలుగనేవారు. వారి ఆశలపై ఎప్పటికప్పుడు నీళ్లు చల్లుతూ వాట్‌ తికమక పెడుతుండేవాడు. ‘మన దగ్గరే చెప్తే వినడం లేదు. ఇంక స్కూల్లో ఏం వింటాడు? ఏం చదువుతాడు?’ అని భావించిన తల్లిదండ్రులు అతడిని స్కూల్‌కి పంపించలేదు. ఇంటి దగ్గరే తల్లి చదువు చెప్పేది. మార్పు కనిపించింది. చెప్తే వింటున్నాడు. కానీ స్కూల్‌ అంటే వెళ్లను అనేవాడు.
**ఏం చేయాలి?
బలవంతంగా ఏదీ అంటగట్టొద్దు అనుకున్నారు. ప్రైవేట్‌ ట్యూషన్లకు పంపిద్దామనుకొని.. ‘ఏరా వాట్స్‌.. ట్యూషన్‌కి వెళ్తావా?’ అని అడిగితే ‘ఓకే’ చెప్పేశాడు. ట్యూషన్‌కు వెళ్తూనే లాటిన్‌.. గ్రీక్‌ నేర్చుకున్నాడు. ‘వ్యాకరణం ఇంపార్టెంట్‌ బాబూ.. దానిమీద కాన్‌సెంట్రేట్‌ చెయ్‌’ అని ట్యూషన్‌ మాస్టారు సలహా ఇవ్వడంతో గ్రామర్‌ నేర్చుకున్నాడు. రోజులు గడుస్తున్న కొద్దీ జేమ్స్‌వాట్‌లో మార్పు కూడా వస్తూ ఉంది. తల్లిదండ్రుల ఆనందానికి హద్దుల్లేవు. ఏమవుతాడో ఏమో అని కంగారు పడిన వారికి కొడుకుపై సంపూర్ణ నమ్మకం ఏర్పడింది. వ్యాకరణంతోనే సరిపెట్టుకోకుండా గణితంపై దృష్టిపెట్టాడు జేమ్స్‌. అనతి కాలంలోనే మ్యాథమేటిక్స్‌లోని ట్రిక్స్‌ తెలుసుకున్నాడు. తెలివిగల అబ్బాయి అనిపించుకున్నాడు. ఎప్పుడైతే గణితంపై పట్టు సాధించాడో అతడి ఆలోచనలు ఆవిష్కరణలవైపు మళ్లాయి.
**వాట్‌ వాళ్ల నాన్న కాంట్రాక్టర్‌ కదా?
ఓడల నిర్మాణం.. భవన నిర్మాణం కోసం పదుల సంఖ్యలో క్రేన్లను ఉపయోగిస్తుండేవాడు. ఒక్క క్రేన్లే కాదు రకరకాల పరికరాలు వాళ్లింట్లో ఉండేవి. వాట్‌ వీటిని పరిశీలిస్తుండేవాడు. క్రేన్స్‌ అంత బరువులను ఎలా ఎత్తగలుగుతాయి? అవి ఎలా నడుస్తాయి? వంటి ప్రశ్నలు వేస్తుండేవాడు. తీరిక ఉన్నప్పుడు వాళ్ల నాన్న వాటి గురించి ఓ పాఠంలా చెప్తుండేవాడు. వాట్‌ గణితంలో క్లెవర్‌ స్టూడెంట్‌ అన్నాం కదా.. వాటిని సొంతంగా తయారుచేస్తూ ఉండేవాడు. అంతేకాదు.. వాళ్లనాన్న స్టోర్‌రూమ్‌లో భద్రపరిచిన నిర్మాణ పనిముట్లను పోలిన నమూనాలతో చిన్న చిన్న వస్తువులు చేస్తుండేవాడు. ఇది క్రమ క్రమంగా ఓ అలవాటు అయింది. ఎవరూ లేనప్పుడు వాటిని తయారుచేసి ఎవరికీ తెలియకుండా దాచిపెట్టేవాడు. **వాట్‌ వయసు17 ఏండ్లు. పై చదువులు చదివించేందుకు అతడిని గ్లాస్గోకి పంపించారు. బంధువుల ఇంట్లో ఉంటూ చదువుకునేవాడు. అక్కడ కొంతకాలం చదువుకున్నాడు. అతడి ప్రజ్ఞను చూసి అందరూ ఆశ్చర్యపోయేవారు. ఎందుకంటే ఒకప్పుడు వాట్‌ చేసే చేష్టలు చూసి అందరూ ‘మెంటల్‌ కేస్‌’ అనుకునేవారు. అందుకే కదా.. అతడిని స్కూల్‌కి కూడా పంపకుండా ఇంట్లోనే ఉంచి చదువు చెప్పించింది. వేరేవాళ్లతో కూడా పెద్దగా మాట్లాడకపోయేవాడు. కానీ ఇప్పుడు చదువులో ప్రతిభావంతుడు అయ్యాడు. అందరితోనూ చాలా చక్కగా ఉంటున్నాడు. గా ్లస్గోలో చదువు అయిపోయింది. 1755లో లండన్‌కు వెళ్లాడు. అబాకస్‌ వంటి గణిత ఇన్‌స్ట్రెమెంట్స్‌పై ఆసక్తి ఏర్పరుచుకున్నాడు. ఏదో అందాజా ప్రకారం వాటిని తయారుచేయడం కాకుండా సిద్ధాంతపరంగా.. తర్కం పరంగా అబాకస్‌ వంటి గణిత పరికరాలను రూపొందించాలని పట్టుబట్టాడు. అందుకోసం లండన్‌లో ఓ మాస్టారును చూశారు పేరెంట్స్‌. తొందరగానే పని నేర్చుకున్నాడు కానీ.. అక్కడ ఎక్కువకాలం ఉండలేపోయాడు. సంవత్సరకాలంలోనే రకరకాల ప్రాంతాలు మారుతుండటం వల్ల తరుచూ అనారోగ్య సమస్యలు వచ్చేవి. అందుకే తనను తీసుకెళ్లమని పేరెంట్స్‌కు కబురు పంపాడు.
**1757లో వాట్‌ మళ్లీ గ్లాస్గో యూనివర్సిటీకి వచ్చేశాడు. తాను ఇంతకాలం ఏం నేర్చుకున్నాడో.. దాని ఫలితం ఎలా ఉందో తెలుసుకునేందుకు అక్కడొక దుకాణం పెట్టుకున్నాడు. అబాకస్‌ వంటి గణిత సాధనాలను అమ్మేవాడు. మంచి ఆదరణ ఉండేది. ఎంతో కొంత డబ్బు కూడా సంపాదించాడు. దానికి రెట్టింపు పేరు సంపాదించాడు. గణిత ఇన్‌స్ట్రుమెంట్స్‌ తయారీ కోసం ప్రముఖ శాస్త్రవేత్తలను కలుస్తుండేవాడు. అలా జోసెఫ్‌ బ్లాక్‌ అనే భౌతిక శాస్త్రవేత్తతో మంచి స్నేహం ఏర్పడింది. అతడు ఏమేం చేస్తాడో? ఎలా చేస్తాడో? అని పరిశీలిస్తుండేవాడు.
**జేమ్స్‌వాట్‌ పెద్దోడయ్యాడు. ఇంట్లో పెండ్లి ప్రస్తావన కూడా వచ్చింది. ‘నేను ఇప్పుడు ఏం చేస్తున్నానని అప్పుడే పెండ్లి అంటున్నారు? నేను చేయాల్సింది చాలా ఉంది. ఎవరూ కనిపెట్టనిది ఏదైనా కనిపెట్టాలనేదే నా ఆలోచన. పెండ్లి చేస్తే వాటికి అడ్డంకిగా మారదా?’ అని తల్లిదండ్రులను బతిమిలాడుకున్నాడు. కానీ వాళ్లు వినలేదు. ‘నువ్వు ఇప్పటికే చాలా సాధించావు. అసలు నీ భవిష్యత్‌ ఏంటో అనుకున్న మాకు ఇవాళ నువ్వే ఓ భవిష్యత్‌లా కనిపిస్తున్నావ్‌. కనీసం చదువైనా అబ్బుతుందో అబ్బదో అనుకున్న నీకు.. ఇవాళ ఓ సైంటిస్ట్‌ అయ్యేంత విజ్ఞానం.. జ్ఞానం వచ్చింది. ఇది చాలదా? సరే.. ఒకవేళ నువ్వు ఏదైనా సాధిద్దామనే అనుకుంటే పెండ్లయినంక కూడా సాధించొచ్చులే. ఎందుకు మా నిర్ణయాన్ని తప్పుబడతావు’ అని పదేపదే అనడంతో వాట్‌ పెండ్లికి ఒప్పుకున్నాడు. 