DailyDose

హైదరాబాద్ శివారులో 1000కిలోల గంజాయి పట్టివేత-నేరవార్తలు

హైదరాబాద్ శివారులో 1000కిలోల గంజాయి పట్టివేత-నేరవార్తలు

* నగర శివార్లలో భారీ ఎత్తున గంజాయిని డీఆర్‌ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రూ. 2.62 కోట్లు విలువ చేసే 1,050 కిలోల గంజాయిని విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతం నుంచి మహారాష్ట్రకు తరలిస్తుండగా హైదరాబాద్‌ నగర శివార్లలో చేపట్టిన తనిఖీల్లో అధికారులు గుర్తించారు. ఒక కంటైనర్‌లో ఇతర సరుకుల రవాణా మాటున ప్లాస్టిక్‌ సంచుల్లో గంజాయిని తరలిస్తున్నారని తెలిపారు. ఎన్‌డీపీఎస్‌ చట్టం కింద వాహనాన్ని సీజ్‌ చేసి, ఒకరిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.

* ప్రభుత్వం, హైకోర్టు హెచ్చరికలు జారీ చేస్తున్నప్పటికీ.. కరోనాకు చికిత్స పేరుతో దోపిడీకి పాల్పడుతున్న కొన్ని కార్పొరేట్‌ ఆసుపత్రుల తీరు మారడం లేదు. సికింద్రాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో కరోనాతో చికిత్స పొందుతూ మరణించిన వ్యక్తికి రూ.20 లక్షల బిల్లు వేశారు. అప్పటికే బీమా ద్వారా రూ.11.5 లక్షలకు పైగా చెల్లించగా.. మిగతా మొత్తాన్ని చెల్లిస్తేనే మృతదేహాన్ని అప్పగిస్తామని మొండికేసి 40 గంటల పాటు ఆసుపత్రి మార్చురీలోనే మృతదేహాన్ని పెట్టుకున్నారు. ముషీరాబాద్‌కు చెందిన వ్యక్తి(49) సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నారు. కరోనా పాజిటివ్‌ రావడంతో గత నెల 20న సికింద్రాబాద్‌లోని ఓ కార్పొరేట్‌ ఆసుపత్రిలో చేరాడు. ఈనెల 12న రాత్రి మృతి చెందారు. 22 రోజులకు గానూ బిల్లు రూ.20 లక్షల బిల్లు వేశారు. రూ.11.50 లక్షలకు పైగా ఇన్సూరెన్సు ద్వారా చెల్లించగా.. మిగతా మొత్తం కట్టాలని కుటుంబ సభ్యులకు తెలిపారు. మృతదేహాన్ని అప్పగించలేదు. క్రైస్తవ సంఘాల నాయకులకు ఈ విషయం తెలియడంతో ఆసుపత్రి వర్గాలను నిలదీశాయి. వైద్య, ఆరోగ్యశాఖ అధికారులకు బాధితులు ఫిర్యాదు చేశారు. కార్పొరేట్‌ ఆసుపత్రులపై చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైదని క్రైస్తవ ధర్మప్రచార సమితి అధ్యక్షులు మత్తయ్య ఆరోపించారు.

* సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంపై ఇప్పటికీ పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి సుశాంత్ మరణానికి సంబంధించి మరిన్ని సందేహాలు లేవనెత్తారు. సుశాంత్‌ చనిపోయిన తర్వాత ఆయన ఇంటి వద్ద రెండు అంబులెన్సులు ఎందుకు ఉన్నాయని, ఆయనకు నమ్మకస్తుడైన శ్యామ్యూల్ హోకిప్ అదృశ్యం అవడం వెనుక ఉన్న కారణాలు ఏమిటి అని బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి ట్విట్టర్‌లో సంచలన ఆరోపణలు చేశారు.

