Business

ఇక ఆ ప్రభుత్వ బ్యాంకులు కూడా కనపడవు

ఇక ఆ ప్రభుత్వ బ్యాంకులు కూడా కనపడవు

ఇప్పటి వరకూ రెండు, మూడు దఫాలుగా చేపట్టిన విలీనాల ప్రక్రియలో భాగం కాని ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణకు కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోందా? తద్వారా పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాన్నీ చేరుకునేందుకు వీలు కలుగుతుందని యోచిస్తోందా…? ప్రస్తుత సంకేతాలను పరిగణలోకి తీసుకుంటే ‘అవుననే’ సమాధానమే వస్తోంది. ‘కరోనా’ మహమ్మారితో ప్రభుత్వ ఆదాయాలూ తగ్గాయి. పైగా లక్ష్యం మేరకు ఈ ఆర్థిక సంవత్సరంలో పెట్టుబడుల ఉపసంహరణ వ్యవహారమూ సంక్లిష్టమైన ప్రక్రియే. ఈ నేపథ్యంలో చిన్న ప్రభుత్వ బ్యాంకుల ప్రైవేటీకరణపై ప్రభుత్వం దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి నాలుగు ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. అందులో పంజాబ్‌ అండ్‌ సింధ్‌ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర, యూకో బ్యాంక్‌, ఐడీబీఐ బ్యాంకులున్నాయి. వీటిల్లో ప్రభుత్వానికి ప్రత్యక్షంగాను, పరోక్షంగాను మెజారిటీ వాటాలు ఉన్నాయి. ప్రభుత్వ బ్యాంకుల ప్రైవేటీకరణ అంశాన్ని వేగవంతం చేయాలంటూ ఇటీవలే ఆర్థిక శాఖకు ప్రధాన మంత్రి కార్యాలయం నుంచి సంకేతాలు వెళ్లినట్లు సమాచారం. దీంతో ఆర్థిక శాఖ వర్గాలు ప్రైవేటీకరణ సంప్రదింపుల ప్రక్రియను చేపట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరాంతానికి ఈ వ్యవహారాన్ని పూర్తి చేయాలని ప్రభుత్వం గట్టిగా భావిస్తోంది. అదే జరిగితే కేవలం 5 పెద్ద బ్యాంకులే ప్రభుత్వ బ్యాంకులుగా ఉంటాయి. ఇటీవల కాలంలో రెండు దఫాలుగా చేపట్టిన ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనాల ప్రక్రియకు వెలుపల ఉండిపోయిన నాలుగు బ్యాంకులనే ప్రైవేటీకరణకు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.

మనదేశంలో బ్యాంకులను జాతీయం చేయడం (ప్రైవేటు బ్యాంకులను ప్రభుత్వ బ్యాంకులుగా మార్చటం…) 1969లో ఒకసారి, 1980లో రెండోసారి జరిగింది. అప్పటి అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వం ప్రైవేటు బ్యాంకులను జాతీయం చేసింది. కానీ గత అర్ధశతాబ్దిలో ఎన్నో మార్పులు వచ్చాయి. బ్యాంకింగ్‌ రంగంలో ప్రభుత్వ బ్యాంకులతో పాటు ప్రైవేటు బ్యాంకులు, విదేశీ బ్యాంకులు వచ్చాయి. రుణ వితరణ తీరుతెన్నులు, బ్యాంకింగ్‌ సేవల్లో కొత్తదనం చోటుచేసుకుంది. పోటీ అనూహ్యంగా పెరిగింది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ రంగ బ్యాంకుల స్థిరీకరణ అవసరమనే ప్రతిపాదన ముందుకు వచ్చింది. దీనికి తగ్గట్లుగా మూడేళ్ల క్రితం ఎస్‌బీఐలో దాని ఏడు అనుబంధ బ్యాంకులను విలీనం చేశారు. ఆ తర్వాత బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో విజయా బ్యాంకు, దేనా బ్యాంకు కలిశాయి. మలిదశ విలీనం ఇంకా పెద్దది. ఒకేసారి 10 బ్యాంకులను నాలుగు బ్యాంకులుగా మార్చారు. దీంతో ప్రస్తుతం 5 పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకులు ఉన్నట్లు అయింది. ఇక ఈ ప్రక్రియలో భాగంగా కాకుండా మిగిలిపోయిన చిన్న బ్యాంకులను ప్రైవేటీకరణకు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో వచ్చే 7 నెలల్లో నాలుగు ప్రభుత్వ బ్యాంకుల ప్రైవేటీకరణ వ్యవహారాన్ని పూర్తిచేయటం సవాలుతో కూడుకున్న ప్రక్రియే. ప్రభుత్వం ఏ ఏడాది కాఏడాది పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యం చేరటానికి ఎన్నో కష్టాలు పడాల్సి వస్తోంది. చివర్లో ఎల్‌ఐసీ ఆదుకుంటున్న సంగతి చూస్తున్నాం. అప్పటికీ లక్ష్యాన్ని పూర్తిగా చేరటం లేదు. ఇపుడు ‘కరోనా’ మహమ్మారి కాలంలో ప్రభుత్వ బ్యాంకుల్లో వాటాల అమ్మకానికి పరిస్థితులు ఏ విధంగా కలిసివస్తాయనేది వేచి చూడాల్సిందే. అదీ కాక ఈ బ్యాంకుల్లోని అధిక మొండి బాకీలు వాటా విక్రయంపై ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు. అలాగని వాయిదా వేస్తే… ఈ బ్యాంకులకు పెద్దఎత్తున మూలధన నిధులు సమకూర్చాల్సిన భారం ప్రభుత్వం మీద పడుతుంది. దాన్ని తప్పించుకోవాలంటే ప్రైవేటు పరం చేయటమే మేలు- అనే భావన వ్యక్తమవుతోంది. ప్రస్తుత ఆలోచనల ప్రకారం ఎంపిక చేసిన బ్యాంకులను ప్రైవేటీకరిస్తే… వాటిని గడ్డుకాలం నుంచి బయట పడవేయడంతో పాటు కొంత ఆదాయాన్ని సమకూర్చుకునేందుకు ప్రభుత్వానికి అవకాశం లభిస్తుంది. అయితే ఆ దిశగా ప్రభుత్వం వేసే అడుగులు పక్కాగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రైవేటీకరణకు ముందే కొన్ని దిద్దుబాటు చర్యలు చేపడితే ప్రభుత్వ వాటాలకు అధిక విలువ లభిస్తుందని పేర్కొంటున్నారు.