DailyDose

మెరుగ్గా ఎస్పీబీ ఆరోగ్యం-తాజావార్తలు

మెరుగ్గా ఎస్పీబీ ఆరోగ్యం-తాజావార్తలు

* కరోనాతో పోరాడుతూ చెన్నై ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రముఖ గాయకుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. ‘‘కరోనాతో బాధపడుతూ ఎంజీఎం హెల్త్‌కేర్‌లో చేరిన ఎస్పీ బాల సుబ్రహ్మణ్యంకు వెంటిలేటర్‌, ఎక్మో సహాయం చికిత్స కొనసాగుతోంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. వైద్యులు అడిగిన దానికి ఆయన స్పందిస్తున్నారు. ఫిజియోథెరపీ చికిత్స కూడా చేస్తున్నాం. వైద్య నిపుణుల బృందం ఎప్పటికప్పుడు ఎస్పీబీ ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తోంది’’ అని ఎంజీఎం ప్రకటనలో తెలిపింది. మరోవైపు ఎస్పీబీ తనయుడు ఎస్పీ చరణ్‌ కూడా తన తండ్రి ఆరోగ్యంపై స్పందించారు. ‘నాన్న ఆరోగ్యం రోజు రోజుకీ మెరగవుతోంది. నిన్నటి పోలిస్తే, ఈ రోజు ఇంకాస్త కోలుకున్నారు. ఇదొక శుభపరిణామం. వైద్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అందరి ప్రార్థనలకు ధన్యవాదాలు.’’ అని చరణ్‌ వీడియో సందేశంలో తెలిపారు.

* సెప్టెంబరు 19 నుంచి 28 వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఏకాంతంగా నిర్వహిస్తామని తితిదే ఛైర్మన్‌ వై.వి.సుబ్బారెడ్డి తెలిపారు. తిరుమల అన్నమయ్య భవన్‌లో తితిదే పాలకమండలి సమావేశం ముగిసింది. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ…కరోనా కారణంగా స్వామివారి వాహన సేవలు మాడవీధుల్లో నిర్వహించే పరిస్థితి లేదన్నారు. బ్రహ్మోత్సవాలు ఏకాంతంగా ఆలయంలోనే నిర్వహిస్తామని వెల్లడించారు. అధికమాసం కారణంగా రెండు సార్లు బ్రహ్మోత్సవాలు వచ్చాయని వివరించారు.

* నగరంలోని బస్తీ దవాఖానాల ద్వారా పేద ప్రజలకు ప్రాథమిక ఆరోగ్య సేవలు అందడం పట్ల పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు. బస్తీ దవాఖానాలపై శుక్రవారం అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. సమీక్షకు వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్‌ వాకాటి కరుణ, జిల్లాల కలెక్టర్లు, పురపాలక శాఖ, జీహెచ్ఎంసీ అధికారులు హాజరయ్యారు. ప్రజారోగ్యాన్ని కాపాడటంలో బస్తీ దవాఖానాలు విజయవంతమయ్యాయని కేటీఆర్‌ చెప్పారు. హైదరాబాద్‌ పరిధిలోని 197 బస్తీ దవాఖానాలు, నగరంలోని ఇతర ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా ప్రతి రోజు 5వేలకు పైగా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

* ఆవ భూముల అక్రమాలపై ఏపీ హైకోర్టు సీబీఐతో ప్రాథమిక విచారణకు ఆదేశించడం ఆహ్వానించదగ్గ పరిణామమని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. రూ.వందలకోట్ల అక్రమాలపై సీబీఐ నిగ్గు తేలుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. దిల్లీలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి ప్రహ్లాద్‌ సింగ్‌ను కలిసిన అనంతరం రఘురామకృష్ణరాజు మీడియాతో మాట్లాడారు. హైకోర్టు వద్దని చెప్పినా ఖాతరు చేయకుండా విశాఖ కాపులుప్పాడ వద్ద 30 ఎకరాల గ్రేహౌండ్స్‌ భూమిని ప్రభుత్వానికి అప్పగించాలంటూ సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి(రాజకీయ) ప్రవీణ్‌ ప్రకాశ్‌ ఆదేశాలు జారీ చేశారని.. ఇది కోర్టులను అపహాస్యం చేయడం కాదా? అని రఘురామకృష్ణరాజు ప్రశ్నించారు.

* అనారోగ్యం కారణంగా తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు జపాన్‌ ప్రధాని షింజో అబె శుక్రవారం ప్రకటించారు. తాను కొంతకాలంగా పెద్దపేగు సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్లు ఆయన వెల్లడించారు. ‘ప్రధాని పదవి నుంచి దిగిపోవాలని నేను నిర్ణయం తీసుకున్నాను. ఆత్మవిశ్వాసంతో ప్రజలను పాలించే స్థితిలో లేను. అందుకే ఇకపై ఆ పదవిలో కొనసాగకూడదని అనుకున్నాను. కరోనా వైరస్‌ క్లిష్టకాలం, పలు విధాన నిర్ణయాలు అమలు దశకు రాకముందే, ఏడాది పాటు పదవీకాలం మిగిలుండగానే.. రాజీనామా చేస్తున్నందుకు క్షమాపణలు కోరుతున్నాను’ అని ముందుకు వంగి ప్రజలను అభ్యర్థించారు.

