DailyDose

Breaking News:స్పృహలోకి బాలు-తాజావార్తలు

Breaking News:స్పృహలోకి బాలు-తాజావార్తలు

* కరోనాతో పోరాడుతున్న సుప్రసిద్ధ గాయకుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్టు చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రి వెల్లడించింది. వెంటిలేటర్‌, ఎక్మో సాయంతో ఐసీయూలో చికిత్సపొందుతున్నారని తెలిపింది. ఈ మేరకు ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆస్పత్రి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ అనురాధ భాస్కరన్‌ బులిటెన్‌ విడుదల చేశారు. బాలసుబ్రహ్మణ్యం స్పృహలోకి వచ్చారని, వైద్యానికి స్పందిస్తున్నారని బులిటెన్‌లో పేర్కొన్నారు. బాలు ఆరోగ్య పరిస్థితిని వైద్యబృందం సునిశితంగా పర్యవేక్షిస్తోందని తెలిపారు. ఈ నెల మొదటివారంలో కరోనా బారిన పడటంతో బాలసుబ్రహ్మణ్యం చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. అప్పటినుంచి ఆయన ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నారు. ఆయన కోలుకొని క్షేమంగా తిరిగి రావాలని ఆకాంక్షిస్తూ ఆయన అభిమానులు, ప్రజలు ప్రార్థనలు చేస్తున్నారు.

* అండర్‌వరల్డ్‌ డాన్‌ దావూద్‌ ఇబ్రహీం కరాచీలో నివసిస్తున్నాడన్న వార్తలను పాకిస్తాన్‌ ప్రభుత్వం ఖరారు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ వార్తలను దావూద్‌ ప్రధాన అనుచరుడు చోటా షకీల్‌ బుధవారం ఖండించారు. కరాచీలో ఒక ఖరీదైన భవనంలో ఉన్నాడని భారత మీడియా చూపించిందని ఈ విషయంలో పూర్తి బాధ్యత దానిదే అని పేర్కొన్నాడు. పాకిస్తాన్‌తో సహా తాము ఏ ప్రభుత్వానికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని తెలిపాడు.

* చిత్తూరు జిల్లా నగరి వద్ద సినీఫక్కీలో చోరీ జరిగింది. మొబైల్‌ ఫోన్ల రవాణా లారీని దుండగులు అపహరించారు. తమిళనాడులోని శ్రీపెరుంబుదూరు నుంచి ముంబయిలోని ఎంఐ సంస్థ గోదాముకు లారీ వెళ్తుండగా తమిళనాడు-ఏపీ సరిహద్దు సమీపంలో ఈ ఘటన జరిగింది. ఏపీ సరిహద్దులోకి రాగానే దుండగులు లారీని అడ్డగించి డ్రైవర్‌, కాళ్లు, చేతులు కట్టి కిందపడేశారు. అనంతరం లారీని తీసుకెళ్లి పుత్తూరు సమీపంలోని మరాఠీ గేటు వద్ద వదిలి పరారయ్యారు. లారీ డ్రైవర్‌ ఫిర్యాదు మేరకు నగరి పోలీసులు విచారణ చేపట్టారు. తమిళనాడు సరిహద్దు అవతలి నుంచే కొంతమంది లారీని అనుసరించినట్లు డ్రైవర్‌ పోలీసులకు తెలిపారు.

* ఏపీలో మరోసారి భారీగా కరోనా కేసులు నమోదయ్యాయి. 24 గంటల వ్యవధిలో 61,838 నమూనాలను పరీక్షించగా రికార్డు స్థాయిలో 10,830 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొంది. ఒక్కరోజులో 8,473 మంది కరోనా నుంచి కోలుకోగా.. 81 మంది చికిత్స పొందుతూ మృతిచెందారు. తూర్పుగోదావరిలో 11 మంది, ప్రకాశం 9, చిత్తూరు 8, కడప 8, అనంతపురం 6, పశ్చిమగోదావరి 6, కృష్ణా 5, కర్నూలు 5, నెల్లూరు 5, విశాఖపట్నం 5, విజయనగరం 5, గుంటూరు 4, శ్రీకాకుళం జిల్లాలో నలుగురు కరోనాతో మృతిచెందినట్లు బులెటిన్‌లో పేర్కొన్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 34,18,690 నమూనాలను పరీక్షించారు. తాజా కేసులతో కరోనా సోకిన వారి సంఖ్య 3,541కి చేరింది.

