ScienceAndTech

వాట్సాప్‌కు చేదుకబురు చెప్పిన టెలీగ్రామ్

వాట్సాప్‌కు చేదుకబురు చెప్పిన టెలీగ్రామ్

మెసేజింగ్‌ యాప్‌ అనగానే గుర్తొచ్చేది వాట్సాపే అయినప్పటికీ.. ఎక్కువ సైజు ఉన్న ఫైల్స్‌ను పంపుకొనే వీలుండే యాప్‌ మాత్రం టెలీగ్రామే. అంతేకాదు.. వేల సంఖ్యలో సభ్యులు ఇందులో గ్రూపులు కట్టొచ్చు. అందుకే చాలామంది ఫోన్లలో ఇది అంతర్భాగమైపోయింది. దీనికీ ఆదరణ అంతకంతకూ పెరుగుతోంది. ఈ క్రమంలో ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను తెస్తున్న టెలీగ్రామ్‌.. తన ఏడో వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని వీడియో కాల్స్‌ ఫీచర్‌ను తీసుకొస్తుట్లు ప్రకటించింది. ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ వినియోగదారులకు ఈ సౌలభ్యం కల్పిస్తున్నట్లు తెలిపింది. ప్రస్తుతానికి ఒకరితో ఒకరు మాత్రమే మాట్లాడే వెసులుబాటు తీసుకురాగా.. భవిష్యత్‌లో గ్రూప్‌ వీడియో కాలింగ్‌ సదుపాయం కూడా తీసుకురానున్నట్లు కంపెనీ పేర్కొంది. ఓ వైపు మొబైల్‌లో ఇతర టాస్కులు చేస్తూనే వీడియో కాల్‌లో మాట్లాడుకునేందుకు వీలుగా పిక్చర్‌ ఇన్‌ పిక్చర్‌ మోడ్‌ సదుపాయం తీసుకొచ్చామని టెలీగ్రామ్‌ చెబుతోంది. అవసరమనుకుంటే వీడియో కాల్‌ నుంచి వాయిస్‌ కాల్‌కు కూడా మారొచ్చని పేర్కొంది. ఎండ్‌-టు- ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌తో మీ వీడియో కాల్‌ సెక్యూర్‌ అని వివరించింది. 2013 లాంచ్‌ అయిన ఈ యాప్‌ 2017లో ఆడియో కాల్స్‌ సదుపాయాన్ని ప్రవేశపెట్టింది. వీడియో కాల్స్‌ ఫీచర్‌ను ఉపయోగించాలంటే మీ యాప్‌ను అప్‌డేట్‌ చేసుకోవాల్సి ఉంటుంది. అందరు యూజర్లకు అందుబాటులోకి రావడానికి కొంత సమయం పట్టొచ్చు. కరోనా కారణంగా వర్క్‌ఫ్రమ్‌ హోం సంస్కృతి పెరగడం, వీడియో కాల్స్‌కు డిమాండ్‌ పెరిగిన నేపథ్యంలో టెలీగ్రామ్‌ ఈ సదుపాయం తీసుకురావడం గమనార్హం.