DailyDose

బైడెన్ H1B వాగ్దానాలు-తాజావార్తలు

బైడెన్ H1B వాగ్దానాలు-తాజావార్తలు

* అమెరికా అధ్యక్షునిగా జో బైడెన్‌ను ఎన్నుకుంటే హెచ్‌-1బీ వీసా వ్యవస్థను ప్రక్షాళించి, గ్రీన్‌కార్డులకు దేశాల వారీగా ఉన్న కోటాను రద్దు చేసే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన ప్రచార బృందం ప్రకటించింది. ప్రధానంగా భారతీయ అమెరికన్లను దృష్టిలో పెట్టుకుని ఆయన ఈ ప్రకటన చేశారు. భారత స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని బైడెన్‌ తరఫున ఈ మేరకు ప్రత్యేకంగా విధాన పత్రాన్ని విడుదల చేశారు. కుటుంబ ఆధారిత వలస విధానానికి ప్రోత్సాహం లభిస్తుందని, కుటుంబ ఏకీకరణకు మద్దతు ఇస్తామని బైడెన్‌ మద్దతుదారులు తెలిపారు. శాశ్వత వీసాల కోటాను కూడా పెంచుతామన్నారు.

* అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ప్రంప్ సోదరుడు రాబర్ట్‌ ట్రంప్‌ (71) అనారోగ్యంతో కన్నుమూశారు. తీవ్ర అనారోగ్యానికి గురై న్యూయార్క్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం రాత్రి తుదిశ్వాస విడిచినట్లు ట్రంప్‌ స్వయంగా వెల్లడించారు. ‘బరువెక్కిన హృదయంతో తెలియజేస్తున్నా.. నా సోదరుడు రాబర్ట్‌ ప్రశాంతంగా కన్నుమూశాడు’ అని ట్రంప్‌ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. రాబర్ట్‌ ఆరోగ్యం పూర్తిగా క్షీణించిందని డొనాల్డ్‌ ట్రంప్‌కు శ్వేతసౌధం అధికారులు తెలియజేయగా ఆయన శుక్రవారం ఆసుపత్రికి వెళ్లి తమ్ముడిని పరామర్శించారు. ‘అతడు నా సోదరుడు మాత్రమే కాదు. నా ప్రియ మిత్రుడు. అతడిని ఎంతో మిస్‌ అవుతున్నా. మేం మళ్లీ కలుసుకుంటాం. సోదరుడి జ్ఞాపకాలు నా మదిలో చిరకాలం కదలాడుతూనే ఉంటాయి. రాబర్ట్‌.. ఐ లవ్‌ యూ. రెస్ట్‌ ఇన్‌ పీస్‌’ అంటూ భావోద్వేగ ప్రకటన విడుదల చేశారు. 

* మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందని ఆయన కుమారుడు, కాంగ్రెస్ నేత అభిజిత్ ముఖర్జీ ఆదివారం వెల్లడించారు. గతంతో పోలిస్తే ఆరోగ్యం కూడా కాస్త బాగానే ఉందని ఆయన తెలిపారు. ‘‘ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మా నాన్నను నిన్న సందర్శించా. అందరి ప్రార్థనలతో గతంలో కంటే ఆయన ఆరోగ్యం చాలా బాగుంది. స్థిరంగా కూడా ఉంది. చికిత్స కూడా స్పందిస్తున్నారు. తొందర్లోనే ఆయన పూర్తి ఆరోగ్యవంతుడిగా బయటికి వస్తారని గట్టిగా విశ్వసిస్తున్నాం’’ అని అభిజిత్ ముఖర్జీ ట్విట్టర్ వేదికగా తెలిపారు.

* సచివాలయంలోని అతి పురాతనమైన దేవాలయాన్ని, మసీదును కూల్చడం సీఎం కేసీఆర్ దుర్మార్గపు పాలనకు నిదర్శనమని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి దుయ్యబట్టారు. కేసీఆర్ కేవలం తన మూఢనమ్మకాల కోసం వీటిని కూల్చివేయించారని ఆరోపించారు. ఈ అంశాలను విస్తృతంగా జనాల్లోకి తీసుకెళతామని చెప్పారు. కాంట్రాక్టర్లు ఇచ్చిన కమీషన్లతో గ్రేటర్‌ ఎన్నికల్లో గెలవాలని కేసీఆర్‌ చూస్తున్నారని ఆరోపించారు. అందుకే బస్తీ దవాఖానాల పేరుతో నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు.

* మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి రెండో వర్ధంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ సహా ప్రముఖ నేతలు ఆయనకు నివాళి అర్పించారు. ఆయన దేశానికి చేసిన సేవలను ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. ‘దేశానికి ఆయన చేసిన ఎనలేని సేవలు, భారత్‌ను ముందుండి నడిపించిన విధానాన్ని దేశ ప్రజలు ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటారు’ అని మోదీ ట్వీట్‌ చేశారు. హోం శాఖ మంత్రి అమిత్‌ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ సైతం నివాళులు అర్పించారు.

* అమెరికా ఉపాధ్యక్ష పదవికి పోటీలో ఉన్న డెమొక్రటిక్‌ నాయకురాలు కమలా హారిస్‌ భారత ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. గడిచిన దశాబ్దాల్లో భారత్‌ సాధించిన పురోగతి ప్రస్తుతం ప్రతిబింబిస్తోందని అభిప్రాయపడ్డారు. ‘న్యాయం కోసం చేసిన పోరాటంలో మన ప్రజలు చెప్పుకోదగిన పురోగతి సాధించారు. గత 74 సంవత్సరాల పురోగతి ప్రతిబింబిస్తోంది’ అని కమలా హారిస్‌ ట్విటర్‌లో వెల్లడించారు.