* కరోనా సోకకుండా ప్రభుత్వాధికారులు, ప్రజలు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రజలు వేడి నీళ్లు తాగుతూ, కొవిడ్‌ నిబంధనలు పాటిస్తుంటే.. ప్రభుత్వ యంత్రాంగం అనుమానిత ప్రాంతాల్లో బ్లీచింగ్‌ చల్లుతూ కరోనాను సంహరించే ప్రయత్నం చేస్తోంది. అయితే ఈ బ్లీచింగ్‌ కరోనా వైరస్‌ను చంపుతుంది కదా అని నార్త్‌ టెక్సాస్‌లో కొందరు బ్లీచింగ్‌ కలిపిన ద్రవాన్ని తాగుతున్నారట.

* వైకాపా నేత, సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు అక్రమ మైనింగ్‌ చేస్తున్నారంటూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. రాజుపాలెం మండలం కోట నెలమపురి, కొండమోడు గ్రామాల్లో అక్రమ మైనింగ్‌ జరిగిందని పేర్కొంటూ హైకోర్టు న్యాయవాది నాగరఘు పిటిషన్‌ దాఖలు చేశారు. రాజుపాలెం వైకాపా కార్యకర్తల తరఫున ఈ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. పిటిషన్‌ విచారణ అర్హతపై ధర్మాసనం ప్రశ్నలు లేవనెత్తింది. అక్రమ మైనింగ్‌ జరుగుతున్నందునే పిటిషన్‌ వేశామని పిటిషనర్ న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు.

* రాష్ట్రంలో తెరాస ప్రభుత్వం అన్ని విధాలా వైఫల్యం చెందిందని.. ప్రజల్లో ఆ పార్టీపై క్రమంగా వ్యతిరేకత పెరుగుతోందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. గాంధీభవన్‌లో సేవాదల్‌ సభ్యత్వ కార్యక్రమం నిర్వహించిన అనంతరం డీసీసీ అధ్యక్షులతో ఉత్తమ్‌ సమావేశయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కరోనా సమయంలో ప్రజలు, వలస కార్మికులకు సేవ చేయడంలో డీసీసీలు ముందుండి నడిపించాయని కొనియాడారు. డీసీసీ పదవుల్లో కొందరికి అన్యాయం జరిగినా పార్టీ కోసం సేవ చేయడం అభినందనీయమన్నారు. స్థానిక ముఖ్య నేతలను కలుపుకొని కమిటీలు వేయాలని డీసీసీ అధ్యక్షులకు ఉత్తమ్‌ సూచించారు. వచ్చేనెల 3లోపు అన్ని కమిటీల నియామకాలు పూర్తి చేసి సంస్థాగతంగా బలోపేతం చేయాలన్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ విజయం ఖాయమని ఉత్తమ్‌ ధీమా వ్యక్తం చేశారు.

* దేశంలో ఉగ్రదాడులకు ఐఎస్‌ఐతో కలిసి జైష్‌ ఏ మహ్మద్‌ సంస్థ పన్నాగం పన్నినట్లు కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించాయి. జమ్మూకశ్మీర్‌ సహా పలు ప్రాంతాల్లో ఉగ్రదాడులు జరిపేందుకు పథకం రూపొందించాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. పాకిస్థాన్‌ ఇంటెలిజెన్స్‌ సంస్థ ఐఎస్‌ఐ, జైష్‌ సంస్థ పెద్ద ఎత్తున ప్రణాళికలు రచించినట్లు కేంద్ర నిఘా వర్గాలు గుర్తించాయి. మసూద్‌ అజార్‌ సోదరుడు ముఫ్తీ రౌఫ్‌ అజ్గర్‌, షకీల్‌ అహ్మద్‌ ఆగస్ట్‌ 20న పాకిస్థాన్‌లోని రావల్పిండిలో ఐఎస్‌ఐ అధికారులతో సమావేశమైనట్లు నిఘావర్గాలు ధ్రువీకరించాయి.

