Health

అక్టోబరులో అమెరికాకు ఆక్స్‌ఫోర్డ్ టీకా

అక్టోబరులో అమెరికాకు ఆక్స్‌ఫోర్డ్ టీకా

ఆక్స్‌ఫర్డ్‌ – ఆస్ట్రాజెనెకా అభివృద్ధిచేసిన కరోనా వ్యాక్సిన్‌ అత్యవసర వినియోగానికి అమెరికా అక్టోబరులోనే పచ్చజెండా ఊపనుందా? నవంబరు 3న అధ్యక్ష ఎన్నికలకు ముందే దీనిపై ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ (ఎఫ్‌డీఏ)తో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటన చేయిస్తారా? అందుకు అవకాశాలు ఉన్నాయంటూ లండన్‌ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే ప్రముఖ దినపత్రిక ‘ఫైనాన్షియల్‌ టైమ్స్‌’ ఓ సంచలన కథనాన్ని ప్రచురించింది. ఎన్నికల్లో లబ్ధి పొందాలనే దురుద్దేశంతో ట్రంప్‌ అలాంటి తప్పుడు నిర్ణయాన్ని ప్రకటించినా ఆశ్చర్యపోనవసరం లేదని ప్రతిపక్ష డెమొక్రాట్లు విమర్శిస్తున్నారు. స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసం.. సురక్షితమైందో కాదో.. ప్రభావవంతమైందో కాదో తేలని వ్యాక్సిన్‌ను తొందరపాటుతో అత్యవసర ప్రాతిపదికన వాడకంలోకి తెస్తే అమెరికన్ల ప్రాణాలు అపాయంలో పడతాయని వారు హెచ్చరిస్తున్నారు. ప్లాస్మా థెరపీ అత్యవసర వాడకానికి ఇచ్చిన అనుమతులను నిలుపుదల చేసిన ఎఫ్‌డీఏపై ఒత్తిడి పెంచి.. మళ్లీ అనుమతులను ట్రంప్‌ మంజూరు చేయించిన విషయాన్ని వారు ఈసందర్భంగా గుర్తుచేస్తున్నారు. ఇదే విధమైన ఏకపక్ష వైఖరితో ప్రయోగ పరీక్షలు పూర్తిచేసుకోని ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్‌ను ‘అత్యవసరం’ పేరిట అమెరికన్లపై రుద్దే అవకాశాలు ఉన్నాయని డెమొక్రాట్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సాక్షాత్తూ అమెరికా వైట్‌హౌ్‌సకు ఆరోగ్యరంగ సలహాదారుగా వ్యవహరిస్తున్న డాక్టర్‌ ఆంటోనీ ఫౌచీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంకా భద్రత, ప్రభావశీలతలు సాధించని వ్యాక్సిన్‌ను అత్యవసర ప్రాతిపదికన వాడకంలో తేవాలనుకోవడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. అలాంటి అసంబద్ధ నిర్ణయాలు.. అభివృద్ధి దశలో ఉన్న ఇతరత్రా వ్యాక్సిన్ల ప్రయోగాలపై ప్రతికూల ప్రభావం చూపుతాయన్నారు. మరోవైపు బ్రిటన్‌లోని ఆక్స్‌ఫర్డ్‌ వర్సిటీ మాత్రం వ్యాక్సిన్‌ ప్రయోగాలను నిదానంగా ముందుకు తీసుకెళ్తోంది. ప్రయోగాల పూర్తి వివరాలతో కూడిన సమగ్ర నివేదికను ఈ ఏడాది చివరికల్లా ఔషధ నియంత్రణ సంస్థల పరిశీలనకు పంపుతామని ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్‌ గ్రూప్‌ డైరెక్టర్‌, ముఖ్య శాస్త్రవేత్త ఆండ్రూ పోలార్డ్‌ వెల్లడించారు.