* మీరు ఎవరైనా ప్రముఖుల నుంచి ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు. లేదంటే ఓ సెమినార్‌ జరుగుతోంది అనుకుందాం. ఆ సమయంలో అవతలి వ్యక్తి చెప్పేది జాగ్రత్తగా నోట్‌ చేసుకుంటారు. లేదంటే ఫోన్‌లో రికార్డ్‌ చేసుకుంటారు. తర్వాత దాన్ని కంప్యూటర్‌లో టైప్‌ చేసి డాక్యుమెంట్ ఫార్మాట్ రూపొందిస్తారు. ఇదంతా ఒక క్రమపద్ధతిలో జరిగే ప్రక్రియ. ఇందులో టైపింగ్‌ చేయడం ఒకెత్తయితే, టైపింగ్‌లో తప్పులు జరగడం, వాటిని సరిదిద్దడం మరో ఎత్తు. ఇలాంటి టైపింగ్ కష్టాలకు చెక్‌ పెడుతూ మైక్రోసాఫ్ట్ సరికొత్త ఫీచర్స్‌ను పరిచయం చేసింది. ట్రాన్స్‌స్క్రైబ్, డిక్టేట్ అనే రెండు కొత్త ఫీచర్లను మైక్రోసాఫ్ట్‌ వర్డ్‌లో తీసుకొచ్చింది.

* ఎక్కడైనా పర్యటక ప్రాంతాలంటే ప్రాచీన భవనాలు, వినూత్న పార్కులు, సరస్సులు, ఆలయాలు వంటివి ఉంటాయి. కానీ, జర్మనీలో పాలు, పాల ఉత్పత్తులు విక్రయించే ఓ దుకాణం సందర్శక ప్రదేశంగా మారిపోయింది. కరోనా కారణంగా ఇప్పుడు పర్యటనలు లేవు గానీ.. ఈ దుకాణాన్ని ఏటా ఐదు లక్షల మంది సందర్శిస్తారట. అంతలా ఆ పాల దుకాణంలో ఏం ప్రత్యేకత ఉంది.. అనుకుంటున్నారా? డ్రెస్‌డెన్‌లోని బట్జ్‌నర్‌లో 79వ వీధిలో ఫండ్స్‌ మోక్‌రెయి అనే పాల దుకాణం ఉంది. పేరుకు దుకాణమే అయినా అదో ప్యాలెస్‌. లోపలికి అడుగుపెడితే రాజుల కాలం నాటి ప్యాలెస్‌లో అడుగుపెట్టామా అన్న అనుభూతి కలుగుతుందట.

* దేశీయ స్టాక్‌ మార్కెట్లు వరుసగా ఆరో రోజూ లాభాల్లో ముగిశాయి. బ్యాంక్‌షేర్ల అండతో సెన్సెక్స్‌, నిఫ్టీ ఆరు నెలల గరిష్ఠానికి చేరాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 27 తర్వాత స్టాక్‌మార్కెట్లు ఈ మార్కును అందుకోవడం ఇదే తొలిసారి. ఇండస్‌ ఇండ్ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌ వంటి షేర్లు రాణించడంతో మార్కెట్లు దూసుకెళ్లాయి. బ్యాంకింగ్‌ వ్యవస్థ ఇప్పటికీ బలంగా, స్థిరంగా ఉందంటూ ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ వ్యాఖ్యలు ఇందుకు దోహదపడ్డాయి. 353.84 పాయింట్ల లాభంతో 39,467.31 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 96 పాయింట్ల లాభంతో 11,655.25 వద్ద స్థిరపడింది.

* అంతర్జాతీయ క్రికెట్లో అరుదైన ఘనతలు ఎన్నో ఉన్నాయి. ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు, త్రిశతకాలు నమోదు చేయడం, హ్యాట్రిక్‌ వికెట్లు తీయడం, ఒకే టెస్టులో 10 వికెట్లు పడగొట్టడం వంటివి ఎన్నో చూశాం. కానీ ఒకే ఒక్క ఆటగాడు మాత్రమే నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు రెండుసార్లు తీసి చరిత్ర సృష్టించాడు. అతడే శ్రీలంక వెటరన్‌ పేసర్‌ లసిత్‌ మలింగ. శుక్రవారం (ఆగస్టు 28) అతడు 37వ వసంతంలోకి అడుగుపెట్టాడు.

* ఇటీవల మృతి చెందిన బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసులో మాదకద్రవ్యాల కోణం బయటపడిన సంగతి తెలిసిందే. దానికి సంబంధించి నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో(ఎన్‌సీబీ) కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. ఈ క్రమంలో సుశాంత్‌కు మాదకద్రవ్యాలు ఇచ్చినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రధాన నిందితురాలు రియా చక్రవర్తి స్పందించారు. ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ..తాను ఎప్పుడు వాటిని వినియోగించలేదని వెల్లడించారు.

* కొవిడ్‌-19ను కారణంగా చూపి ఎన్నికల్ని వాయిదా వేయమని ఆదేశాలు జారీ చేయలేమని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. కరోనా వైరస్‌ ముక్త రాష్ట్రంగా అవతరించే వరకు బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికల్ని వాయిదా వేయాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరించేందుకు తిరస్కరించింది. ఈ విషయంలో కేంద్ర ఎన్నికల సంఘమే నిర్ణయాలు తీసుకుంటుందని స్పష్టం చేసింది. ఇంకా నోటిఫికేషన్‌ వెలువడకముందే పిటిషన్‌ దాఖలు చేయడం తొందరపాటు చర్య అని జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం అభిప్రాయపడింది.