1764లో మార్గరెట్‌ మిల్లర్‌తో అతడికి పెండ్లి అయ్యింది. అంతా సాఫీగా ఉందనుకున్న సమయంలోనే భార్య అనారోగ్యానికి గురై చనిపోయింది. అప్పుడు వారికి ఆరుగురు పిల్లలు. 1764లో వాళ్ల నాన్నకు సంబంధించిన ఓడ ఇంజిన్‌ను రిపేర్‌ చేస్తుండగా వాట్‌ ఒక విషయం గ్రహించాడు. సిలిండర్‌ పదే పదే చల్లబర్చడం మల్లా వేడి చేయడం ఏంటి? అనుకున్నాడు. అక్కడ పనిచేసేవాళ్లను అడిగాడు. ‘ఇలాగే చేస్తాం. ఇప్పుడే కాదు ఏండ్లతరబడి ఇదే విధంగా పనిచేస్తుంటాం. ఎప్పుడూ.. ఎవరూ పెద్దగా దీని గురించి అడగలేదు. మేం అంతా సక్రమంగానే చేస్తున్నాం కాబట్టి ఎవరికీ తప్పులు కనిపించవు’ అన్నారు. ‘ఉండొచ్చు. నేను కాదనడం లేదు. కానీ నిరంతరం ఇలా జరగడం వల్ల ఇంజిన్ల శక్తి వృథా అవుతుందే తప్ప పెద్దగా ప్రయోజనం ఉండదు’ అన్నాడు. అక్కడ పనిచేసే సూపర్‌వైజర్‌కి కూడా ఇదే విషయం చెప్పాడు. ‘ఇప్పటివరకైతే ఇలానే నడుస్తుంది. మేమే కాదు.. అందరూ ఇలాగే చేస్తారు’ అని సూపర్‌వైజర్‌ సమాధానం ఇచ్చాడు. ‘ఓకే ఓకే.. కానీ నేను మీకు హామీ ఇస్తున్నా. ఈ సమస్యను పరిష్కరించడానికి నేనొక యంత్రాన్ని తయారుచేస్తా’ అని మాటిచ్చాడు.
**ఇదొక సంచలనం. ఇచ్చిన మాట కోసం రాత్రింబవళ్లు కష్టపడ్డాడు వాట్‌. 1765లో ఒక ఇంజన్‌ను డిజైన్‌ చేశాడు. అందరూ ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఆ ఇంజిన్‌ పనితీరు చాలా సరళంగా ఉంది. మార్పు ఏంటో చేసి చూపెట్టాడు. ఇంతకూ వాట్‌ చేసింది ఏంటంటే.. సిలిండర్లకు ప్రత్యేకమైన ఒక కండెన్సర్‌ అమర్చి శక్తి వృథా అవ్వకుండా నివారించాడు. ఆవిరి ఇంజిన్ల శక్తి సామర్థ్యం ఏంటో చూపించాడు. వీటి ద్వారా ఖర్చును ఎంత తగ్గించవచ్చో చూపెట్టాడు. అది అతడి మొదటి ఆవిష్కరణ. అప్పట్లో పెను సంచలనం రేపింది. పదార్థం స్థితిని మార్చడంలో కలిగే వేడి ధారంగా ఆవిరి యంత్రాన్ని రూపొందించి.. ఇంజిన్‌ లోపాన్ని సవరించాడు. ఎంతోకాలంగా సమస్యగా ఉన్న శక్తి అతి వినియోగానికి తనదైన రీతిలో చక్కని పరిష్కారం చూపించి అందరి మెప్పు పొందాడు.
