Health

ఎస్పీ బాలుకి అందజేస్తున్న ఎక్మో చికిత్స ప్రత్యేకత ఏమిటి?

ఎస్పీ బాలుకి అందజేస్తున్న ఎక్మో చికిత్స ప్రత్యేకత ఏమిటి?

ప్రఖ్యాత గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనాతో బాధ పడుతు చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రి లో చికిత్స పొందుతున్నారు. వారి ఆరోగ్యం విషమంగా మారింది.ప్రస్తుతం వారికి ఎక్మో మెషీన్ ద్వారా చికిత్స అందిస్తున్నారు.(ఇదే ఎక్మో చికిత్స తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత గారికి కూడా 2016 లో అందించారు) ఎక్మో ( ECMO ఈసీఎంఓ) అంటే ఎక్స్‌ట్రాకార్పోరియల్ మెంబ్రేన్ ఆక్సిజనేషన్‌(Extra Corporeal Membrane Oxygenation).
ఆపదలో ప్రాణ రక్షణ ఎక్మో
ఎక్మో… అత్యాధునిక వైద్య విధానం! సుదీర్ఘ అస్వస్థత నుంచి కోలుకుంటున్న దశలో ఉన్నట్టుండి గుండెపోటు ముంచుకురావటం, అత్యవసరంగా ‘ఎక్మో’ యంత్రం మీద ఉంచి కొన్ని గంటల పాటు చికిత్స అందించటంతో దీనిపై అందరికీ ఆసక్తి పెరిగింది. అసలేమిటీ యంత్ర చికిత్స? దీన్ని ఎవరికి చేస్తారు? దీంతో ఎంత క్లిష్టమైన సందర్భాన్నైనా అధిగమించొచ్చా?.. ఇటువంటి ఎన్నో ప్రశ్నలు ప్రజల్లో ఉత్సుకతను రేకెత్తించాయి. ఈ నేపథ్యంలో ఈ అత్యాధునిక చికిత్సా విధానానికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసు కుందాం… పదండి…

ఎక్మో’ ఇప్పుడు విస్తృతంగా చర్చలోకి వస్తున్నా.. వాస్తవానికి ఈ విధానం కొంత కాలంగా మన దేశంలో అందుబాటులో ఉన్నదే. పాశ్చాత్య దేశాల్లో అయితే చాలా విస్తృతంగా కూడా వాడకంలో ఉంది. కీలక ఘడియల్లో మన వూపిరితిత్తుల పనినీ, అవసరమైతే గుండె పనిని కూడా బయటే పూర్తిచేసి… మన దేహాన్ని నిలబెట్టే సంక్లిష్టమైన ప్రత్యేక చికిత్సా విధానం ఇది. అందుకే దీనికి ఇంతటి ప్రాధాన్యం!

వెంటిలేటర్ల గురించి మన దేశంలో దాదాపుగా అందరికీ తెలుసు. రోగి శ్వాస పీల్చుకోలేకపోతున్న తరుణంలో… బయటి నుంచి ఆక్సిజన్‌ను ఇచ్చి.. రోగిని బతికించే కీలకమైన విధానం ఇది. అయితే రోగి వూపిరితిత్తులు కొంతైనా బాగా పని చేస్తున్నప్పుడే ఈ విధానం పనికొస్తుంది. కానీ రోగి వూపిరితిత్తులు కూడా సరిగా పని చేయక.. వెంటిలేటర్‌తో కూడా ఉపయోగం లేని సందర్భాల్లో.. రోగి ప్రాణ రక్షణ కోసం అక్కరకొచ్చే అత్యాధునిక విధానమే ‘ఎక్మో’!

ఎందుకీ ఎక్మో?
రక్తం.. మన శరీరంలోని ప్రతి కణానికీ అవసరం. మన శరీరంలో ప్రతి కణానికీ ప్రాణవాయువును మోసుకుపోయే అద్భుత శక్తి ప్రవాహం ఇది!
అందుకే రక్తం సజావుగా, నిరంతరాయంగా అందుతుంటేనే మన ఒంట్లోని కణాలు, అవయవాలన్నీ సజీవంగా ఉంటూ… వాటి పని అవి సమర్థంగా చేసుకుపోతుంటాయి. ఒకవేళ ఏదైనా కారణాన రక్త సరఫరా నిలిచిపోతే.. ఆ కణాలు చచ్చిపోతాయి, అవయవాలు పనితీరు అస్తవ్యస్తమై క్రమేపీ నిర్జీవమైపోతాయి. మృత్యువు ముంచుకొచ్చేస్తుంది. మన శరీరంలో రక్తసరఫరాకు అంతటి కీలకమైన ప్రాధాన్యం ఉంది.

