DailyDose

ఎస్పీబీకి ఫిజియోథెరపీ-తాజావార్తలు

ఎస్పీబీకి ఫిజియోథెరపీ-తాజావార్తలు

* కరోనాతో పోరాడుతూ చెన్నై ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆయన తనయుడు ఎస్పీ చరణ్‌ తెలిపారు. గురువారం ఎస్పీ బాలుకి వైద్యులు ఫిజియోథెరపీ చికిత్స కూడా చేసినట్లు పేర్కొన్నారు. ‘‘ఆస్పత్రి వర్గాలు చెప్పిన దాని ప్రకారం నాన్న ఆరోగ్యం నిలకడగా ఉంది. నెమ్మదిగా కోలుకుంటున్నారు. ఫిజియోథెరపీ చికిత్స కూడా అందించారు. అయితే, నాన్నను నేను చూడలేదు. వైద్యుల చికిత్సకు ఆయన స్పందిస్తున్నారు. నాన్న ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంలో ఎంజీఎం ఆస్పత్రి వర్గాలు, వైద్యుల కృషి అనిర్వచనీయం. వారికి కృతజ్ఞతలు. అదే సమయంలో అభిమానులు, శ్రేయోభిలాషులు ఆయన కోసం ప్రార్థనలు చేస్తున్నందుకు ధన్యవాదాలు. భవిష్యత్‌లో మరిన్ని అప్‌డేట్‌లు ఇస్తా’’ అని ఎస్పీ చరణ్‌ అన్నారు.

* తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో సీఐఐ(కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఇండస్ట్రీ) కీలకపాత్ర పోషిస్తోందని పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. పెట్టుబడులే లక్ష్యంగా ‘ఇన్వెస్ట్ ఇన్ తెలంగాణ’ పేరుతో భారతీయ పరిశ్రమల సమాఖ్య ఓ భారీ వర్చువల్ సదస్సు, ప్రదర్శనను గురువారం ప్రారంభించింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో నేటి నుంచి నవంబర్ 24 వరకు 90 రోజుల పాటు ఈ వర్చువల్ ప్రదర్శన జరగనుందని ప్రకటించింది. దీనికి సంబంధించిన సన్నాహక సదస్సు రెండురోజుల పాటు జరగనుండగా.. ఇవాళ్టి ప్రారంభ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. ముందుగా నిజామాబాద్ జిల్లా అభివృద్ధి ప్రణాళికను ఈ సందర్భంగా మంత్రి ఆవిష్కరించారు.

* కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు వ్యాక్సిన్‌ కోసం ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. వీటిలో మోడెర్నాతోపాటు ఆస్ట్రాజెనికా, ఫైజర్‌ తయారుచేసిన వ్యాక్సిన్‌ ప్రయోగాలు తుదిదశకు చేరుకున్నాయి. అయితే వీటిలో తాజాగా మోడెర్నా మరో పురోగతి సాధించింది. ప్రయోగదశల్లో ఉన్న తమ వ్యాక్సిన్‌ యువకుల్లో మాదిరిగానే వృద్ధుల్లోనూ రోగనిరోధకత పెంచే కణాలు ప్రేరేపితమవుతున్నట్లు గుర్తించారు. ఇప్పటివరకు ఉన్న ప్రాథమిక సమాచారం ఆధారంగా ఈ అంచనాకు వచ్చినట్లు మోడెర్నా పేర్కొంది. దీంతో వైరస్‌తో ఎక్కువ ముప్పు ఉన్న వృద్ధుల్లో కూడా మెరుగైన ఫలితాలు కనిపించడం ఆశలు రేకెత్తిస్తోంది.

* కొద్ది నెలల క్రితం భారత్-చైనా సరిహద్దులో మొదలైన ఉద్రిక్త వాతావారణం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. దానికి ముగింపు పలికేందుకు ఇరు దేశాలకు చెందిన దౌత్య, సైనికాధికారుల మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో సరిహద్దు వివాదంపై భారత విదేశాంగ మంత్రి ఎస్‌ జైశంకర్ మాట్లాడుతూ.. ‘ఇది ఖచ్చితంగా 1962 తరవాత అత్యంత తీవ్ర పరిస్థితి’ అని అభిప్రాయపడ్డారు. ఆయన రాసిన ‘ద ఇండియా వే: స్ట్రాటజీస్‌ ఫర్ యాన్‌ అన్ ‌సర్టైన్‌ వరల్డ్’ పుస్తకం విడుదల కానున్న తరుణంలో ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. సరిహద్దుల వద్ద పరిస్థితి తీవ్రతను తెలియజేశారు.

* తెలంగాణకు చెందిన సినీ దర్శకుడు శంకర్‌కు రాష్ట్ర ప్రభుత్వం భూమి కేటాయింపుపై హైకోర్టులో విచారణ జరిగింది. రూ.2.5కోట్ల విలువ చేసే భూమిని రూ.25లక్షలకు ఎలా కేటాయిస్తారని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. తెలంగాణ ఉద్యమంలో శంకర్‌ కీలకపాత్ర పోషించారని అడ్వొకేట్‌ జనరల్‌ ఉన్నత న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. తెలంగాణ కోసం త్యాగం చేసిన వేలమందికి అలాగే ఇస్తారా?.. ప్రభుత్వమే సొంతంగా సినిమా స్టూడియో నిర్మించవచ్చు కదా? అని ప్రశ్నించింది.

* నర్సాపురం వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని కొనసాగిస్తున్నారు. గరువారం దిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ… కళ్లుండి మనసులేని ప్రభుత్వాలు చేస్తున్న అన్యాయాలను కళ్లు లేని మనసున్న న్యాయస్థానాలు న్యాయం చేస్తున్నాయని వ్యాఖ్యానించారు. గాంధేయమార్గంలో న్యాయంకోసం పోరాటం చేయాలని అమరావతి రైతులకు సూచించారు.

* ప్రపంచవ్యాప్తంగా బాగా పాపులారిటీ సంపాదించిన ‘బిగ్‌ బాస్‌’ కార్యక్రమం గురించి అందరికీ తెలిసిందే కదా..! తెలుగులోనూ నాలుగో సీజన్‌ రాబోతోంది. ఈ కార్యక్రమంలో కొందరిని ఓ ఇంట్లోకి పంపి అటు ఇటుగా ఓ 100 రోజులపాటు ఉంచుతారు. ఆ ఇంట్లో వాళ్లు ఏం చేస్తున్నారు? ఏం మాట్లాడుకుంటున్నారు? ఏం తింటున్నారు? ఇలా వారి జీవితంలోని 100 రోజులను ఆ ఇంట్లో అమర్చిన పదుల సంఖ్యలో కెమెరాలు రికార్డు చేస్తుంటాయి. అదే తరహాలో ఓ వ్యక్తి ఏకంగా ఏడాదిపాటు తన జీవితాన్ని రికార్డు చేశాడు.

* దేశంలో శరవేగంగా వ్యాప్తి చెందుతున్న కరోనా బారినపడిన ప్రముఖుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ఇప్పటికే ఐదుగురు కేంద్రమంత్రులు కొవిడ్‌ బారినపడగా.. తాజాగా మరోకరికి ఈ వైరస్‌ సోకింది. తనకు కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు కేంద్ర సామాజిక న్యాయశాఖ సహాయ మంత్రి కృష్ణపాల్‌ గుర్జార్‌ బుధవారం వెల్లడించారు. 63 ఏళ్ల కష్ణపాల్‌.. ఫరీదాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.