Devotional

మాంగల్యధారణ మంత్రాల అర్థం అది అన్నమాట!

మాంగల్యధారణ మంత్రాల అర్థం అది అన్నమాట!

పురోహితుడు మాంగల్యాన్ని చేత ధరించి, అక్షింతలు పెద్దలకు అందిస్తారు. పెళ్లికొచ్చిన ముత్తైదువల తాళిబొట్టుకు మాంగల్యాన్ని తాకిస్తారు. దాంతో పెళ్లికొచ్చిన పెద్దలందరూ ఆ మాంగల్యాన్ని స్పృశించి, ఆశీర్వదించినట్లు అవుతుంది. భార్య మెడలో మాంగల్యం భర్త ఆయుర్ధాయాన్ని కాపాడుతుంది. తాళిబొట్టుని వధువు పట్టుకుని ఉంటుంది. ఆమె జడను కన్నె పిల్లలు ఎత్తి పట్టుకుంటారు. వరుడు లేచి నిలబడి వధువు మెడలో మంగళసూత్రానికి మూడుముళ్లు వేస్తాడు. “మాంగల్య తంతునానేన మమ జీవన హేతునా…..కంఠే బధ్నామి సుభగే త్వం జీవ శరదాం శతమ్‌” నా జీవనానికి హేతువైన మాంగల్యాన్ని ఈ పసుపు తాడుతో నీ మెడలో కడుతున్నాను. నీవు చల్లగా నూరేళ్లు జీవించు అని ఈ శ్లోకానికి అర్థం. ఈ శ్లోకాన్ని చదువుతూ వధువు మెడలో మంగళసూత్రాన్ని వరుడు కడతాడు. మూడుముళ్లు వేస్తాడు. మంగళసూత్రంలోని మూడుముళ్లు మనోవాక్కాయులకు, స్థూల సూక్ష్మకారణ శరీరాలకు చిహ్నం. మూడుముళ్లు వేసిన తర్వాత ఆ ముడులకు వరుడు కుంకుమ బొట్టు పెట్టి గౌరవిస్తాడు. వధువు పక్కన పీటపై కూర్చుని సభలోని పెద్దలను ఉద్దేశించి…. “సుమంగళీరియం వధూరిమాం సమేత పశ్యాత మస్తె దత్వా యాధాస్తం విపరేతన” ఈమె శుభంకరమైన, మంగళప్రదమైన చిహ్నాలతో కూడినది. రండి. మీరంతా ఈమెను దర్శించండి. ఈమెను సౌభాగ్యవతి అయ్యేటట్లు ఆశీర్వదించండి అని వరుడు కోరతాడు. పెద్దలంతా వధూవరులను మంగళాక్షింతలతో ఆశీర్వదిస్తారు.