Agriculture

కందిలో తెగుళ్ల నివారణ

కందిలో తెగుళ్ల నివారణ

ఇక కంది పంటకు ఫైటోఫ్తోరా ఎండు తెగులు వచ్చే అవకాశం ఉంది. ఈ తెగులు సోకిన మొక్క ఆకులపై నీటి చుక్కల మాదిరిగా మచ్చలు ఏర్పడి, గోధుమ రంగుకు మారుతాయి. దీని నివారణ కోసం లీటరు నీటిలో 3గ్రా. మ్యాంకోజెట్‌ లేదా 2గ్రా. మెటలాక్సిన్‌ కలిపి మొక్క మొదళ్లలో పోయాలి. ఆ తర్వాత నీటిలో కరిగే పోషక మందులైన 19:19:19(పాలిఫీడ్‌) లేదా 13:0:45(మల్టీ-కె) 10 గ్రా. లీటరు నీటిలో కలిపి మొక్క పై నుంచి పిచికారీ చేయాలి. తర్వాత పై పాటుగా ఎకరానికి 25 నుంచి 30 కిలోల యూరియా, 5 నుంచి 10 కిలోల మ్యూరేట్‌ ఆఫ్‌ పొటాష్‌ను పంట విత్తిన 100 రోజుల లోపు 4 దఫాలుగా వేయాలి. కందిలో పైటోఫ్తోరా ఎండు తెగులు ఆశించడానికి ప్రస్తుత వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. ఈ తెగులు గమనించిన చోట లీటరు నీటికి 3 గ్రా.కాపర్‌ ఆక్సీ క్లోరైడ్‌ మందును కలిపి మొక్క మొదళ్లను పూర్తిగా తడపాలి. ఆకుమచ్చ తెగులు నివారణకు లీటరు నీటికి 1గ్రా. కార్బెండజిమ్‌ మందును కలిపి పిచికారీ చేయాలి.వర్షాలు ఆగిన తర్వాత లీటరు నీటికి 10గ్రా. మల్టి-కెను కలిపి పిచికారీ చేయాలి.
*వరి
ముంపునకు గురైన వరి పొలాల్లో మురుగునీటిని తీసివేయాలి. తాత్కాలికంగా నత్రజని ఎరువులు వేయడం ఆపివేయాలి.
*ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో వరిలో బ్యాక్టీరియా ఎండాకు తెగులు సోకేందుకు అనుకూలం. తొలి దశ వ్యాప్తి నివారణకు మురుగునీటిని తీసివేసి 0.4 గ్రా. అగ్రిమైసిన్‌ లేదా 0.2 గ్రా. ప్లాంటోమైసిన్‌ మందును ఒక లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
*మొక్కజొన్న
మొక్కజొన్నలో ప్రస్తుతం ఎర్వినియ ఎండు తెగులు ఆశించే అవకాశం ఉంది. నివారణకు 100 కిలోల వేప పిండి, 4 కిలోల బ్లీచింగ్‌ పౌడర్‌ కలిపి పొలమంతా చల్లుకోవాలి.
*వర్షాలు ఆగిన తర్వాత అదనపు మోతాదుగా ఎకరానికి 30 కిలోల యూరియా, 15 కిలోల పొటాష్‌ వేసుకోవాలి.