NRI-NRT

మరో 13దేశాలకు వందేభారత్ విమానాలు

మరో 13దేశాలకు వందేభారత్ విమానాలు

కొవిడ్-19 కట్టడిలో భాగంగా విధించిన లాక్ డౌన్ తో విదేశాలకు విమాన సేవలు రద్దయ్యాయి. రెండు నెలల క్రితం లాక్ డౌన్ నిబంధనల సడలింపుతో పలు దేశాలకు ఎయిర్ బబుల్ ఒప్పందం ద్వారా భారత్ విమాన సేవలను పునరుద్ధరించింది. ఇందులో భాగంగా జులై నుంచి అమెరికా, బ్రిటన్ , ఫ్రాన్స్ , జర్మనీ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ), ఖతార్ , మాల్దీవుల కు విమాన సేవలను ప్రారంభించింది. తాజాగా ఎయిర్ బబుల్ ద్వారా విమాన సేవలు పునరుద్ధరించేందుకు మరో 13 దేశాలతో (ఆస్ట్రేలియా, ఇటలీ, జపాన్ , న్యూజిలాండ్, నైజీరియా, బెహ్రయిన్, ఇజ్రాయెల్, కెన్యా, ఫిలీప్పీన్స్, రష్యా, సింగపూర్, దక్షిణ కొరియా, థాయ్ లాండ్) చర్చలు జరుపుతున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ వెల్లడించారు. ‘‘వందే భారత్ మిషన్ ద్వారా మరిన్ని దేశాలకు చేరువ కావాలని భారత్ భావిస్తోంది. ఇప్పటికే పలు దేశాలకు విమాన సర్వీసులు నిర్వహిస్తున్నాం. దీనిని మరింత ముందుకు తీసుకెళ్లాలని భావిస్తున్నాం. ఇందుకు సంబంధించి 13 దేశాలతో చర్చలు జరుపుతున్నాం. ఈ చర్చలు ఫలప్రదమైతే ఆయా దేశాల్లో ఉండిపోయిన భారతీయులు స్వదేశానికి వచ్చేందుకు మార్గం సుగమమవుతుంది’’ అని మంత్రి తెలిపారు. వాటితో పాటు పొరుగుదేశాలైన శ్రీలంక, బంగ్లాదేశ్ , ఆఫ్ఘనిస్థాన్, నేపాల్, భూటాన్ లతో కూడా ఎయిర్ బబుల్ ప్రయాణానికి సంబంధించి చర్చలు జరుపుతున్నట్లు మంత్రి తెలిపారు. అలానే మరిన్ని దేశాలకు ఈ సేవలను విస్తరించాలనే ఆలోచనలో ఉన్నామని, విదేశాల్లో ఉండి స్వదేశానికి రావాలనుకునే ప్రతి ఒక్క భారతీయ పౌరుడిని తీసుకొస్తామని మంత్రి వెల్లడించారు. కరోనా విజృంభణతో స్తంభించిపోయిన విమాన సర్వీసులను మే 25 నుంచి దేశీయంగా పునరుద్ధరించిన సంగతి తెలిసిందే.