* స్వాతంత్ర్య దినోత్సవ కేవలం భారత్‌లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మిన్నంటాయి. 74వ స్వాతంత్ర్య దినోత్సవ సంబరాలను పురస్కరించుకొని ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పర్యాటక కేంద్రాలు కూడా త్రివర్ణ శోభితంలో ముస్తాబయ్యాయి. అటు నయాగరా జలపాతం నుంచి బుర్జ్‌ ఖలీఫా వరకు ప్రఖ్యాతిగాంచిన ప్రదేశాలు భారత త్రివర్ణ పతాక రంగుల్లో మెరిసిపోయాయి. న్యూయార్క్‌లోని ఎంపైర్‌ స్టేట్‌ భవనం మూడు రంగుల్లో కళకళలాడింది. స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా ఆయా దేశాలు సంఘీభావం ప్రకటించాయి.

* జమ్మూలోని వైష్ణో దేవాలయం దాదాపు 5 నెలల తర్వాత తెరుచుకుంది. ఆదివారం నుంచి భక్తుల దర్శనానికి అనుమతించారు. కరోనా ప్రబలుతుండటంతో మార్చి 18న ఆలయాన్ని మూసివేశారు. కాగా, ఆదివారం నుంచి దర్శనానికి అనుమతిస్తున్నట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు. కరోనాను దృష్టిలో ఉంచుకొని కొన్ని ఆంక్షలతో భక్తుల దర్శనానికి అనుమతిస్తున్నట్లు అధికారులు తెలిపారు. మొదటి వారంలో 2000 మందికి అనుమతిస్తున్నట్లు పేర్కొన్నారు.

* మహీంద్రా సరికొత్త ఎస్‌యూవీ థార్‌ను మార్కెట్లోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని మహీంద్రా తన వెబ్‌సైట్‌లో ఉంచింది. అక్టోబర్‌ మొదటి వారంలో ఈ ఎస్‌యూవీ మార్కెట్లోకి రానుంది. డిజైన్‌లో పెద్దగా మార్పులు చేయకపోయినా.. అదనపు హంగులను సమకూర్చింది. సరికొత్త ఎల్‌ఈడీ టెయిల్‌ లైట్లు, అలాయ్‌ వీల్స్‌, ఫ్రంట్‌ ల్యాంప్స్‌ను ఇచ్చింది. ఈ కారులో సాఫ్ట్‌టాప్‌, హార్డ్‌టాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. కారు బాడీ ఫ్రేమ్‌ సరికొత్త ప్లాట్‌ఫామ్‌పై నిర్మించడం విశేషం.

* టీమ్‌ ఇండియా మాజీ కెప్టెన్‌, మిస్టర్‌ కూల్‌ మహేంద్ర సింగ్‌ ధోని అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. ఆయనతో పాటు మరో క్రికెటర్‌ సురేశ్‌రైనా కూడా రిటైర్మెంట్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో సినీ, రాజకీయ ప్రముఖులు ధోనితో ఉన్న అనుబంధాన్ని, దేశానికి అతను చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. దర్శకుడు రాజమౌళి, మహేశ్‌బాబు, మోహన్‌లాల్‌, కమల్‌హాసన్‌, పృథ్వీరాజ్‌ సుకుమార్‌‌, మాధవన్‌, అనుష్క, రానా తదితరులు సామాజిక మాధ్యమాల వేదికగా ధోని సేవలను కొనియాడారు.

* వచ్చే ఏడాది ఆరంభంలో కరోనా వ్యాక్సిన్ వచ్చే అవకాశం ఉందని అమెరికా అంటువ్యాధుల చికిత్స నిపుణుడు ఆంటోని ఫౌచి అన్నారు. సురక్షితమైన పద్ధతిలో వచ్చే ఏడాది ఆరంభం లేదా ఈ ఏడాది చివరి నాటికి వ్యాక్సిన్‌ అందుబాటులోకి తీసుకొస్తే ఆ తర్వాత ప్రపంచాన్ని సాధారణ స్థితికి తీసుకురావచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. అమెరికాకు చెందిన పీబీఎస్‌ అనే వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

* ‘నీలి నీలి ఆకాశం.. ఇద్దామనుకున్నా’ అంటూ ప్రదీప్‌, అమృత అయ్యర్‌లు యువ హృదయాలను కొల్లగొట్టేశారు. వారిద్దరూ కీలక పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘30 రోజుల్లో ప్రేమించటం ఎలా’. మున్నా దర్శకుడు. ఈ వేసవిలో ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ చిత్రం లాక్‌డౌన్‌ కారణంగా వాయిదా పడింది. అయితే, అంతకు ముందే అగ్ర కథానాయకుడు మహేశ్‌బాబు విడుదల చేసిన ‘నీలి నీలి ఆకాశం..’ పాట మాత్రం యూట్యూబ్‌ వేదికగా దూసుకుపోతోంది. తాజాగా ఈ పాట 200 మిలియన్‌ వ్యూస్‌(అన్ని ఫ్లాట్‌ఫాంలు కలిపి)తో దక్షిణాదిలో మరే పాట సాధించని రికార్డును సృష్టించింది.