Devotional

పొలాల అమావాస్య అంటే ఏమిటి?

పొలాల అమావాస్య అంటే ఏమిటి?

*శ్రావణ బహుళ అమావాస్యను ‘పొలాల అమావాస్య’ అంటారు. పొలాల అమావాస్యకు హిందు సాంప్రదాయంలో ఎంతో విశిష్టత వుంది. స్త్రీలు తమ సౌభాగ్యం కోసం, తమ పిల్లల యోగ, క్షేమాల కోసం, తమ కుటుంబంకోసం వ్రతాలు ఆచరించడం మనకు అనాది నుంచి వస్తున్న ఆచారం. ఈ ‘పోలాల అమావాస్య వ్రతం’ ప్రత్యేకంగా సంతాన సంరక్షణ కోసం నిర్ధేశించబడినది. పెళ్లయి చాలాకాలమయినా సంతానం కలుగని స్త్రీలు, సంతానవతులైన స్త్రీలు ఈ వ్రతాన్ని తప్పకుండా ఆచరించాలి.
*పొలాల అమావాస్య అంటే ఏమిటి..?
ఈ వ్రతాన్ని శ్రావణ అమావాస్యనాడు చేసుకోవాలి. పూజచేసే చోట ఆవుపేడతో అలికి, వరిపిండితో అందమైన ముగ్గువేసి, ఒక కందమొక్కను వుంచి, పసుపుకొమ్ము కట్టిన నాలుగు తోరాలను అక్కడ వుంచి, ముందుగా వినాయకుని పూజించి, ఆతర్వాత ఆ కంద మొక్కలోకి మంగళగౌరీదేవినిగానీ, సంతానలక్ష్మీదేవినిగానీ ఆవాహనచేసి షోడశోపచారాలతో అర్చించి, తొమ్మిది పూర్ణం,బూరెలు , గారెలు, తొమ్మిదిరకాల కూరగాయలతో చేసిన పులుసు ఆమెకు నైవేద్యంగా సమర్పించాలి. ఆ తర్వాత బహుసంతానవతి అయిన పెద్దముత్తయిదువును పూజించి, కొత్తచీర, రవికల గుడ్డ పెట్టి, నైవేద్యం పెట్టని తొమ్మిది పూర్ణంబూర్లు, ఒక తోరాన్ని అమ్మవారికి వాయనంగా సమర్పించి దీవెనలు అందుకోవాలి.
*ఆడపిల్ల సంతానంగా కావాలంటే ఏం చేయాలి
ఆ తర్వాత ఒక తోరాన్ని కందమొక్కకు కట్టి, మరొకటి తను మెడలో కట్టుకుని మిగిలిన తోరాన్ని తన ఆఖరు సంతానం మొలతాడుకు కట్టాలి. అలా చేస్తే.. ఆమె సంతానం ఆయురారోగ్య, ఐశ్వర్యాలతో పది కాలాలపాటు చల్లగా ఉంటారు. ఆడపిల్ల కావాలనుకునేవాళ్ళు గారెలు, మగపిల్లవాడు కావాలనుకునేవాళ్ళు బూరెలు అమ్మవారికి సమర్పిస్తారు. ఇక పూర్ణంబూరెలు ఎందుకు వాయనంగా ఇవ్వాలంటే… పూర్ణంబూరె పూర్ణగర్భానికి చిహ్నం. అందులోని పూర్ణం, గర్భస్థశిశువుకు చిహ్నం. స్త్రీకి మాతృత్వం కూడా అంత మధురమైనది కనుక పూర్ణబూరెలు వాయనంగా ఇవ్వాలనే నియమాన్ని విధించారు మన పూర్వులు.
*గ్రామాల్లో పోలేరమ్మకు పూజలు
ఇంకా పనస ఆకులతో బుట్టలు కుట్టి ఇడ్లీ పిండి అందులో నింపి ఆవిరి మీద ఉడికించి అమ్మవారికి నైవేద్యం పెడతాము. ఈ పోలేరమ్మకు గౌరీదేవి పూజ చేస్తారు. నివేదనగా నవకాయ కూర చేస్తారు, ఇంకా పప్పు తాలికలు, పాలతాలికలు, మినప కుడుములు చేసి అమ్మవారికి నేవేదిస్తారు.వ్యవసాయం కలవారు ఎద్దులకు పూజ చేస్తారు. అదే వ్యవసాయం లేనివారు ఎద్దు బొమ్మలు మట్టితో చేసి వాటికి పూజ చేస్తారు. ఇక ఇదే రోజున పోలేరమ్మను ఆరాధించే ఆచారం కూడా చాలా ప్రాంతాలలో కనిపిస్తూ వుంటుంది. గ్రామీణ ప్రాంతాలకి చెందిన ప్రజలు ‘పోలాంబ’ పేరుతో అమ్మవారిని పూజిస్తారు. ఆమెకి ఇష్టమైన నైవేద్యాలతో పాటు చీరసారెలు సమర్పిస్తారు. ఈ విధంగా చేయడం వలన ఆ తల్లి అనుగ్రహం లభిస్తుందనీ … ఫలితంగా వర్షాలు పంటలకి అనుకూలంగా కురుస్తాయని విశ్వసిస్తుంటారు.
*పితృదేవతల ఆశీస్సులు
