Movies

అతని పద్మశ్రీ లాక్కోండి

అతని పద్మశ్రీ లాక్కోండి

బాలీవుడ్‌ దర్శక-నిర్మాత కరణ్‌ జోహార్‌కు భారత ప్రభుత్వం ఇచ్చిన పద్మశ్రీ పురస్కారాన్ని వెనక్కి తీసుకోవాలని నటి కంగన రనౌత్‌ కోరారు. అంతర్జాతీయ వేదికగా తనని బెదిరించారని, నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పూత్‌ కెరీర్‌ను నాశనం చేయడం ద్వారా ఆయన ఆత్మహత్య చేసుకునేలా పరోక్షంగా ప్రేరేపించారని కంగన ఆరోపించారు. అంతేకాదు, భద్రతా దళాలను కించపరిచేలా ఆయన సినిమా తీశారని మండిపడ్డారు. ‘‘భారత ప్రభుత్వానికి ఇదే నా విన్నపం. దయచేసి ఆయనకు ఇచ్చిన పద్మశ్రీ పురస్కారాన్ని వెనక్కి తీసుకోండి. ఎందుకంటే ఆయన నన్ను బెదిరించారు. ఇండస్ట్రీ వదిలి వెళ్లమని హెచ్చరించారు. సుశాంత్‌ కెరీర్‌ నాశనం కావడానికి ఆయనే కారణం. పాకిస్థాన్‌కు అనుకూలంగా మన భద్రతా దళాలను కించ పరిచేలా జాతి వ్యతిరేక చిత్రాన్ని తీశారు’ అని ట్వీట్‌ చేశారు. ఈ ట్వీట్‌ బాలీవుడ్‌లో చర్చనీయాంశమైంది. మరోవైపు కరణ్‌ బ్యానర్‌పై నిర్మించిన ‘గుంజన్‌ సక్సేనా: ది కార్గిల్‌ గర్ల్‌’ చిత్రంపై గుంజన్‌ సహ అధ్యాయి ఫ్లైట్‌ లెఫ్టినెంట్‌(రిటైర్డ్‌) శ్రీవిద్యా రాజన్‌ మండిపడ్డారు. తాజా చిత్రంలో నిజాలను తొక్కి పెట్టారని ఆరోపించారు. సినిమాలో చూపించినట్లు కార్గిల్‌ యుద్ధభూమిలో తొలిసారి ఎగిరిన మహిళా పైలెట్‌ గుంజన్‌ కాదని, అది తానేని తెలిపారు. అదే విధంగా శత్రు సైనికులతో పోరాట సన్నివేశాలు కూడా నిజ జీవితంలో జరగలేదని పేర్కొన్నారు.