ఇంతటి కీలకమైన రక్తాన్ని మన శరీరమంతా సరఫరా చేసేది- గుండె!
ఈ రక్తాన్ని నిరంతరం శుద్ధి చేస్తుండేది- మన వూపిరితిత్తులు!!
అందుకే ఈ రెండింటినీ మన శరీరంలో అత్యంత కీలకమైన అవయవాలుగా చెప్పుకోవాలి. వూపిరిత్తిత్తులు సరిగా పనిచేయకపోతే రక్తం శుద్ధి ప్రక్రియ జరగదు. దీంతో ప్రాణవాయువు (ఆక్సిజన్‌) లేని చెడు రక్తమే ఒళ్లంతా తిరుగుతుంటుంది, ఆక్సిజన్‌ తగినంత అందక అవయవాలన్నీ దెబ్బతినిపోతుంటాయి. అందుకే గుండె, వూపిరితిత్తులూ.. రెండూ సమర్థంగా పనిచేస్తుండటం చాలా అవసరం.

ఒకవేళ…
ఎవరికైనా ఈ రెండూ విఫలమైపోతే అప్పుడు ప్రాణ రక్షణ కోసం ఏం చెయ్యాలి? వూపిరితిత్తులు బాగానే పని చేస్తుంటే వెంటిలేటర్‌ మీద పెట్టి, ప్రాణాలను కాపాడొచ్చు. కానీ అవి కూడా పని చేయకపోతే.. ఆ వూపిరితిత్తులు చేసే పనినే బయట యంత్రాలతో చేయించే అద్భుతమైన చికిత్సా విధానం.. ఇప్పుడు ‘ఎక్మో’ రూపంలో అందుబాటులోకి వచ్చింది.

‘ఎక్మో’.. చేసేదేమిటి?
రోగి రక్తాన్ని ఒక గొట్టం ద్వారా బయటకు తీసుకువచ్చి.. ఒక యంత్రంలో దాన్ని శుద్ధి చేసి.. ఆ మంచి రక్తాన్ని తిరిగి శరీరంలోకి ఎక్కిస్తుండటం ఈ విధానం ప్రత్యేకత. అంటే వూపిరితిత్తులు చేసే పనీ, గుండె చేసే పనీ.. రెంటినీ ఈ యంత్రమే, అదీ బయటే చేస్తుందన్న మాట.

ఇలా ఎంత కాలం చెయ్యొచ్చు?
వాస్తవానికి గుండెకు ఆపరేషన్‌ చేసే సమయంలో కొన్నిసార్లు గుండెను, వూపిరితిత్తులను పూర్తిగా ఆపేసి, వాటి పనిని బయటే ‘హార్ట్‌ లంగ్‌ మిషన్‌’ అనే దానితో చేయిస్తూ.. సర్జరీ పూర్తి చేయటం పరిపాటి. అయితేఈ మెషీన్‌ను గట్టిగా 3-4 గంటలు, మరీ అవసరమైతే 6 నుంచి 8 గంటల వరకూ వాడొచ్చు. అంతకు మించి ఈ సాధారణ హార్ట్‌ లంగ్‌ మిషన్‌ను వాడటం కష్టం. కానీ కొంత దీర్ఘకాలం.. అంటే ఎక్కువ రోజుల పాటు రక్తాన్ని శుద్ధి చేసి, ఆక్సిజన్‌ను అందించాల్సిన అవసరం తలెత్తినప్పుడు ‘ఎక్మో’ విధానం బాగా అక్కరకొస్తుంది. ఎక్మో (ఎక్స్‌ట్రా కార్పోరియల్‌ మెంబ్రేన్‌ ఆక్సిజనేషన్‌) అంటే… శరీరానికి బయటే రక్తాన్ని శుద్ధి చేసే ప్రక్రియ అని అర్థం! ఆక్సిజన్‌ తక్కువగా ఉన్న రక్తాన్ని బయటకు రప్పించి.. దాన్ని బయటే శుద్ధి చేసి.. తిరిగి ఆక్సిజన్‌ నింపుకున్న రక్తాన్ని లోపలికి ఎక్కించటం ఈ ప్రక్రియ మూల సూత్రం.

ఏమిటి ప్రయోజనం?
గుండె, వూపిరితిత్తుల పనిని బయటే కృత్రిమంగా చేయిస్తుంటాం కాబట్టి ఆ రెంటికీ పూర్తి విశ్రాంతి చిక్కి, అవి త్వరగా కోలుకుంటాయి. కృత్రిమంగానే అయినా ఒంట్లో రక్త సరఫరా తగ్గకుండా చూస్తుంటాం కాబట్టి ఒంట్లో అవయవాలేవీ దెబ్బతినే ప్రమాదం ఉండదు. దెబ్బతిన్నా కూడా వాటినే బలవంతానా పనిచేయించాలని చూడకుండా… గుండెకు, వూపిరితిత్తులకు పూర్తి విశ్రాంతి, కోలుకునేంత సమయం ఇవ్వటం దీనిలోని ముఖ్య సూత్రం.