జీవితం ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సుఖశాంతులతో కొనసాగాలంటే పితృదేవతల ఆశీస్సులు కావాలి. అలాగే వర్షాలు బాగా కురవాలంటే గ్రామదేవత అయిన పోలేరమ్మ అనుగ్రహం వుండాలి. వర్షాలు పడితే వ్యవసాయ పనులు చేయడానికి అనుకూలంగా ఎద్దులు ఆరోగ్యంగా వుండాలి. పంటలు బాగా పండినప్పుడే ఆవులకు మేత దొరుకుతుంది. ఫలితంగా లభించే పాలు ఆ కుటుంబ సభ్యులను ఆరోగ్యపరంగాను … ఆర్ధికంగాను ఆదుకుంటాయి.తమ జీవనాధారానికి తోడ్పాటుని అందించే దేవతను … పెద్దలను … పశువులను పూజించే పర్వదినంగా పోలాల అమావాస్య కనిపిస్తుంది. గ్రామదేవతను ఆరాధిస్తూ … వ్యవసాయానికి సహకరించే పశువులను పూజించే పర్వదినం కనుక ఇది ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో కనిపిస్తుంది. ప్రత్యేకతను సంతరించుకుని తన విశిష్టతను చాటుకుంటూ వుంటుంది.
*అసలు కథ ఏంటి..
ఈ వ్రతంలో ముఖ్యమైన కధ ప్రచురణలో వుంది అది “ఒక కుటుంబంలో ఏడుగురు కొడుకులు. అందరికీ పెళ్లిళ్ళు చేస్తారు. అందులో ఏడో కోడలికి ఏట పిల్లాడు పుడతాడు. కానీ పోలాల అమావాస్యరోజు చనిపోతాడు. అలాగా ఆరు సంవత్సరాలు జరుగుతుంది. అప్పటికే ఆమె తోడికోడళ్ళు దేప్పటం మొదలుపెడతారు, ఆమె వలన వారు ఆ పండుగ జరుపుకోలేకపోతున్నారు అని. ఆ బాధ భరించలేక ఏడవ సంవత్సరం పిల్లాడు కోన ఊపిరితో ఉండగానే అతడిని ఒక చాపలో చుట్టేసి పెడుతుంది. అందరూ పూజ చేసుకుంటారు. అది అయ్యాక ఆమె ఆ బాబుని భుజం మీద వేసుకుని స్మశానానికి ఏడుస్తూ వెళ్తుంది. అదిచూసిన పార్వతీ పరమేశ్వరులు వృద్ధ దంపతుల రూపంలో ఎదురయ్యి “ఎవరమ్మా నీవు? ఎవరా బాబు? ఎందుకు ఏడుస్తున్నావు?” అనిఅడుగుతారు.దానికి ఆమె “ఎవరైతే ఏమిటమ్మ మీరు ఆర్చేవారా తీర్చేవారా?” అని అడుగుతుంది. దానికి వారు “మేమే ఆర్చేవారము తీర్చేవారము చెప్పవమ్మా” అంటారు. ఆమె తన గోడు చెప్పుకుంటుంది. వారు ఓదార్చి అంతా శుభం కలుగుతుంది అని చెప్పి వెళ్ళిపోతారు.
*ప్రతి ఏటా పొలాల అమావాస్య
అప్పుడు ఆమె భుజం మీద ఉన్నా బిడ్డతో సహా ఇదివరకు చనిపోయిన బిడ్డలు కూడా లేచి వచ్చేస్తారు. వారిని చూసిన ఆశ్చర్యంలో ఆ దంపతులను చూద్దాం అని తిరిగేసరికి వారు కనబడరు. అప్పుడు అది పార్వతీ పరమేశ్వరులు అని తెలుసుకుని ఆనందంగా ఇంటికి వెళ్ళిపోతుంది. అక్కడ ఆమె తోడికోడళ్ళు ఈమె అదృష్టానికి అబ్బురపోయి క్షమార్పణ చెప్పుకుంటారు. అప్పటి నుండి ఆమె ప్రతి ఏట తప్పకుండా పోలాల అమావాస్య పూజ జరుపుకుంటుంన్నారు. ఈ కథ విన్న తరువాత చెప్పినవారు “పోలేరమ్మ నీ ఇల్లు పాలతో, నేతితో అలుకుతాను. నా ఇల్లు నీ చల్లని దీవనలతో అలుకు” అంటారు. వినడానికి కొంచం వింతగా వుంటుంది. కాని అది వారి పిల్లల మీద ప్రేమకు గుర్తుగా కనిపిస్తుంది . ఆ కథ అక్షింతలు చదివినవాళ్ళు,విన్నవాళ్లు తలపై వేసుకుంటారు. తరువాత పూజలో పసుపు కొమ్ముకు దారం కట్టి తోరం చేసి ఆ తోరాన్ని చేసి పూజ అయ్యాక ఆ పసుపుకోమ్మును చిన్నపిల్లలుకు కడతారు. అది వారికి రక్షగా వుంటుంది అని భావిస్తారు.