Agriculture

తుంగభద్ర డ్యాం 8గేట్లు విడుదల

తుంగభద్ర డ్యాం 8గేట్లు విడుదల

భారీ వర్షాలతో తుంగభద్ర నదిలో వరద పరవళ్లు తొక్కుతోంది. గత రెండు వారాలుగా కర్నాటకలోని తుంగభద్ర నది పరివాహక ప్రాంతాల్లో మంచి వర్షాలు కురవడంతో.. తుంగభద్ర నదిలో వరద కొనసాగుతోంది. హోస్పేట వద్ద ఉన్న తుంగభద్ర డ్యామ్ కు ఎగువ ప్రాంతాల నుండి వరద పోటెత్తుతుండడంతో డ్యామ్ పూర్తి గా నిండిపోయింది. తుంగభద్ర జలాశయం గరిష్ట నీటిమట్టానికి  చేరుకోవడంతో నిల్వ చేసే అవకాశం లేక.. గేట్లు ఎత్తివేశారు. భారీ వర్షాలు కురుస్తుండడంతో రెండు రోజులుగా తుంగభద్ర నది పరివాహక ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. డ్యామ్ కు దిగువన ఉన్న తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలను హెచ్చరిస్తూ అధికారిక లేఖలతోపాటు..  వాట్సప్ లో మెసేజీలు పంపిస్తున్నారు. ఇవాళ ఉదయం తుంగభద్ర బోర్డు అధికారులు ప్రాజెక్టు స్పీల్‌వే 8 గేట్లు ఎత్తి తుంగభద్ర నదిలోకి నీరు విడుదల చేశారు. తుంగభద్ర జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 1633 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 1631.62 అడుగులు మెయిన్ టెయిన్ చేస్తున్నారు. పూర్తి స్థాయి నీటి నిల్వ110.85 టీఎంసీలైతే.. ప్రస్తుత నీటి నిల్వ 95.60 టీఎంసీలుగా ఉంది. ఎగువ నుండి తుంగభద్ర డ్యామ్ కు  ఇన్‌ఫ్లో 49,073 క్యూసెక్కులు.. వస్తుండగా.. 8 గేట్లు అడుగు మేర ఎత్తి  6,963 క్యూసెక్కులు..  విడుదల చేస్తున్నారు. వర్షాలు కురుస్తుండడంతో వరద పెరిగే కొద్దీ నీటి విడుదలను కూడా పెంచుతామని అధికారులు చెబుతున్నారు. తుంగభద్ర డ్యామ్ నుండి విడుదల చేసిన ఈ నీరు దిగువన మంత్రాలయం సమీపంలో ఉన్న ఆర్డీఎస్ మీదుగా.. కర్నూలు.. గద్వాలకు మధ్యలో నిర్మించిన సుంకేసుల ప్రాజెక్టుకు చేరుకుంటుంది. సుంకేశుల డ్యామ్ ఇప్పటికే నిండిపోవడంతో సుంకేసుల డ్యామ్  గేట్లను ఎత్తి 2,800 క్యూసెక్కుల నీటిని దిగువన శ్రీశైలం ప్రాజెక్టుకు విడుదల చేస్తున్నారు.