DailyDose

అక్కడ చదివిన మెడికల్ డిగ్రీలు పనికిరావు-తాజావార్తలు

అక్కడ చదివిన మెడికల్ డిగ్రీలు పనికిరావు-తాజావార్తలు

* మూడు రాజధానులకు సంబందించిన పరిపాలన వికేంద్రీకరణ చట్టం, సిఆర్డిఏ చట్టం రద్దుపై హైకోర్టులో విచారణ ప్రారంభం. ఆన్ లైన్ లో విచారణలో ఏర్పడ్డ సాంకేతిక సమస్య పరిష్కరించడంతో దాదాపు రెండు గంటలు ఆలస్యంగా ప్రారంభమైన విచారణ.

* కరోనా విజృంభణతో ఆగిపోయిన పరీక్షల నిర్వహణపై ఏపీ ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. విద్యార్థులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎంసెట్‌ సహా పలు ప్రవేశ పరీక్షల తేదీలను మంత్రి ఆదిమూలపు సురేశ్ శుక్రవారం ప్రకటించారు. సెప్టెంబర్‌ 17 నుంచి 25 వరకు ఎంసెట్‌ పరీక్ష నిర్వహించనున్నట్టు తెలిపారు. అలాగే, సెప్టెంబర్‌ 10, 11న ఐసెట్‌; సెప్టెంబర్‌ 14న ఈసెట్‌; సెప్టెంబర్‌ 28, 29, 30న ఏపీపీజీఈసెట్; అక్టోబర్‌ 1న ఎడ్‌సెట్‌, లాసెట్‌; అక్టోబర్‌ 2 నుంచి 5 వరకు ఏపీపీఈసీఈటీ పరీక్షలు జరుగుతాయని స్పష్టంచేశారు.

* జస్థాన్‌లో గత కొన్ని రోజులుగా సాగుతున్న రాజకీయ సంక్షోభానికి ఎట్టకేలకు ముగింపు పడింది. ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ ప్రభుత్వం విశ్వాస పరీక్షలో నెగ్గింది. రాజస్థాన్‌ అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి తొలుత సభలో విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టగా.. అధికార, విపక్షాల మధ్య వాడీవేడిగా చర్చలు కొనసాగాయి. అనంతరం నిర్వహించిన ఓటింగ్‌లో మూజువాణి ఓటుతో గహ్లోత్‌ సర్కార్‌ విజయం సాధించినట్టు స్పీకర్‌ ప్రకటించారు.

* గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో ఇవాళ 25 నూతన బస్తీ దవాఖానాలు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. వీటిని స్థానిక మంత్రులు, ఎమ్మెల్యేలు శుక్రవారం ప్రారంభించారు. హబ్సిగూడా డివిజన్‌లోని రామ్‌ రెడ్డి నగర్‌లో బస్తీ దవాఖానాను మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. అనంతరం అక్కడ వైద్య పరీక్షలు చేయించుకున్నారు. కార్యక్రమంలో మేయర్‌ బొంతు రామ్మోహన్‌, కమిషనర్‌ లోకేశ్‌ కుమార్‌, మేడ్చల్‌ జిల్లా కలెక్టర్‌ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

* అమరావతి నుంచి కార్యాలయాల తరలింపు విషయంలో ఈనెల 27వ తేదీ వరకూ యథాతథ స్థితి (స్టేటస్‌ కో) పాటించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. పాలనా వికేంద్రీకరణ చట్టం, సీఆర్‌డీఏ చట్టాన్ని రద్దుచేస్తూ ప్రభుత్వం జారీచేసిన గెజిట్‌ ప్రకటనలు, చట్టాలను సవాలు చేస్తూ దాఖలైన దాఖలైన దాదాపు 55 పిటిషన్లపై శుక్రవారం జస్టిస్‌ రాకేశ్‌కుమార్‌, జస్టిస్‌ ఏవీ శేషసాయి, జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తితో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది.

* భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఆరోగ్యం కొద్దిగా మెరుగైనట్లు ఆయన కుమార్తె శర్మిష్ఠా ముఖర్జీ తెలిపారు. ‘‘క్లిష్టమైన వైద్య పరిభాషలో కాకుండా, నాకు అర్థమైనదేమంటే గత రెండురోజులుగా మా నాన్నగారి ఆరోగ్య పరిస్థితి క్లిష్టంగానే ఉన్నప్పటికీ.. అది మరింత దిగజారలేదు. వెలుతురుకు ఆయన కళ్లు కొద్దిగా ప్రతిస్పందిస్తున్నాయి.’’ అని ఆమె తన ట్విటర్‌ ఖాతాలో పేర్కొన్నారు.

* అమెరికాలో చదువుకోవాలనుకునే విద్యార్థులకు శుభవార్త. కరోనా నేపథ్యంలో నిలిచిపోయిన విద్యార్థుల యూఎస్‌ వీసా ప్రక్రియ ఈ నెల 17 నుంచి తిరిగి ప్రారంభం కానుంది. హైదరాబాద్‌, దిల్లీ, ముంబయి, చెన్నై, కోల్‌కతాలోని యూఎస్‌ కాన్సులేట్లలో సోమవారం నుంచి విద్యార్థి వీసాల ప్రక్రియ ప్రారంభమవుతుందని భారత్‌లోని యూఎస్‌ ఎంబసీ ప్రకటన విడుదల చేసింది. కరోనా పరిస్థితుల్లో పరిమిత సంఖ్యలో విద్యార్థులకు వీసాలు జారీ చేయనున్నట్లు వెల్లడించింది.

* కరోనా వైరస్‌ వ్యాప్తితో తీవ్ర భయాందోళనకు గురవుతున్న ప్రజలు ఇంటర్నెట్‌ వినియోగం వైపు మొగ్గు చూపడంతో సైబర్‌ నేరగాళ్లు పెట్రేగిపోతున్న వేళ తెలంగాణ మహిళా భద్రతా విభాగం చేపట్టిన కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్‌ ప్రశంసించారు. ముఖ్యంగా మహిళలు, ఆన్‌లైన్‌ చదువుల్లో నిమగ్నమైపోయిన విద్యార్థులు ఈ నేరాల బారిన పడే ప్రమాదం ఉన్నందున ‘సైబ్‌-హర్‌’ పేరుతో చేపట్టిన ఆన్‌లైన్‌ అవగాహన కార్యక్రమంపై ఆయన స్పందించారు.

* ఏపీ ప్రభుత్వం వద్ద ఒక్క రాజధానికే డబ్బుల్లేవు.. మూడు రాజధానులు కావాలా? అని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు ఎద్దేవా చేశారు. ఒక సామాజిక వర్గం నాయకులు తనపై మాటల దాడి చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇక తనను రాజీనామా చేయమని పలువురు వైకాపా నేతలు చేస్తున్న డిమాండ్‌ను ప్రస్తావిస్తూ.. జగన్‌ బొమ్మతో తాను గెలవలేదు కాబట్టి రాజీనామా చేయనని ఎంపీ స్పష్టం చేశారు.

* కరోనా వైరస్‌, తదనంతర లాక్‌డౌన్‌ల నేపథ్యంలో ఆన్‌లైన్‌ ఔషధ సరఫరా రంగానికి పెరుగుతున్న డిమాండ్‌ను ఈకామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ తమ వ్యాపారాభివృద్ధికి అనుకూలంగా మార్చుకుంది. భారత్‌లో ఆన్‌లైన్‌ ద్వారా ఔషధాలు, సాధారణ వైద్య పరికరాలను సరఫరా చేయనుంది. ‘అమెజాన్‌ ఫార్మసీ’ పేరుతో తాము ఆన్‌లైన్‌ ఔషధ సరఫరా చేయనున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది.

* పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ ప్రాంతంలోని వైద్య కళాశాలలు ఇచ్చే డిగ్రీలను గుర్తించబోమని భారత ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (ఎంసీఐ) ఓ అధికారిక ప్రకటన వెలువరించింది. వివరాలు ఇలా ఉన్నాయి… పీఓకేలో మెడిసిన్‌ చదివిన ఓ కశ్మీర్‌కు చెందిన ఓ విద్యార్థిని తన వైద్యవిద్యకు గుర్తింపు లభించకపోవటంతో న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.