ఉన్నట్టుండి గుండె లేదా వూపిరితిత్తుల పనితీరు దెబ్బతినిపోయిన వాళ్లకు ఇది బాగా అక్కరకొస్తుంది. క్రమేపీ దెబ్బతినే వాళ్లకు దీనితో పెద్ద ఉపయోగం ఉండదు, వాళ్లకు గుండె మార్పిడి వంటివే సరైన మార్గాలు.

ఎంత కాలం ఉంచగలం?
ఎక్మో విధానంలో 2-3 వారాల పాటు కూడా చికిత్స ఇవ్వచ్చు. వూపిరితిత్తుల వైఫల్యం కారణంగా ఎక్మో పెట్టిన వాళ్లకు ఫలితాలు చాలా బాగుంటున్నాయి. వీరు 70-80% వరకూ కోలుకుంటారు. కానీ గుండె దెబ్బతినటం కారణంగా ఎక్మో పెట్టిన వాళ్లలో ఫలితాలు అంత గొప్పగా ఉండటం లేదు. ఇప్పుడిప్పుడే ‘ఎక్మో’ మన దేశంలో కూడా ప్రాచుర్యంలోకి వస్తోంది.

ఎక్మోతో దుష్ప్రభావాలుంటాయా?
వాస్తవానికి ఈ ఎక్మో చికిత్స కోసం.. రక్తాన్ని బయటకు తీసుకువచ్చేందుకు, మళ్లీ లోపలికి పంపేందుకు గొట్టాలను అమర్చటమే కష్టం. అప్పటికే తీవ్ర అనారోగ్యంతో ఉన్న రోగికి ఇది కొంత సంక్లిష్టమైన వ్యవహారం. రక్తస్రావం అయిపోవటం, రక్తపు గడ్డలు ఏర్పడటం, రక్తనాళాలు చిట్లిపోవటం వంటి సమస్యలన్నీ ఉంటాయి. ఇన్ఫెక్షన్లు రావచ్చు. అలాగే రక్తాన్ని బయటే శుద్ధి చేస్తుండే క్రమంలో కొన్నిసార్లు రక్తంలోని ప్లేట్‌లెట్లు, తెల్లరక్తకణాల వంటివి దెబ్బతినిపోతుంటాయి. ఇది మరో సమస్య. అయితే వైద్యులు వీటన్నింటినీ నిరంతరాయంగా పర్యవేక్షిస్తుంటారు.

ఎవరికి చేస్తారు?
వాస్తవానికి ఎక్మో విధానం- పుట్టుకతోనే గుండె లోపాలతో, లేదా పుట్టగానే శ్వాస సమస్యలతో బాధపడే పసి గుడ్డుల్లోనూ, చిన్నపిల్లల్లో చాలా విస్తృతంగా వాడకంలో ఉంది. పెద్దలకు కూడా- వూపిరితిత్తులు దెబ్బతిని, అవి సరిగా పని చేయని సందర్భాల్లో ఈ విధానాన్ని ఉపయోగించాల్సి వస్తుంటుంది.

* కొందరు పిల్లలకు పుట్టుకతోనే వూపిరితిత్తులు గట్టిగా ఉంటాయి. అలాగే కొందరికి శ్వాస తీవ్రమైన ఇబ్బందిగా ఉంటుంది. కొందరు పిల్లలు తల్లికడుపులోనే మలం మింగటం వల్ల పుట్టగానే శ్వాస సమస్యలు తలెత్తుతాయి. అలాగే కొందరు పిల్లలకు వైరల్‌ ఇన్ఫెక్షన్ల వల్ల ఉన్నట్టుండి రెండు వూపిరితిత్తులూ గట్టిగా, పని చేయకుండా అయిపోతాయి. ఇలాంటి వారందరికీ- వెంటనే వూపిరితిత్తులకు పూర్తి విశ్రాంతి ఇచ్చి, చికిత్స చేస్తుంటే క్రమేపీ ఓ వారం పది రోజుల్లో వాళ్ల వూపిరితిత్తులు సహజంగానే తిరిగి కోలుకుంటాయి. ఇలా వూపిరితిత్తులకు పూర్తి విశ్రాంతి ఇచ్చేందుకు ‘ఎక్మో’ ఉపయోగపడుతుంది.

