Food

పైనాపిల్‌తో థాయ్ అద్భుత వంటకాలు

థాయ్‌లాండ్‌లో ఇది చాలా ఫేమస్. వంటింట్లోనే ఉండే పదార్థాలతో పైనాపిల్‌తో అద్భుతమైన థాయ్ వంటకం :
పైనాపిల్ తియ్యగా..పులపుల్లగా భలే ఉంటుంది. ఈ పండుతో టేస్టీ జూస్‌లు, స్వీట్సే కాదు.. అద్భుతమైన అన్నం కూడా వండుకోవచ్చు. అదే థాయ్ పైనాపిల్ రైస్..! అసలు చూడ్డానికే చాలా కలర్ ఫుల్‌గా ఉంటుంది. తింటే రుచి కూడా అదిరిపోతుంది. పైనాపిల్‌తో ఎన్నో వంటకాలు చూసి ఉంటారు. కానీ థాయ్‌లాండ్‌లో ఇది చాలా ఫేమస్. వంటింట్లోనే ఉండే పదార్థాలతో ఈ వెరైటీ రెసిపీని తయారు చేయవచ్చు. మరి దాని తయారీ విధానాన్ని ఇక్కడ చూడండి.

*** కావాల్సిన పదార్థాలు:
250 గ్రాముల బియ్యం, ఒక కప్పు పైనాపిల్ ముక్కలు, 2 ఉల్లిపాయల ముక్కలు, 2 అల్లం ముక్కలు, 5 తాజా పసుపు ముక్కలు, 5 కరివేపాకు రెబ్బలు, 2 కాడల లెమన్ గ్రాస్ ముక్కలు, ఒక కప్పు కొబ్బరి పాలు, తగినంత ఉప్పు, తగినంత నూనె, రెండు కప్పుల నీళ్లు, చిటికెడు పసుపు, కర్రీ పౌడర్, ఒక పైనాపిల్ పండు.

*** తయారీ విధానం
బియ్యంను కనీసం 30 నిమిషాల పాటు నానబెట్టాలి. ఓ ప్యాన్ స్టవ్‌పై పెట్టి వేడిచేసి నూనె పోయాలి. ఆ తర్వాత ఉల్లిపాయల తురుము వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి.అందులో అల్లం, కరివేపాకు, పసుపు, లెమన్ గ్రాస్ వేసి కాసేపు మగ్గనివ్వాలి. అనంతరం ఆ మిశ్రమంలో నానబెట్టిన బియ్యం వేసి కర్రీ పౌడర్‌, పసుపు వేయాలి. రుచికి సరిపడా ఉప్పు వేసి కలుపుకోవాలి.కాసేపయ్యాక కొబ్బరిపాలు, పైనాపిల్ ముక్కలు, నీళ్లు పోసి మూతపెట్టాలి.గాలిచొరబడకుండా మూతపెట్టి సన్నని మంటపై దమ్ చేయాలి.ఇప్పుడు ఓ పైనాపిల్ పండును తీసుకొని నిలువుగా సగానికి కోయాలి. మధ్యలో ఉన్న పండును మొత్తం జాగ్రత్తగా తీసి బ్యారెల్ ఆకారంలోకి తీసుకురావాలి. ఆ పండులో పైనాపిల్ రైస్‌ను వేసి..సిల్వర్ ఫాయిల్‌ను చుట్టి, మరికాసేపు కుక్ చేసుకోవాలి. అనంతరం సిల్వర్ ఫాయిల్ తొలగించి వేడి వేడిగా అన్నం వడ్డించుకుంటే రుచి మామూలుగా ఉండదు.