Fashion

జ్ఞాపకాలకు మధురత అద్దే ఫోటోగ్రఫీ

జ్ఞాపకాలకు మధురత అద్దే ఫోటోగ్రఫీ

*ఒకప్పుడు రీల్స్‌తో ఫోటోలు తీసే స్థాయి నుంచి ఇప్పుడు చిన్న మెమొరీ కార్డుతో వందలాది ఫోటోలు తీసే స్థాయికి ఫోటోగ్రఫీ చేరుకుంది. ఇంతటి పరిజ్ఞానం వెనుక ఎందరో శాస్త్రవేత్తల అధ్యయనాలు, పరిశోధనాలు, నిరంతర కృషి దాగివుంది. ఆ మహానీయులను ఒక్కసారి గుర్తు చేసుకోవడమే ఈ అంతర్జాతీయ ఫోటోగ్రఫీ దినోత్సవం ముఖ్యోద్దేశం.
*మనిషి జీవిన ప్రస్థానంలో ప్రతీ రోజు ఓ మధుర జ్ఞాపకం ఆ 24 గంటల్లో సరదాలు, సంతోషాలు.. వీటిలో కొన్ని అప్పటికప్పుడు మరచిపోయేవైతే.. మరికొన్ని జీవితాంతం భద్రంగా దాచుకోవాల్సినవి.
*మరి కరిగేకాలంలో చెదిరిపోని స్మృతులకు ప్రతిబింబాలు ఫోటోలు. అలనాటి జ్ఞాపకాలను మళ్లీ మళ్లీ తనివితీరా వీక్షించుకునే అవకాశాన్ని ఇచ్చే తీపిగుర్తులు ఫోటోలు. మాట, పదం కొన్నాళ్లకు మరచిపోతాం.. కానీ ఓ ఫోటోను చూస్తే ఎంతోకాలం మదిలో ముద్రవేసుకుపోతుంది.
*అంతటి ప్రాముఖ్యత కలిగిన ఫోటోగ్రఫీకి కూడా ఓ రోజు వుందన్న సంగతి తెలుసా.. ఫ్రాన్స్‌కు చెందిన లూయిస్ జే.ఎం డాగ్యూరే 1837లో ఫోటోగ్రఫీ పద్ధతిని కొనుగొన్నారు. అంతకు ముందు 1826లోనే ఫ్రాన్స్‌కే చెందిన జోసెఫ్ నైసిఫోరా నీప్సి ఫోటోగ్రఫీ చరిత్రలో తొలిసారిగా ఛాయాచిత్రాన్ని తయారు చేశారు.
*ఇంటి వెనుక పెరట్లో 8 గంటల పాటు ఛాయాచిత్రాన్ని సిల్వర్ అణువులు వున్న ప్లేట్‌పై ఆయన బంధించారు. కానీ దానిని ఎక్కువ రోజులు కాపాడలేకపోవడంతో.. డాగ్యూరే రూపొందించిన విధానానికి ఫ్రెంచ్ అకాడమీ ఆఫ్ సైన్సెస్‌ ఆమోదముద్ర వేసింది.
*రసాయనాలతో రూపొందించిన ప్లేటుపై కాంతిచర్యతో ఓ రూపాన్ని బంధించడమే ఫోటోగ్రఫీ. ఈ పదం గ్రీకు భాష నుంచి వచ్చింది. ఫోటో అంటే చిత్రం.. గ్రఫీ అంటే గీయడమని అర్థం.
*1839 ఆగస్టు 19న ఫ్రాన్స్ ప్రభుత్వం ఫోటోగ్రఫీపై పేటెంట్ హక్కులు కొనుగోలు చేసి.. దానిని ప్రపంచానికి ఉచితంగా అందించింది. అందుకే ప్రతి ఏటా ఆగస్టు 19ని అంతర్జాతీయ ఫోటోగ్రఫీ దినోత్సవంగా జరుపుకుంటున్నారు.
*ఇక మనదేశంలో కేవలం బ్రిటీష్ ఉన్నతాధికారులు, జమీందార్లు, సైనికులు మాత్రమే ఫోటోగ్రీఫీని ఉపయోగించేవారు. 1877 నుంచి దీనిని సామాన్యులకు అందుబాటులోకి తెచ్చారు.
*మొదట్లో ఫోటోగ్రఫీ కెమెరాలు చాలా పెద్దగా ఉండేవి. కాలక్రమంలో ఎయిమ్ అండ్ షూట్ కెమెరాలు, ఫీల్డ్ కెమెరాలు, డోనల్ కెమెరాలు, డిజిటల్ సింగిల్ లేన్స్ రిఫ్లెక్ట్ , ఫ్లై కెమెరాలు అందుబాటులోకి వచ్చాయి.
*ఒకప్పుడు రీల్స్‌తో ఫోటోలు తీసే స్థాయి నుంచి ఇప్పుడు చిన్న మెమొరీ కార్డుతో వందలాది ఫోటోలు తీసే స్థాయికి ఫోటోగ్రఫీ చేరుకుంది. ఇంతటి పరిజ్ఞానం వెనుక ఎందరో శాస్త్రవేత్తల అధ్యయనాలు, పరిశోధనాలు, నిరంతర కృషి దాగివుంది. ఆ మహానీయులను ఒక్కసారి గుర్తు చేసుకోవడమే ఈ అంతర్జాతీయ ఫోటోగ్రఫీ దినోత్సవం ముఖ్యోద్దేశం.