రెండోది- కొందరికి వైరస్‌ ఇన్ఫెక్షన్ల కారణంగా ఉన్నట్టుండి గుండె కండరం విపరీతంగా వాచిపోతుంది (మయోకార్డైటిస్‌). ఇలాంటి సందర్భాల్లో గుండె పంపింగ్‌ పూర్తిగా దెబ్బతినిపోతుంది. ఇలాంటి వారికి ఆ వైరస్‌ ఇన్ఫెక్షన్‌ తగ్గే వరకూ కూడా మనం బయటి నుంచి సాంత్వనఇవ్వగలిగితే మళ్లీ తమంతట తామే పూర్తిగా కోలుకుంటారు. ఇలాంటి వారికి కూడా ‘ఎక్మో’ బాగా ఉపయోగపడుతుంది. రక్తంలో ఇన్ఫెక్షన్‌ చేరిపోయి.. తీవ్రమైన ‘సెప్సిస్‌’ ఉన్న వాళ్లకు.. రక్తంలోని విషతుల్యాల వల్ల ఒక్కోసారి గుండె పని ఆగిపోతుంది. ఇలాంటి వారికి కూడా తాత్కాలికంగా ఇది బాగా ఉపయోగపడుతుంది. అలాగే గుండెపోటు సమస్య లేకుండా ఉన్నట్టుండి గుండె పనితీరు, పంపింగ్‌ సామర్థ్యం దెబ్బతిన్న వాళ్లందరికీ కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. తీవ్రమైన న్యుమోనియా వచ్చి రెండు వూపిరితిత్తులూ పని చేసే స్థితిలో లేనప్పుడు కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది.

ఎప్పుడు తీసేస్తారు?
రోగి కోలుకుంటున్న కొద్దీ అంటే రోగి వూపిరితిత్తులు బాగుపడుతున్న కొద్దీ, లేదా గుండె పంపింగ్‌ మెరుగవుతున్న కొద్దీ ఎక్మో మీద ఆధారపడటాన్ని తగ్గించుకుంటూ వచ్చి, చివరకు పూర్తిగా తీసెయ్యచ్చు.

ఎక్మో.. ఎలా చేస్తారు?
రోగి శరీరంలోని రక్తనాళాల్లోకి, లేదా నేరుగా గుండెలోకి అమర్చేందుకు ప్రత్యేకమైన గొట్టాలుంటాయి. ఈ గొట్టాలను రోగి మెడ దగ్గర నుంచిగానీ గానీ, తొడ దగ్గరగానీ లోనికి పంపి రక్తనాళాల్లో అమరుస్తారు. అవసరాన్ని బట్టి, రోగి పరిస్థితిని బట్టి ఈ గొట్టాలను ఎలా అమర్చాలన్నది నిర్ణయిస్తారు. ఈ గొట్టాలను బయట ఎక్మో యంత్రానికి అనుసంధానిస్తారు. ఒక గొట్టం గుండా రక్తం యంత్రంలోకి వచ్చి, తగినంత ఆక్సిజన్‌ తీసుకుని శుద్ధి అయిన తర్వాత.. తిరిగి మరో గొట్టం ద్వారా శరీరంలోకి వెళ్లిపోతుంటుంది. ఇది నిరంతరాయంగా జరిగే ప్రక్రియ.

* సిర నుంచి రక్తాన్ని బయటకు తీసుకువచ్చి, బయటే యంత్రంలో ఆ రక్తాన్ని శుద్ధి చేసి (అంటే ఆక్సిజన్‌ నింపి), తిరిగి సిరలోకి ఎక్కించటం ఒక పద్ధతి. దీన్ని ‘వీనో వీనస్‌’ పద్ధతంటారు. సాధారణంగా రోగి గుండె బాగానే పని చేస్తూ, వూపిరితిత్తులు ఒక్కటే సరిగా పని చేయని వారికి ఈ విధానాన్ని అనుసరిస్తుంటారు.

* సిర నుంచి రక్తాన్ని బయటకు తీసి, యంత్రాల సాయంతో బయటే శుద్ధి చేసి, తిరిగి ఆ రక్తాన్ని ధమని ద్వారా లోనికి పంపటం, అక్కడి నుంచి శరీరమంతా కూడా సరఫరా అయ్యేలా పంపింగ్‌ చేయటం మరో పద్ధతి. దీన్ని ‘వీనో-ఆర్టీయల్‌’ పద్ధతంటారు. వూపిరితిత్తులతో పాటు గుండె కూడా సమర్థంగా పనిచేయని వారికి ఈ విధానం ఉపయోగపడుతుంది. దీనివల్ల ఆ రెండు కీలక అవయవాలకూ విశ్రాంతి లభిస్తుంది, అవి త్వరగా కోలుకునే వీలు చిక్కుతుంది.