NRI-NRT

బర్మాలో వినాయక చవితి ఇలా చేస్తారు?

థాయిల్యాండ్‌లో వినాయక చవితి ఇలా చేస్తారు?

దేశదేశాన.. జైజై గణేశా..
వినాయక చవితి వచ్చిందంటే చాలు బొజ్జ గణపయ్యను తీరొక్క రూపుగా కొలిచి ముచ్చట తీర్చుకుంటాం.మన భారతావనిలోనే కాదు.. చవితి పండుగ పూట దేశదేశాల్లో జైజై గణేశా నినాదాలు మిన్నంటుతాయి. విఘ్నేశ్వరుడి ఆరాధన విచిత్రంగా, విశేషంగా ఉంటుంది. ఆ సంగతులేంటో ఓసారి చూసేద్దాం..
**హిందూ ధర్మంలోనే కాదు.. బుద్ధ, జైన ధర్మాల్లోనూ గణపతిని కొలిచే సంప్రదాయం ఉంది. ఆసియా ఖండంలో చాలా దేశాల్లో విఘ్నేశ్వర ఆరాధన శతాబ్దాలుగా నిర్విఘ్నంగా కొనసాగుతున్నది. టిబెట్‌, నేపాల్‌, శ్రీలంక, జపాన్‌ తదితర దేశాల్లో వినాయకుడికి ఆలయాలున్నాయి. మనం కొలిచే రూపానికి కాస్త అటూఇటూగా పార్వతీ తనయుడు పూజలు అందుకుంటున్నాడు.
*మయన్మార్‌లో బ్రహ్మగా
వినాయకుడు అంటే మనం శివపార్వతుల తనయుడిగా కొలుస్తాం. కానీ, మయన్మార్‌లో విఘ్నేశ్వరుడిని బ్రహ్మగా భావిస్తారు. అందుకు ఓ పురాతన గాథ కూడా ప్రచారంలో ఉంది. బ్రహ్మదేవుడి శిరస్సు భంగం అయినప్పుడు.. ఏనుగు తలను అతికించారనీ.. అలా బ్రహ్మ దేవుడు కాస్తా గజాననుడిగా మారాడని విశ్వసిస్తారు. నేటికీ మయన్మార్‌లో వినాయక చవితికి గణపతిని పరబ్రహ్మగా పూజిస్తుంటారు. వినాయక చవితి సమయంలో వారం రోజులు విశేష పూజలు నిర్వహిస్తారు.
*జపాన్‌లో జోడీ గణపతి
జపాన్‌లో గణపతిని కాంగిటెన్‌ అని పిలుస్తారు. షాటెన్‌, గణాబాచి, బినాయకటెన్‌ ఇలా పలు పేర్లతో పిలుస్తారు. టోక్యోలో అతి పురాతన బౌద్ధ ఆలయాల్లో కాంగిటెన్‌ ఆలయమూ కనిపిస్తుంది. కొన్ని ఆలయాల్లో ఆడ ఏనుగు (స్త్రీ శక్తి)ను ఆలింగనం చేసుకున్న రూపంలోనూ విగ్రహాలు కనిపిస్తాయి. ఈ విగ్రహాలను పెట్టెల్లో ఉంచే సంప్రదాయం ఉంది. ఉత్సవాల సమయంలో వెలుపలికి తీసి పూజలు నిర్వహిస్తుంటారు. సంపద, ఆర్థిక విజయాలు ప్రసాదించే దైవంగా వినాయకుడిని కొలుస్తారు జపనీయులు.
*బాలిలో గణపతి భళా:
ఇండోనేషియాలోని బాలిదీవిలో గణపతికి ఆలయాలు ఉన్నాయి. పాఠశాలలు, ప్రముఖ నిర్మాణాల్లోనూ గణపతి విగ్రహాలను ప్రతిష్ఠిస్తుంటారు. ఇండోనేషియా కరెన్సీపై కూడా గణపతి బొమ్మను చూడొచ్చు. బాలీతో పాటు సుమత్రా దీవులు, జావా ద్వీపంలోనూ గణపతి ఆలయాలు దర్శనమిస్తాయి. వినాయక చవితితో పాటు ఇతర పర్వదినాల్లో గజాననుడికి ప్రత్యేక పూజలు, ఉత్సవాలు నిర్వహిస్తుంటారు.
*థాయ్‌లో హాయిగా
థాయ్‌లాండ్‌లో కొన్ని ఆలయాల్లో విఘ్నేశ్వరుడికి బౌద్ధ ధర్మానుసారంగా పూజలు నిర్వహిస్తుంటారు. కొన్నిచోట్ల హిందూ సంప్రదాయంలో అర్చనలు చేస్తుంటారు. థాయ్‌ రాజధాని బ్యాంకాక్‌లో బొజ్జ గణపయ్యకు పలు ఆలయాలు ఉన్నాయి. విజయం, శ్రేయస్సు ఆశించి పూజలు నిర్వహిస్తుంటారు. చాచోంగ్‌సావో ప్రావెన్సీలో భారీ ఆలయాలు ఉన్నాయి. దేశదేశాల నుంచి వచ్చిన పర్యాటకులు వీటిని తప్పకుండా సందర్శిస్తుంటారు. భారీ వినాయక విగ్రహాల ఎదుట ఫొటోలు దిగుతుంటారు.
*నేపాల్‌లో తంత్ర గణపతి
నేపాల్‌లో హిందూ దేవుళ్ల ఆలయాలు కోకొల్లలు. గణపతి గుళ్లూ ఎక్కువే! అక్కడి వారు తాంత్రిక ఉపాసనలో విఘ్నేశ్వరుడిని ఎక్కువగా ఆరాధిస్తుంటారు. నేపాల్‌లోని ఆలయాల్లో కనిపించే గణపయ్య విగ్రహం కాస్త భిన్నంగా ఉంటుంది. ఏటవాలు కళ్లతో ఉంటాడు. విగ్రహం చేతుల్లో మొక్కలు ధరించి ఉండటం విశేషం. ప్రకృతి ప్రేమికులు గణపతిని పంటల దేవుడిగా భావిస్తారు.