**అది1765. ఒకవైపు ఆవిష్కరణలు చేస్తూనే మరికొన్ని కొత్త విషయాలు తెలుసుకోవాలి అనే ఆలోచనతో ల్యాండ్‌ సర్వేయర్‌ అయ్యాడు. స్కాట్లాండ్‌లోని కాలువల కోసం మార్గాలను గుర్తించడంలో నిరంతరం బిజీగా ఉండేవాడు. అదే సమయంలో ఆవిరి యంత్రంపైకి పూర్తి దృష్టి మళ్లింది. దాంట్లో పురోగతి సాధించాలని గట్టి నిర్ణయం తీసుకున్నాడు. ఒక రకంగా ఇది సాహసమే అనుకోవచ్చు. ఎందుకంటే దానికి చాలా డబ్బు కావాల్సి ఉంటుంది. బ్రిటీష్‌ శాస్త్రవేత్త జాన్‌ రాబక్‌ను కలిశాడు. జేమ్స్‌వాట్‌ పనితీరు తెలుసుకున్న అతడు ఒక నమూనా ఇంజిన్‌ను తయారుచేసేందుకు ఆర్డర్‌ ఇచ్చాడు. కానీ ముందుగా పెట్టుబడి పెట్టేందుకు చేతిలో డబ్బుల్లేవు. జోసెఫ్‌ బ్లాక్‌ నుంచి అప్పు తీసుకొని ఒక నమూనా టెస్ట్‌ ఇంజిన్‌ను తయారుచేశాడు. 1769లో ఫైర్‌ ఇంజన్‌లో ఆవిరి, ఇంధన వినియోగాన్ని తగ్గించే కొత్త ఆవిష్కరణ కనిపెట్టాడు. 1776లో పురోగతి సాధించి ఆవిరి యంత్రాల తయారీకి కొత్తమార్గం సుగమం చేశాడు. ఆవిరి యంత్రాన్ని పరిపూర్ణం చేసి అందరి మన్ననలూ పొందాడు. 1781వరకు కార్నివాల్‌లో ఎక్కువ కాలం గడిపాడు. అక్కడ రాగి, టిన్‌ గనుల కోసం అనేక పంపింగ్‌ ఇంజిన్‌లను తయారుచేశాడు. వీటి ఇంధన ఖర్చులు తగ్గించాలనే ఆలోచనతో 1782లో డబుల్‌ యాక్టింగ్‌ ఇంజిన్‌ తయారుచేశాడు. ఈ సమయంలో పార్టనర్‌తో గొడవ అయ్యింది. సమాంతర చలన ఆవిష్కరణతో పిస్టన్‌ రాడ్‌ను బలంగా నడిపించే అనుసంధానమైన రాడ్‌ల అమరికతో వీటిని తయారుచేశాడు. ‘నేను రూపొందించిన అత్యంత తెలివైన.. సరళమైన యంత్రాలలో ఇది ముఖ్యమైంది. ఇది ఆవిరి ద్వారా నడుస్తూ ఇంధనాన్ని పొదుపు చేస్తుంది. శక్తిని వృథా కానివ్వదు. పేపర్‌ మిల్లులు.. పిండి మిల్లులు.. కాటన్‌ మిల్లులు.. ఐరన్‌ మిల్లులు.. డిస్టిలరీలు.. కాలువలు.. వాటర్‌గ్రిడ్‌ల నుంచి ఆవిరి యంత్రాలనే వాడుతున్నారు’ అంటూ ఆవిరి యంత్రం ఆవిష్కరణ సందర్భంగా జేమ్స్‌వాట్‌ తెలిపారు. 1765లో ఒక ఇంజన్‌ను డిజైన్‌ చేశాడు. అందరూ ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఆ ఇంజిన్‌ పనితీరు చాలా సరళంగా ఉంది. మార్పు ఏంటో చేసి చూపెట్టాడు. ఇంతకూ వాట్‌ చేసింది ఏంటంటే.. సిలిండర్లకు ప్రత్యేకమైన ఒక కండెన్సర్‌ అమర్చి శక్తి వృథా అవ్వకుండా నివారించాడు. ఆవిరి ఇంజిన్ల శక్తి సామర్థ్యం ఏంటో చూపించాడు. వీటి ద్వారా ఖర్చును ఎంత తగ్గించవచ్చో చూపెట్టాడు. 1781వరకు కార్నివాల్‌లో ఎక్కువ కాలం గడిపాడు. అక్కడ రాగి, టిన్‌ గనుల కోసం అనేక పంపింగ్‌ ఇంజిన్‌లను తయారుచేశాడు. వీటి ఇంధన ఖర్చులు తగ్గించాలనే ఆలోచనతో 1782లో డబుల్‌ యాక్టింగ్‌ ఇంజిన్‌ తయారుచేశాడు. ఈ సమయంలో పార్టనర్‌తో గొడవ అయ్యింది. సమాంతర చలన ఆవిష్కరణతో పిస్టన్‌ రాడ్‌ను బలంగా నడిపించే అనుసంధానమైన రాడ్‌ల అమరికతో వీటిని తయారుచేశాడు.