Fashion

మెట్టెల సవ్వడి అందాలు…

మెట్టెల సవ్వడి అందాలు…

వివాహితులైన భారతీయ స్త్రీ తప్పని సరిగా ధరించే ఆభరణాల్లో మాంగల్యం, నల్లపూసలు, కాలికి మెట్టెలు ముఖ్యం. అందమైన మెట్టెల వెనక చక్కని పురాణ గాథ ఉంది. దక్షుడు తన అల్లుడైన శివుడిని అవమానిస్తాడు. భర్తకు జరిగిన అవమానానికి కోపోద్రిక్తురాలైన దాక్షాయని తన కాలివేలిని భూమిపై రాసి నిప్పు సృష్టించి దహనమై పోయింది. ఆ కథ ఆధారంగా కాలి బొటన వేలి పక్కన వేలు స్త్రీలకు ఆయువు పట్టు అని దాన్నుంచి విద్యుత్తు ప్రసరిస్తూ ఉంటుందనీ ఆ వేలు నేలకు తగలటం మంచిది కాదని మెట్టెలు ధరించే సంప్రదాయం అలా మొదలైందని పెద్దలు చెబుతారు. వైదిక పురాణ కాలం నుంచి మెట్టెలు ధరిస్తున్నారు స్త్రీలు. సాధారణంగా వీటిని వెండితో తయారు చేస్తారు. ఈ ఆభరణాన్ని ఒక్క ప్రాంతంలో ఒక్కోలా పిలుస్తారు. ఒరిస్సాలో ‘ ముణ’ అని, ఉత్తరప్రదేశ్‌లో బిబియా, రాజస్థాన్‌లో జోరియా అని, మహారాష్ట్రలో జౌలి, మస్లి ఇలా ఎన్నో పేర్లతో పాదాలకు ధరించే ఆభరణాలున్నాయి. గుజరాత్‌లో వీటి వాడకం ఎక్కువ. అంగుత, బెటియ, ఫెరవపొలాడీ, మస్ల్, తొడవ, కలదే అన్న పేర్లతో పిలుస్తారు. వీటిలో బెటియ, కొలడాలను ముస్లింలు ధరిస్తారు. హిమాచల్ ప్రదేశ్, జమ్ము కాశ్మీర్‌లలో ఇవే పేర్లతో ఉంటాయి. హిమాచల్ ప్రదేశ్‌లో అంగుతాదే అనే వెండి రింగును పొడవుగా ఉండే వేలికి ధరిస్తారు. ఆంధ్రప్రదేశ్‌లో సాదాగా ఉండే రింగుతో చుట్టులు ఒకే వేలికీ లేదా మూడు నాలుగు వేళ్లకు కూడా పెట్టుకుంటారు. గుండ్రంగా ఉండే వాటిని బొటన వేలు పక్కవేలికి, వాటికంటే చిన్నగా ఉండే వాటిని పిల్లేళ్లు అని పిలిచేవి నాలుగో వేలికీ పెట్టుకుంటారు. వీటికి చిన్న మువ్వలు కూడా ఉంటాయి. మెట్టెలు రెండున్నర చుట్లతో ఉంటే అది వివాహం అయినట్లు గుర్తు. కర్నాటకలో కలుంగార్ కాలి రెండో వేలికి పెట్టుకుంటారు. కేరళ వధువులు ‘ మించి’ అనే పేరుతో పిలిచే వెండి రింగులు ధరిస్తారు. మన రాష్ట్రంలో పెండ్లి సందర్భంలో పెళ్లికూతరు మేనమామ వరసయ్యే వాళ్లు మెట్టెలను వధువుకు బహుకరిస్తారు. ఎన్ని ఆధునికమైన డిజైన్‌లతో ఎన్ని రకాల ఆభరణాలు వచ్చినా ఈ సంప్రదాయ ఆభరణం ప్రాధాన్యం ఎంత మాత్రం తగ్గలేదు. అందమైన పాదాలకు మరింత అందాన్ని ఇచ్చే ఈ మెట్టెలు అటు సంప్రదాయానికి, ఇటు సౌందర్యం కోసం అమ్మాయిలు ధరిస్తూనే ఉన్నారు.