* ఘట్‌కేసర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఏఎస్సై ఆత్మహత్య ప్రయత్నం కలకలం సృష్టించింది. అధికారుల వేధింపులే కారణమని తెలిసింది. వివరాలు.. రామకృష్ణ అనే వ్యక్తి ఘట్‌కేసర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఏఎస్సైగా విధుల నిర్వహిస్తున్నాడు. ఈనెల 10న ఒక కేసు విషయంలో కొంత మంది వ్యక్తులను పోలీసు స్టేషన్‌కి తీసుకురాగా.. ఆ సమయంలో రామకృష్ణ విధుల్లో ఉన్నాడు. అయితే రామకృష్ణ ఉన్న సమయంలోనే స్టేషన్‌కు తీసుకొచ్చినవారిలో ఒక వ్యక్తి పారిపోయాడని సమాచారం. దీంతో విధుల్లో ఉన్న ఏఎస్సై రామకృష్ణని పై అధికారులు మందలించారు. దీంతో తాను అవమానం గురైనట్లు భావించిన రామకృష్ణ నేడు జెండా పండుగకు హాజరయ్యాడు. అనంతరం ఇంటికి కాల్ చేసి ఇదే నా చివరి కాల్ అని చెప్పి ఫోన్ కట్ చేసినట్లు తెలుస్తుంది. ఈ విషయపై అలర్ట్ అయిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. రామకృష్ణ ఫోన్ సిగ్నల్ ని ట్రాక్ చేసిన పోలీసులు ఘట్ కేసర్ ప్రాంతంలో చెట్టుకు ఉరి వేసుకొనే సమయంలోనే అక్కడికి చేరుకొని రక్షించారు. కాగా రామకృష్ణ ని దగ్గర్లోని క్యూర్ ఆసుపత్రికి తరలించగా.. రామకృష్ణ సురక్షితంగా ఉన్నట్లు వైద్యులు పేర్కొన్నారు.

* కీసర తహసీల్దార్‌ నాగరాజు ఇంట్లో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. శుక్రవారం రాత్రి ఏకంగా రూ. కోటీ 10 లక్షల లంచం తీసుకుంటూ నాగరాజు ఏసీబీ అధికారులకు పట్టుబడిన సంగతి తెలిసిందే. ఆయన ఇంట్లో 28 లక్షలు నగదు, బంగారు ఆభరణాలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నాగరాజు బినామీల పేర్లతో భారీగా అక్రమాస్తులు కలిగిఉన్నట్లు ఏసీబీ గుర్తించింది. తహసీల్దార్ బంధువులు, బినామీల ఇళ్లలో కూడా ఏసీబీ సోదాలు నిర్వహించింది.తహసీల్దార్‌ నాగరాజు, రియల్టర్స్ అంజిరెడ్డి, శ్రీనాథ్‌, వీఆర్ఏ సాయిరాజులను ఏసీబీ అదుపులోకి తీసుకుంది. గతంలో ఆదాయానికి మించి ఆస్తుల కేసులో తహశీల్దార్ నాగరాజు అరెస్టయ్యారు.

* ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా శుక్రవారం జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతి చెందారు. దామరచర్ల మండలం వాడపల్లికి చెందిన ఇద్దరు అన్నదమ్ములు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. స్థానిక కృష్ణానది వంతెన అవతలి భాగం దాచేపల్లి మండలం పొందుగుల సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన అన్నదమ్ములు కొమెర సూరి (21), వంశీ (17) ద్విచక్రవాహనంపై ఏపీలోని అమ్మమ్మ ఇంటి నుంచి వాడపల్లికి వస్తుండగా సరిహద్దులో లారీ ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందారు. వీరిలో సూరి కోదాడలో చదువుతుండగా, తమ్ముడు వంశీ స్థానికంగా 10వ తరగతి విద్యనభ్యసిస్తున్నాడు. ప్రస్తుతం పాఠశాలలు లేకపోవడంతో ఇంటివద్దే ఉంటున్నారు. కాగా వీరి తండ్రి పిచ్చయ్య ఈ ఏడాది జనవరిలో మృతి చెందాడు. ఒకే కుటుంబంలో ఏడు నెలల కాలంలో ముగ్గురు మృతి చెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది.