* మదుపర్లకు బాసెల్ 3 నిబంధనలకు లోబడిన బాండ్లను జారీ చేయడం ద్వారా రూ.8,931 కోట్లు సమీకరించడానికి ప్రభుత్వ రంగ బ్యాంక్ ఎస్‌బీఐ బోర్డు ఆమోదం తెలిపింది. బాసెల్ 3 నిబంధనలకు లోబడిన నాన్-కన్వెర్టబుల్, ట్యాక్సబుల్, సబ్‌ఆర్డినేటెడ్, అన్‌సెక్యూర్డ్, ఫుల్లీ పెయిడప్ బాండ్లతో రూ. 8,931 కోట్లు సమీకరించడానికి మూలధన సమీకరణ కోసం ఏర్పాటు చేసిన డైరెక్టర్ల కమిటీ శుక్రవారం ఆమోద ముద్ర వేసింది. ఈ బాండ్ల ముఖ విలువ 10 లక్షలు కాగా.. 15 కాల వ్యవధితో వార్షిక కూపన్ రేటు 6.80 శాతం ఇవ్వనున్నారు. బాండు చందాదార్లకు 10 ఏళ్ల కాల్ ఆప్షన్ ఉందని ఎస్‌బీఐ తెలిపింది.
* దేశ ఎగుమతుల్లో భారీ పెరుగుదల కనిపించింది. చైనా, ఇతర ఆసియా దేశాలకు జులైలో మన ఎగుమతులు 78 శాతం మేర పెరగడం విశేషమని క్రిసిల్ తన నివేదికలో వెల్లడించింది. మొత్తం ఎగుమతుల్లో ఇవి 16 శాతానికి సమానమని తెలిపింది. ఎగుమతులు ఏప్రిల్‌లో 60.2 శాతం; మేలో 50%; జూన్‌లో 30% క్షీణించగా.. జులైలో క్షీణత 10.2 శాతానికి పరిమితమైంది. జులైలో ఎగుమతులు చైనాకు 78%; మలేసియాకు 76%, వియత్నాంకు 43%, సింగపూర్‌కు 37 శాతం చొప్పున పెరిగాయి. మరో వైపు యూఏఈకి 53.2%; బ్రిటన్‌కు 38.8%, అమెరికాకు 11.2%, బ్రెజిల్‌కు 6.3 శాతం చొప్పున మన ఎగుమతులు తగ్గడం గమనార్హం. కరోనాను ముందుగా అదుపులో పెట్టిన దేశాలకు ఎగుమతులు పెరగడం విశేషమని క్రిసిల్ వివరించింది.
* ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీ సంస్థ శాంసంగ్ సెప్టెంబరులో భారత మార్కెట్‌లోకి మరో కొత్త మోడల్‌ను తీసుకురానున్నట్లు సమాచారం. శాంసంగ్ గెలాక్సీ ఎం51 పేరుతో ఈ ఫోన్ రాబోతోంది. బిగ్ బ్యాటరీ, హోల్‌పంచ్ కటౌట్ సెల్ఫీ కెమెరా వంటివి దీని ప్రత్యేకతలు. 6.7 అంగుళాల సూపర్ అమోలెడ్ ఇన్ఫీనిటీ-ఓ డిస్‌ప్లే ఇస్తున్నారట. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 730 ప్రాసెసర్‌ను ఉపయోగించినట్లు టెక్ వర్గాలు తెలిపాయి. ఆండ్రాయిడ్ 10 ఆధారిత శాంసంగ్ వన్ యుఐ 2.1 ఓఎస్‌తో పనిచేస్తుందట.
* ఆగస్టు 14తో ముగిసిన వారానికి విదేశీ మారకం (ఫారెక్స్) నిల్వలు 2.939 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.22,000 కోట్లు) తగ్గి 535.252 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.40.14 లక్షల కోట్లు)కు చేరాయని రిజర్వు బ్యాంక్ (ఆర్‌బీఐ) పేర్కొంది. విదేశీ కరెన్సీ ఆస్తుల్లో తరుగుదలే ఇందుకు ప్రధాన కారణమని ఆర్‌బీఐ తెలిపింది. అంతక్రితం వారం ఫారెక్స్ నిల్వలు 3.623 బిలియన్ డాలర్లు పెరిగి 538.191 బిలియన్ డాలర్లకు చేరాయి. విదేశీ కరెన్సీ ఆస్తులు 743 మిలియన్ డాలర్లు తగ్గి 491.550 బిలియన్ డాలర్లకు చేరాయి. బంగారు నిల్వలు 2.19 బిలియన్ డాలర్లు తగ్గి 37.595 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) వద్ద దేశ ప్రత్యేక ఉపసంహరణ హక్కులు (ఎస్‌డీఆర్) 2 మిలియన్ డాలర్లు తగ్గి 1.479 బిలియన్ డాలర్లకు చేరగా, ఐఎంఎఫ్ వద్ద దేశీయ నిల్వలు 4 మిలియన్ డాలర్లు తగ్గి 4.628 బిలియన్ డాలర్లుగా నమోదయినట్లు రిజర్వు బ్యాంకు గణాంకాలు వెల్లడించాయి.
* త్వరలో విడుదల చేయనున్న కాంపాక్ట్ ఎస్‌యూవీ మోడల్ సొనెట్‌కు మొదటి రోజున 6,523 బుకింగ్‌లు వచ్చాయని కియా మోటార్స్ ఇండియా వెల్లడించింది. మొదటి రోజే సొనెట్‌కు అద్భుతమైన స్పందన లభించిందని తెలిపింది. కియా సొనెట్‌ను ఆన్‌లైన్ లేదా కంపెనీ విక్రయశాలలో రూ.25,000 ముందస్తుగా చెల్లించి బుకింగ్ చేసుకోవచ్చు. వచ్చే నెలలో ఈ కారును అధికారికంగా విడుదల చేయనున్నారు. మారుతీ విటారా బ్రెజా, హ్యుందాయ్ వెన్యూ, టాటా నెక్సాన్ వంటి మోడళ్లతో ఈ కారు పోటీపడే అవకాశం ఉంది.
* ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు 24.64 లక్షల పన్ను చెల్లింపుదార్లకు రూ.88,652 కోట్ల పన్ను రిఫండ్లు జారీ చేసినట్లు ఆదాయపు పన్ను విభాగం వెల్లడించింది. ఇందులో 23.05 లక్షలకు పైగా పన్ను చెల్లింపుదార్లకు వ్యక్తిగత ఆదాయపు పన్ను (పీఐటీ) రిఫండ్‌ల కింద రూ.28,180 కోట్లు, 1.58 లక్షల పన్ను చెల్లింపుదార్లకు కార్పొరేట్ పన్ను రీఫండ్‌ల కింద రూ.60,472 కోట్లు వెనక్కి ఇచ్చారు. ఈ వివరాలను ఆదాయపు పన్ను విభాగం ట్వీట్ చేసింది.