Kids

వూహాన్‌లో మొదలైన విద్యాలయాలు

వూహాన్‌లో మొదలైన విద్యాలయాలు

కరోనావైరస్‌ పుట్టిల్లుగా భావిస్తోన్న చైనా నగరం వుహాన్‌లో మంగళవారం నుంచి బడిగంటలు మోగనున్నాయి. ఆ నగరంలోని కిండర్‌గార్డెన్స్‌తో సహా అన్ని పాఠశాలలు ప్రారంభంకానున్నాయని అక్కడి అధికారులు శుక్రవారం వెల్లడించారు. వుహాన్‌లోని 2,842 విద్యాసంస్థలు తెరుస్తుండటంతో.. సుమారు 14లక్షల మంది విద్యార్థులు తరగతులకు హాజరుకానున్నారని అధికారులు తెలిపారు. అలాగే వుహాన్‌ విశ్వవిద్యాలయం సోమవారం నుంచే కార్యకలాపాలు ప్రారంభించనుంది. కాగా, విద్యార్థులు మాస్కులు ధరించాలని, సాధ్యమైనంత వరకు ప్రజారవాణాను ఆశ్రయించవద్దని వారు సూచించారు. అలాగే పాఠశాల వద్ద తప్పకుండా వ్యాధి నియంత్రణ పరికరాలు సిద్ధంగా ఉండాలని తమ ఆదేశాల్లో పేర్కొన్నారు. కొత్త మహమ్మారులు దాడి చేసినా..వాటిని ఎదుర్కొనేలా విద్యార్థులకు కసరత్తులు, శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. అనవసరంగా గుంపులుగా చేరవద్దని, పాఠశాలలు ఎప్పటికప్పుడు వైద్య సిబ్బందికి నివేదికలు అందజేయాలన్నారు. విద్యాసంస్థల నుంచి సమాచారం అందని విదేశీ విద్యార్థులు, ఉపాధ్యాయులు తిరిగి పాఠశాలకు రావడానికి మాత్రం అనుమతి లభించలేదు. ఇదిలా ఉండగా..ఒకవేళ పరిస్థితి చేయిదాటితే తిరిగి ఆన్‌లైన్‌ తరగతులకు మారేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు వారు వెల్లడించారు. కాగా, వైరస్‌ ప్రారంభ దశలో దాని ధాటికి వుహాన్‌ నగరం వణికిపోయింది. ఆ తీవ్రతకు అడ్డుకట్ట వేసేందుకు చైనా ప్రభుత్వం జనవరి చివరి నుంచి రెండు నెలలకు పైగా ఆ నగరంలో లాక్‌డౌన్ విధించింది.