* కరోనా మహమ్మారి కారణంగా కుచించుకుపోయిన ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టాలంటే వినియోగం పెరగడమే కీలకమని, భారీ సంస్కరణలు అవసరమవుతాయంటూ ఆర్‌బీఐ వెలువరించిన వార్షిక నివేదికపై కాంగ్రెస్‌ నేత రాహుల్ గాంధీ స్పందించారు. తాను కొన్ని నెలలుగా చెప్తోన్న అంశాలనే ఆర్‌బీఐ ఇప్పుడు నివేదించిందని బుధవారం ఆయన మోదీ సర్కార్‌పై విమర్శలు చేశారు.

* ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిపై ప్రజాభిప్రాయం కోరదామని తాము విసిరిన సవాల్‌ను వైకాపా ప్రభుత్వం స్వీకరించకపోవడంతో తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఓ ప్రత్యేక వెబ్‌సైట్‌ ద్వారా ప్రజాభిప్రాయాన్ని కోరారు. వ్వ్వ్.అప్విథమరవతి.చొం పేరుతో వెబ్‌సైట్‌ను రూపొందించారు. ప్రజలు అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధితోపాటు అమరావతిని ఏకైక రాజధానిగా కోరుకుంటున్నారా? అనే ప్రశ్నను అందులో ఉంచారు. వెబ్‌సైట్‌ ద్వారా ఓటు వేసి అమరావతిని రక్షించుకోండి అని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు.

* మారటోరియం వ్యవధిలో రుణాలపై వడ్డీ చెల్లింపు విషయంలో కేంద్రం తన వైఖరిని స్పష్టం చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆర్బీఐ పేరు చెప్పి తప్పించుకునేందుకు ప్రయత్నించొద్దంటూ చురకలంటించింది. ఆరు నెలల మారటోరియం వ్యవధిలో రుణాలపై వడ్డీ, ఆ వడ్డీపై వడ్డీ విధించడాన్ని సవాల్‌ చేస్తూ ఆగ్రాకు చెందిన గజేంద్ర శర్మ సుప్రీంలో పిటిషన్‌ వేశారు. దానిపై బుధవారం జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది.

* దేశవ్యాప్తంగా సెప్టెంబర్‌ 1 నుంచి జరుగనున్న నీట్‌, జేఈఈపై మరోసారి సుప్రీంకోర్టు గడపతొక్కే యోచనలో విపక్షాలు ఉన్నట్లు సమాచారం. తాజాగా కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ విపక్ష పార్టీల ముఖ్యమంత్రులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ అభిప్రాయం వ్యక్తమైంది. పరీక్షలను వాయిదా వేయాలంటూ మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయిద్దామని పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సూచించినట్లు సమాచారం.

* బాలీవుడ్ నటుడు సుశాంత్‌ సింగ్ రాజ్‌పూత్ మృతి కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా మాదక ద్రవ్యాల అంశం వెలుగులోకి వచ్చింది. వాటి గురించి సుశాంత్ స్నేహితురాలు రియా చక్రవర్తి కొందరు వ్యక్తులతో ఫోన్‌ సందేశాల రూపంలో సంభాషణ జరిపినట్లు కొన్ని మీడియా సంస్థల్లో వచ్చిన వార్తలు సంచలనం కలిగిస్తున్నాయి. వీటిపై ఆమె తరఫు న్యాయవాది మాట్లాడుతూ..రియా ఎప్పుడూ మాదక ద్రవ్యాలను తీసుకోలేదని, ఏ సమయంలోనైనా రక్త పరీక్షకు ఆమె సిద్ధంగా ఉందని వెల్లడించారు.