WorldWonders

జైపూర్ యాచకుల్లో పోస్ట్ గ్రాడ్యూయేట్లు

జైపూర్ యాచకుల్లో పోస్ట్ గ్రాడ్యూయేట్లు

ఇది నిజంగా ఆశ్చర్యపోయే విషయం. ఏ చదువూ, ప్రావీణ్యమూ, కష్టపడే శక్తీ లేనివారే యాచన వృత్తిలో ఉంటారనుకుంటాం. కానీ, వారిలో ఉన్నత విద్యావంతులు కూడా ఉన్నారని ఇటీవల రాజస్థాన్‌ రాజధాని జైపూర్‌లో జరిగిన సర్వేలో తేలింది. ఈ సర్వేలో ఇంకా చాలా విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి. చదువుకొన్నవారికి సైతం కనీస ఉపాధి కల్పించలేని స్థితిలో పాలకులు ఉన్నారు.
జైపూర్‌ ప్రాంతంలో మొత్తం 1162 మంది యాచకులు ఉన్నట్లు సర్వేలో తేలింది. వారిలో ఐదుగురు పోస్టు గ్రాడ్యుయేట్లు! 193 మంది పాఠశాల విద్యను పూర్తిచేశారు. మిగిలిన వారిలో 39 మంది అక్షరాస్యులు. 903 మంది మాత్రమే నిరక్షరాస్యులు ఉన్నట్లు సర్వే గుర్తించింది. జైపూర్‌ సిటీని యాచకుల లేని నగరంగా తీర్చిదిద్దాలని అక్కడి అధికారులు నిర్ణయించారు. అందులో భాగంగా పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో ఈ సర్వే జరిగింది. యాచకులను ఆ వృత్తి మాన్పించి వారి ఆసక్తులను బట్టి ఉపాధి కల్పించడమో, పునరావాసం చూపించడమో చేయాలని అధికారులు భావించారు. అయితే మొత్తం యాచకుల్లో 160 మంది మాత్రమే ఏ పనీ చేయడానికి ఇష్టపడలేదు. 117 మంది పనిచేసేందుకు సిద్ధమయ్యారు. 27 మంది యాచకులు విద్యారంగంలో తోడ్పాటునిచ్చేందుకు ఆసక్తి కనబరచారు. కొంతమంది క్యాటరింగ్‌, చేతివృత్తులు, హోటల్‌ పని వంటి వివిధ రకాల పనులు చేసేందుకు ఇష్టపడ్డారు. వారి వయస్సులపై కూడా సర్వే నిర్వహించారు. వారిలో 273 మంది 31 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్కులు. 259 మంది 41 నుంచి 50 ఏళ్ల వయస్సువారు, పదేళ్ల వయస్సు కంటే చిన్నవారు 52 మంది, 11 నుంచి 20 ఏళ్ల యుక్త వయస్సు వారు 80 మంది ఉన్నారు. దేశంలోని యాచకులందరి వాస్తవ స్థితిగతులు, విద్యా ర్హతల మీద సర్వే చేస్తే .. ఇలాంటి విస్తుపోయే నిజాలు ఇంకెన్ని బయటపడతాయో!